వేతన వెతలు.. | - | Sakshi
Sakshi News home page

వేతన వెతలు..

Sep 28 2026 7:39 AM | Updated on Sep 28 2026 7:39 AM

వేతన వెతలు..

నాలుగు నెలలుగా జీతాలు అందక అవస్థలు గురుకుల పార్ట్‌టైమ్‌ టీచర్లకు తప్పని నిరీక్షణ పెండింగ్‌ జీతాలు చెల్లించాలి.. సేవా భద్రత కల్పించాలని డిమాండ్‌ నేటి నుంచి విజయవాడ ధర్నాచౌక్‌లో మహాధర్నా

ఒంగోలు సిటీ:

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాలు, కళాశాలల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్‌ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు నెలల తరబడి వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 1,800 మందికి పైగా పార్ట్‌టైమ్‌ టీచర్లు, లెక్చరర్లు ఏళ్లుగా సేవలందిస్తున్నా.. వేతనాల చెల్లింపులో జాప్యం, ఉద్యోగ భద్రత లేకపోవడం సమస్యగా మారింది. పెండింగ్‌ వేతనాలు వెంటనే విడుదల చేయడంతోపాటు సేవా భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం విజయవాడ ధర్నాచౌక్‌లో మహాధర్నా చేపట్టనున్నట్లు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులం పార్ట్‌టైమ్‌ టీచర్స్‌ అండ్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు వెల్లడించారు.

భద్రత ఏదీ?

సంవత్సరాలుగా పనిచేస్తున్న పార్ట్‌టైమ్‌ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సంఘం కోరింది. రెగ్యులర్‌ నియామకాలు, బదిలీలు తదితర కారణాలతో సేవలు కోల్పోయే పరిస్థితి వస్తే సమీప గురుకులాల్లోని ఖాళీలకు సీనియారిటీ ఆధారంగా సర్దుబాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేసింది. పని బాధ్యతలు, పనివేళలు, సెలవులు, సీనియారిటీ, నిరంతర సేవపై స్పష్టమైన విధానం రూపొందించాలని కోరింది. గౌరవ వేతనాలు పెంచడంతోపాటు పీఎఫ్‌, ఆరోగ్య బీమా, ప్రసూతి, అత్యవసర వైద్య సెలవులు వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేసింది. సేవలో ఉండగా మృతి చెందిన ఉపాధ్యాయులు, అధ్యాపకుల కుటుంబాలను ఆదుకోవాలని కోరింది.

పలుమార్లు వినతులు..

తమ సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా పరిష్కారం లభించలేదని సంఘం నాయకులు తెలిపారు. ఇక ఉద్యమబాట పట్టక తప్పడం లేదన్నారు. తమ ఆందోళనకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, దళిత, గిరిజన, విద్యార్థి, యువజన సంఘాలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

సమస్యలు పరిష్కరించకపోతే

ఉద్యమం ఉధృతం

వేతనాలు సకాలంలో అందక పార్ట్‌టైమ్‌ ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులను, ప్రజాప్రతినిధులను పలుమార్లు కలిసి వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.

– బి.ఇస్మాయిల్‌, రాష్ట్ర అధ్యక్షుడు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులం పార్ట్‌టైమ్‌ టీచర్స్‌, లెక్చరర్స్‌ అసోసియేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement