● వెలిగొండ నిర్వాసితుల పరిహారంలో ఇంకా వీడని అనిశ్చితి ● బకాయిలు సుమారు రూ.100 కోట్లపైనే.. ● వందలాది కుటుంబాల ఎదురుచూపులు ● నీళ్లొదిలి 24 రోజులైనా అందని పరిహారం ● మిస్సింగ్‌ పేర్లు, మేజర్ల పరిహారంపై స్పష్టత కోసం ఆందోళన | - | Sakshi
Sakshi News home page

● వెలిగొండ నిర్వాసితుల పరిహారంలో ఇంకా వీడని అనిశ్చితి ● బకాయిలు సుమారు రూ.100 కోట్లపైనే.. ● వందలాది కుటుంబాల ఎదురుచూపులు ● నీళ్లొదిలి 24 రోజులైనా అందని పరిహారం ● మిస్సింగ్‌ పేర్లు, మేజర్ల పరిహారంపై స్పష్టత కోసం ఆందోళన

Sep 25 2026 2:23 AM | Updated on Sep 25 2026 2:23 AM

● వెలిగొండ నిర్వాసితుల పరిహారంలో ఇంకా వీడని అనిశ్చితి ● బకాయిలు సుమారు రూ.100 కోట్లపైనే.. ● వందలాది కుటుంబాల ఎదురుచూపులు ● నీళ్లొదిలి 24 రోజులైనా అందని పరిహారం ● మిస్సింగ్‌ పేర్లు, మేజర్ల పరిహారంపై స్పష్టత కోసం ఆందోళన

మార్కాపురం:

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు కొనసాగుతున్నా.. ఇప్పటికీ వందలాది మంది నిర్వాసితుల సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. సుమారు రూ.100 కోట్ల వరకూ నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి పరిహారం కింద రావాల్సి ఉంది. వెలిగొండ ప్రాజెక్టుకు గత నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేశారు. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లోని సుంకేశుల, కలనూతల, గొట్టిపడియ, గుండంచర్ల తదితర గ్రామాల్లోని నిర్వాసితులకు ఇంకా పరిహారం అందలేదు. ఇప్పటి వరకు 6,158 నిర్వాసిత కుటుంబాలకు రూ.758.31 కోట్ల పరిహారం చెల్లించినట్లు అధికారులు వెల్లడించినా, ఇంకా పలువురు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. మరో 439 కుటుంబాలకు సంబంధించిన రూ.54.91 కోట్ల విలువైన బిల్లులు అప్‌లోడ్‌ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 349 మందికి సంబంధించిన బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ ప్రక్రియలో ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో పరిహారం కోసం అర్హత ఉన్నా నగదు చేతికి అందేందుకు మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక 18 మందికి కోర్టు కేసులు, కుటుంబ వివాదాల కారణంగా అవార్డులు పాస్‌ కాలేదు. సరైన ప్రామాణిక ఆధారాలు చూపలేదన్న కారణంతో మరో 185 మందికి అవార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. 172 మందిని అనర్హులుగా గుర్తించి పరిహారం నిలిపేశారు. దీంతో మొత్తం ప్రక్రియలో ఇంకా అనేక కేసులు వివాదాలు, పత్రాల పరిశీలనల మధ్యనే కొనసాగుతున్నాయి.

మిస్సింగ్‌ పేర్లపై ప్రత్యేక దృష్టి..

గతంలో గెజిట్‌, సామాజిక ఆర్థిక సర్వేల్లో పేర్లు నమోదు కాకపోవడంతో కొందరు నిర్వాసితులు పరిహారానికి దూరమయ్యారు. అలాగే 2026 ఆగస్టు 31 నాటికి 18 ఏళ్లు నిండిన మేజర్లకు కూడా పరిహారం అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అర్హత కలిగిన మేజర్లకు రూ.2 లక్షలు, గెజిట్‌లో మిస్సయిన వారికి రూ.12.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక విచారణలో 731 మంది మేజర్లు, 321 మంది గెజిట్‌లో మిస్సయిన వారిని ప్రాథమికంగా అర్హులుగా గుర్తించారు. అయితే ఇవి తుది జాబితాలు కాకపోవడంతో మరోసారి అభ్యంతరాలు, పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది.

జాబితాలపై అభ్యంతరాలకు గడువు:

ప్రాథమిక అర్హుల జాబితాలను సంబంధిత కార్యాలయాల్లో ప్రదర్శించారు. ఈ జాబితాలపై అభ్యంతరాలుంటే గురువారం సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలని అధికారులు సూచించారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది జాబితా ప్రకటించి పరిహారం చెల్లిస్తామని తెలిపారు. ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల్లో కొందరికి ఇప్పటికీ పరిహారం అందకపోవడం, మరికొందరి పేర్లు రికార్డుల్లో లేకపోవడం, ఇంకొందరి కేసులు పత్రాలు–వివాదాల కారణంగా పెండింగ్‌లో ఉండటం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. పరిహారం చెల్లింపులు జరుగుతున్నా.. ప్రతి అర్హుడికి న్యాయం జరిగే వరకు వెలిగొండ నిర్వాసితుల సమస్య పూర్తిగా పరిష్కారమైనట్లు చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరో వైపు అధికారులు స్థానిక మార్కెట్‌ యార్డులో నిర్వాసిత కుటుంబాల మేజర్ల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. రేషన్‌, ఓటరు, ఆధార్‌ కార్డులు, స్టడీ సర్టిఫికెట్లు, పాస్‌బుక్‌ తదితర వివరాలను పరిశీలించారు. అర్ధవీడు మండలానికి చెందిన రామలింగేశ్వరపురం, కృష్ణాపురం, లక్ష్మీపురం, మార్కాపురం మండలంలోని గొట్టిపడియ, అక్కచెరువు తాండ, పెద్దారవీడు మండలంలోని గుండంచర్ల, కాటంరాజు తాండ గ్రామాల నిర్వాసితుల దరఖాస్తులను పరిశీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement