తీగలు తగిలి.. ఊపిరి వదిలి..! | - | Sakshi
Sakshi News home page

తీగలు తగిలి.. ఊపిరి వదిలి..!

Sep 28 2026 7:39 AM | Updated on Sep 28 2026 7:39 AM

● కంభం మండలంలోని జంగంగుంట్లలో రైతు బిజ్జాల పెద్ద శ్రీను(59) గేదెల కోసం పచ్చిగడ్డి కోస్తున్నాడు. పొలానికి రక్షణగా ఏర్పాటు చేసుకున్న సోలార్‌ కంచైపె ఈదురు గాలులకు విద్యుత్‌ మోటార్‌ ప్యానెల్‌ బోర్డు తీగలు కంచైపె పడ్డాయి. కంచె అంచులలో గడ్డి కోస్తూ పెద్ద శ్రీను విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?

పసివాళ్లు, మహిళలు, అన్నదాతలకు మృత్యుపాశాలుగా అక్రమ విద్యుత్‌ కంచెలు చిన్నపాటి గాలికే తెగిపడి ఆయువును హరిస్తున్న హైటెన్షన్‌, ఎల్‌టీ వైర్లు పెద్ద దిక్కు కోల్పోయి రోడ్డున పడుతున్న కుటుంబాలు బాధిత కుటుంబాలకు పరిహారం మంజూరులో బాబు సర్కారు నిర్లక్ష్యం నాణ్యమైన పరికరాలు, సరైన రక్షణ చర్యలతోనే ప్రాణాలకు రక్ష

రోడ్డున పడుతున్న కుటుంబాలు

నాణ్యమైన పరికరాలే శ్రీరామరక్ష

పంట రక్షణ కోసం మెయిన్‌ లైన్ల నుంచి నేరుగా తీగలకు విద్యుత్‌ సరఫరా చేయడం చట్టప్రకారం తీవ్రమైన నేరం. నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేయవచ్చు. దీనివల్ల ప్రాణనష్టం జరిగితే హత్యానేరం కింద శిక్షార్హులవుతారు.

సోలార్‌ ఫెన్సింగ్‌ వాడే రైతులు కేవలం అనుమతి పొందిన, నాణ్యమైన పరికరాలను మాత్రమే వినియోగించాలి. ఇవి స్వల్ప విద్యుత్‌ షాక్‌ ఇచ్చి జంతువులను భయపెడతాయి తప్ప ప్రాణహాని కలిగించవు.

స్టార్టర్లు, కేబుల్‌ వైర్లు, స్విచ్‌బోర్డులు కొనుగోలు చేసేటప్పుడు నాణ్యమైన ఐఎస్‌ఐ మార్కు ఉన్నవే వాడాలి. లోకల్‌ కంపెనీల నాసిరకం పరికరాల వల్ల విద్యుత్‌ లీకేజీ ప్రమాదాలు పెరుగుతాయి.

మోటార్‌ స్టార్టర్‌ బోర్డులకు సరైన ఎర్తింగ్‌ ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా విద్యుత్‌ లీకేజీలను వెంటనే గుర్తించి సరఫరా ఆపేసే ఈఎల్‌సీబీ(ఎర్త్‌ లీకేజ్‌ సర్క్యూట్‌ బ్రేకర్‌) లేదా ఆర్సీసీబీ(రెసిడ్యువల్‌ కరెంట్‌ సర్క్యూట్‌ బ్రేకర్‌) లాంటి రక్షణ పరికరాలను బిగించుకోవాలి.

పొలంలోకి దిగే ముందు విద్యుత్‌ తీగలు ఎక్కడైనా తెగిపడ్డాయా, నీటిలో పడి ఉన్నాయా అని దూరం నుంచే క్షుణ్ణంగా పరిశీలించాలి.

