స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇస్తాం | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇస్తాం

Sep 25 2026 2:23 AM | Updated on Sep 25 2026 2:23 AM

కొండపి నియోజకవర్గం మాఫియా దోపిడీకి అడ్డాగా మారింది టీడీపీ వాళ్లు పోలీసుల సహాయంతో గెలవాలని చూస్తున్నారు మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌

సింగరాయకొండ:

స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రి స్వామి తన మంత్రి పదవిని నిలబెట్టుకోవటానికి పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్ని కుయుక్తులు చేసినా అన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇస్తామని, తగ్గేదేలేదని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. మండల కేంద్రంలోని సరస్వతి కళ్యాణ మండపంలో గురువారం పార్టీ మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించిన మండల విస్తృత స్థాయి సమావేశంలో సురేష్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్‌ సురేష్‌ మాట్లాడుతూ మంత్రి స్వామి పోలీసులపై ఒత్తిడి తెచ్చి వైఎస్సార్‌ సీపీ నాయకులపై బైండోవర్‌లు, రౌడీషీట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పాతసింగరాయకొండ గ్రామానికి చెందిన నాయకుడు గాలిబుజ్జిని ఇప్పటికే టీడీపీ నాయకులు రెవెన్యూ అధికారుల సహకారంతో ఆర్ధికంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. గత 30 ఏళ్లుగా ఇటుక బట్టీల వ్యాపారం చేసుకుంటున్న భూమిని ఖాళీ చేయాలని, స్వాధీనం చేసుకుంటామని రెవెన్యూ అధికారుల చేత నోటీసులు పంపారన్నారు. టీడీపీ కుండువా కప్పుకుంటే భూమిపై ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకుంటారని ఆపార్టీ నాయకులు చెప్పారని అయితే బుజ్జి మాత్రం నా స్థలం కాదు కదా ఇల్లు లాక్కున్నా కండువా కప్పుకునే ప్రసక్తే లేదని ఇది మా పార్టీ నాయకుల ధైర్యమని సురేష్‌ ప్రకటించారు. త్వరలో జరిగే పాఠశాల పేరెంట్స్‌ కమిటీ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

నియోజకవర్గంలో మాఫియాకు అడ్డేలేదు:

నియోజకవర్గంలో బియ్యం, ఇసుక, గ్రావెల్‌, మద్యం మాఫియాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని సురేష్‌ ఆరోపించారు. నియోజకవర్గంలో 90 వేలకు పైగా రేషన్‌కార్డులు ఉన్నాయని ప్రతినెలా రూ.2 కోట్ల రేషన్‌ బియ్యం వ్యాపారం జరుగుతుందన్నారు. మంత్రి కాని మంత్రికి రూ.25 నుంచి రూ.35 లక్షల వరకు వాటా వెళుతుందని ఆరోపించారు. నియోజకవర్గంలో 22 మద్యం షాపులుంటే సుమారు 220 వరకు బెల్టుషాపులు ఉన్నాయని, దీంతో అన్ని గ్రామాల్లో రాత్రి పగలు తేడా లేకుండా మద్యం ఏరులై పారిస్తున్నారన్నారు. 40 శాతం మద్యం షాపులు రెన్యువల్‌కు ముందుకు రావటం లేదన్నది కేవలం సాకు మాత్రమేనని ఒక్కో షాపునకు రెన్యువల్‌ ఫీజు కింద రూ.49 లక్షలు చెల్లించాల్సి ఉందని ఆ డబ్బులు ఎగ్గొట్టడానికి నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. మైనింగ్‌ మాఫియా కారణంగా కొండలు కాస్తా గుంతలు అయ్యాయన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకోవాలని కోర్టు జోక్యం చేసుకుని అధికారులను హెచ్చరించినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఇటీవల కృష్ణాష్టమి రోజు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి మధ్య గొడవ జరిగి సామరస్యంగా చెబితే మంత్రి స్వామి చెప్పారని వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులపై 307 వంటి నాన్‌బెయిలబుల్‌ యాక్టు పెట్టి జైలుకు పంపారని అన్నారు.

స్థానిక శ్రీ చైతన్య నవోదయ స్కూలు లో విద్యార్థి తౌషిక్‌ అనుమానాస్పద మృతి చెందితే కారకులపై ఎటువంటి కేసులు లేవని దీనిపై న్యాయపోరాటం చేసి ఆత్మహత్యకు పాల్పడిన మౌలాభి మృతి చెందితే దోషులను శిక్షించిన దాఖలాలు లేవన్నారు. తాను పాఠశాలపై కలెక్టర్‌తో మాట్లాడితే అప్పుడు స్కూలు అనుమతి రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని గుర్తు చేశారు. తౌషిక్‌, మౌలాబీ మరణాలపై సీబీఐ చేత విచారణ జరిపించాలని, ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

వెన్నుపోటు పార్టీ..

వెన్నుపోటు పాలన పుస్తకావిష్కరణ:

చంద్రబాబు ప్రభుత్వ వెన్నుపోటు విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పార్టీ రూపొందించిన వెన్నుపోటు పార్టీ– వెన్నుపోటు పాలన పుస్తకాన్ని సురేష్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ పదవులు పొందిన నాయకులకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. అంతకు ముందు గుండెపోటుతో మరణించిన రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆయన పార్టీకి చేసిన సేవలను సురేష్‌ కొనియాడారు. పార్టీ గ్రామ అధ్యక్షుడు షేక్‌ కరీం, దాసరి శేషయ్య, మాదాల శంకర్‌, మలినేని వెంకటేశ్వర్లు, పాకనాటి సుబ్బారెడ్డి, జీ ప్రభాకరరెడ్డి, నూకసాని ప్రసాద్‌, మిరియం సుదాకర్‌, కేశవరపు కృష్ణారెడ్డి, వేల్పుల మాలకొండయ్య, జిల్లా మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌ సుల్తాన్‌, యనమల మాధవి, రాపూరి ప్రభావతి, మాజీ ఎంపీపీ కట్టా శోభారాణి, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement