● ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం
ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జోన్–3 సర్వసభ్య సమావేశాన్ని ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల సభ్యులతో ఒంగోలులోని ఏబీఎం జూనియర్ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అవ్వారు శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుధాకర్, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు శరత్, జిల్లా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో ప్రకాశం జిల్లా అధ్యక్షుడు శరత్ మాట్లాడుతూ సంఘం ప్రాముఖ్యత, లక్ష్యాలు, విధివిధానాలు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సంఘం నిర్వహించాల్సిన బాధ్యతలను సభ్యులకు వివరించారు. ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వార్షికోత్సవాన్ని ఏ విధంగా నిర్వహించాలనే అంశంపై సభ్యుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. అలాగే ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రధానంగా సీపీటీ పరీక్ష నిర్వహణ, సీనియర్ అసిస్టెంట్ల జోనల్ సీనియారిటీ, 2014కు ముందు రికార్డ్ అసిస్టెంట్లుగా నియమితులైన వారికి కూడా సీపీటీ పరీక్ష నిర్వహించడం తదితర అంశాలను సమావేశంలో చర్చించారు. ఈ సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరుతూ ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు శరత్‌కు సంఘ సభ్యులు వినతిపత్రం సమర్పించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ఆర్జేడీ పద్మ అసోసియేషన్ ఉద్యోగులకు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు సంఘ నాయకులు తెలిపారు. ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించినందుకు ఆర్జేడీ పద్మకు అసోసియేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశంలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అజ్మత్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సమద్, రాష్ట్ర కోశాధికారి శ్యాంబాబు, రాష్ట్ర మహిళా కార్యదర్శులు వెంకటేశ్వరి, మనోజ్ఞ, కార్యదర్శి సాయి, ప్రకాశం జిల్లా అధ్యక్షులు సాయి కిషోర్, జిల్లా కార్యదర్శి కిషోర్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు దుర్గా డానియల్‌తో పాటు మూడు జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