చేను బాట పట్టిన అన్నదాత ఇంటికి తిరిగిరాలేదు.. పశువుల మేత కోసం వెళ్లిన మహిళ విగతజీవిగా మారింది.. పెంపుడు మూగజీవాన్ని కాపాడబోయిన పసివాడు అక్కడికక్కడే శవమయ్యాడు! అడవి పందుల బెడద నుంచి పంటను కాపాడుకునేందుకు కొందరు వ్యవహరిస్తున్న తీరు అమాయకుల నిండు ప్రాణాలను బలితీసుకుంటోంది. మరోవైపు చిన్నపాటి ఈదురుగాలులకే తెగిపడుతున్న తీగలు, అధికారుల తీవ్ర నిర్లక్ష్యం కలగలిసి ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ప్రజల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి.

బేస్తవారిపేట: ప్రాణాలు గాల్లో కలుస్తున్నా, కుటుంబాలకు కుటుంబాలే రోడ్డున పడుతున్నా విద్యుత్‌ శాఖ నిద్రమత్తు వీడటం లేదు. ఇంకా ఎంతమంది బలయ్యాక ఆ శాఖ అధికారులు కళ్లు తెరుస్తారోనని ప్రజ లు బాహాటంగానే విమర్శిస్తున్నారు. పంటలను అడవి పందులు, ఇతర జంతువుల బారి నుంచి కాపాడుకునేందుకు కొందరు రైతులు విచక్షణ మరిచి పొలాల చుట్టూ ఇనుప కంచెలకు నేరుగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. విద్యుత్‌ లైన్ల నుంచో, ట్రాన్స్‌ఫార్మర్ల నుంచో అక్రమంగా కనెక్షన్లు ఇచ్చి ఈ ప్రాణాంతక ఉచ్చులు బిగిస్తున్నారు. ఫలితంగా అమాయకులు బలవుతున్నారు. విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది ఉదాసీన వైఖరే ఇందుకు కారణమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలను పరిశీలిస్తే..

పెంపుడు కుక్కను లేపబోయి పసివాడు..

ఈనెల 17న మర్రిపూడి మండలం గార్లపేటలో 4వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలుడు వరుణ్‌తేజ్‌ ఆడుకుంటూ పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ వరి చేను చుట్టూ ఏర్పాటు చేసిన కరెంట్‌ కంచె తగిలి తన పెంపుడు కుక్క చనిపోయి పడి ఉంది. అది తెలియని ఆ చిన్నారి కుక్కను లేపేందుకు తాకడంతో విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

మేత కోసం వెళ్లి మహిళ బలి..

ఈనెల 11వ తేదీన మార్కాపురం మండలం గజ్జలకొండ పంచాయతీ పడమటిపల్లిలో పశువుల మేత కోసం పొలానికి వెళ్లిన రోడ్డ నారమ్మ అనే మహిళ, పొలానికి అక్రమంగా ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి ఏర్పాటు చేసిన కరెంట్‌ కంచె తగిలి మృతి చెందింది. బాధితురాలి మృతదేహాన్ని మాయం చేసేందుకు సదరు రైతు ప్రయత్నించడం గమనార్హం.

పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి మరొకరు..

ఈనెల 20వ తేదీన పొదిలి రూరల్‌ పరిధిలోని మూగచింతలలో బండారు సుబ్బారావు (53) పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లగా, చేను చుట్టూ ఉన్న కంచెకు విద్యుత్‌ సరఫరా జరిగి షాక్‌తో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

వేలాడుతున్న తీగ తగిలి రైతు మృతి:

ఈనెల 20వ తేదీన మార్కాపురం రూరల్‌ పరిధిలోని రాజుపాలెంలో దుగ్గెంపూడి కోటయ్య (38) పొలాల మధ్య అత్యంత ప్రమాదకరంగా కిందకు వేలాడుతున్న విద్యుత్‌ తీగను గమనించక తాకడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీగలు వేలాడుతున్నాయని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈదురుగాలులకు తెగిపడిన 11 కేవీ తీగ..

