చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ హయాంలో ఐదేళ్ల పదవీ కాలంలో భారీగా అభివృద్ధి పనులు రూ.11,266.89 లక్షల అంచనా వ్యయంతో 2,231 పనులు 1,080 పనులకు నిధుల చెల్లింపులు పురోగతిలో 1,151 పనులు జెడ్పీలో 138 మందికి పదోన్నతులు, 115 మందికి కారుణ్య నియామకాలు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యం నేటితో ముగియనున్న ఉమ్మడి జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీ కాలం
ఒంగోలు సిటీ: ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్ (జెడ్పీ) పాలకవర్గం గత ఐదేళ్ల పదవీ కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ హయాంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకుంది. ముఖ్యంగా గ్రామాల్లో కనీస సౌకర్యాలైన తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, తదితర అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇచ్చింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆనాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగింది. గ్రామీణ ప్రాంతాల అవసరాలను గుర్తించి వివిధ అభివృద్ధి పనులు చేపట్టి పూర్తిచేసింది. ప్రజల మౌలిక అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే జెడ్పీ సిబ్బంది పదోన్నతులు, కారుణ్య నియామకాలు వంటి అంశాలకు సైతం ప్రాధాన్యత ఇచ్చింది. జెడ్పీ పదవీకాలం నేటితో ముగియనున్న సందర్భంగా ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులను ఉమ్మడి జిల్లా ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.
రూ.11,266.89 లక్షలతో 2,231 పనులు...
2021–22 నుంచి 2025–26 వరకు జెడ్పీజీఎఫ్ కింద 2,231 పనులకు రూ.11,266.89 లక్షలు (రూ.112.67 కోట్లు) కేటాయించారు. ఇందులో 1,080 పనులకు రూ.5,016.18 లక్షల చెల్లింపులు జరిగాయి. మరో 1,151 పనులు పురోగతిలో ఉండగా, వాటికి సంబంధించి రూ.6,250.71 లక్షలు చెల్లించారు. 2021–22లో 445 పనులకు రూ.2,258.03 లక్షలు, 2022–23లో 615 పనులకు రూ.2,913.35 లక్షలు, 2023–24లో 521 పనులకు రూ.2,454.94 లక్షలు, 2024–25లో 226 పనులకు రూ.1,146 లక్షలు, 2025–26లో 424 పనులకు రూ.2,494.57 లక్షలు కేటాయించారు.
సిబ్బందికి భారీగా పదోన్నతులు...
జెడ్పీ సిబ్బందిలో 40 మందికి సీనియర్ అసిస్టెంట్ల నుంచి అడ్మినిస్ట్రేటివ్ అధికారులుగా, 73 మందికి జూనియర్ అసిస్టెంట్ల నుంచి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. అలాగే రికార్డు అసిస్టెంట్ల నుంచి జూనియర్ అసిస్టెంట్లుగా 21 మందికి, రికార్డు అసిస్టెంట్ల నుంచి టైపిస్టులుగా నలుగురికి పదోన్నతుల చొప్పున మొత్తం 138 మందికి జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. అలాగే ఉద్యోగంలో ఉండగా మృతిచెందిన సిబ్బంది కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద 44 మందిని జూనియర్ అసిస్టెంట్లుగా, 14 మందిని టైపిస్టులుగా, 57 మందిని ఆఫీస్ సబార్డినేట్లుగా నియమించారు. మొత్తం 115 మందికి కారుణ్య నియామకాల ఉత్తర్వులను జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అందజేశారు.
తాగునీటికి అత్యంత ప్రాధాన్యత...
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రత్యేక దృష్టి సారించారు. జెడ్పీ సమావేశాల్లో వాటిపై ప్రధానంగా చర్చించారు. తాగునీటికి సంబంధించి 15వ ఫైనాన్స్ కింద రూ.125 కోట్లు మంజూరు చేశారు.


