ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దివంగత కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 30వ తేదీ ఒంగోలు రానున్నారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్ ఏర్పాటు కోసం పలు స్థలాలను ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు పరిశీలించారు. స్థానిక మంగమ్మ కాలేజీ గ్రౌండ్, ఏబీఎం కాలేజ్ గ్రౌండ్, పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద స్థలాలను పరిశీలించి అనంతరం అనుమతుల కోసం డీఎస్పీ శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు. బూచేపల్లి వెంట పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.