ఈనెల 21వ తేదీన బేస్తవారిపేట మండలం నేకునంబాద్‌లో రైతు తిప్పిశెట్టి రాధామోహన్‌ (49) మొక్కజొన్న చేనుకు రక్షణగా ఇనుప కంచె వేశారు. రాత్రి వేళ ఈదురుగాలులతో కూడిన వర్షానికి 11 కేవీ విద్యుత్‌ తీగ తెగి ఆ కంచైపె పడింది. ఉదయం పొలానికి వెళ్లిన ఆయన ఈ విషయం గమనించక కంచైపె ఉన్న చొక్కా తీసే ప్రయత్నంలో షాక్‌కు గురై విగతజీవిగా మారాడు.

ప్యానెల్‌ బోర్డు తీగలు సోలార్‌ కంచైపె పడి..

స్టార్టర్‌ వద్ద తెగిన వైరుతో ప్రమాదం

ఈనెల 17న పామూరు మండలం తిరగలదిన్నెలో రైతు బొట్ల రాజు (40) పొలంలో మోటార్‌ ఆపేందుకు వెళ్లిన సమయంలో, స్టార్టర్‌ బోర్డు వద్ద నీటి పైపు పగిలి విద్యుత్‌ తీగ తెగిపడటంతో విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు.

విద్యుదాఘాతానికి యువకుడి బలి

జూలై 10న కొత్తపట్నంలో రైతు బొబ్బాల శ్రీనివాసరావు వద్ద మూడేళ్లుగా జీతానికి పనిచేస్తున్న పులి భద్రినారాయణ (22) గడ్డి పొలానికి నీరు పెడుతుండగా విద్యుత్‌ సరఫరా నిలిచింది. మళ్లీ మోటారు ఆన్‌ చేస్తుండగా షాక్‌ తగిలి ప్రాణాలు కోల్పోయాడు.

చిన్నపాటి గాలికే తెగిపడుతున్న తీగలు

పల్లెల్లో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ అధ్వానంగా తయారైంది. ఏళ్ల తరబడి పాతబడిన తీగలు, ఒరిగిపోయిన స్తంభాలు, సరిగ్గా నిర్వహణ లేని ట్రాన్స్‌ఫార్మర్ల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చిన్నపాటి ఈదురుగాలులు, వర్షం వచ్చినా హైటెన్షన్‌ తీగలు తెగి పొలాల్లో పడుతున్నాయి. పనుల కోసం వెళ్లిన రైతులు, మేతకు వెళ్లిన పశువులకు ఆ తీగలు మృత్యుపాశాలుగా మారుతున్నాయి.

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకపోవడం వల్లే తరచూ విద్యత్‌ ప్రమాదాలు సంభవిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో, పంట పొలాల మధ్య వేలాడుతున్న లూజ్‌ వైర్లను వెంటనే బిగించి సరిచేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అక్రమంగా విద్యుత్‌ కంచెలు ఏర్పాటు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యుత్‌ ప్రమాదాల నివారణపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరుతున్నారు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో చనిపోయిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మృతి చెందిన వారిలో అత్యధికులు కుటుంబానికి ఏకై క ఆధారమైన యజమానులే. రెక్కాడితే గానీ డొక్కాడని వ్యవసాయ కుటుంబాల్లో పెద్ద దిక్కు కోల్పోవడంతో భార్యాపిల్లలు రోడ్డున పడుతున్నారు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన మహిళలు, తండ్రి లేని పిల్లల రోదనలు వర్ణనాతీతంగా ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం నుంచి బాధితులకు సకాలంలో పరిహారం, ఆదరణ అందడం లేదు. ప్రమాదాలు జరిగిన వెంటనే కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవడం తప్ప, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు శాశ్వత ఆర్థిక సహాయం లేదా సంక్షేమ పథకాల ద్వారా చేయూత అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement