నకిలీ బంగారంతో బ్యాంకుకు బురిడీ | - | Sakshi
Sakshi News home page

నకిలీ బంగారంతో బ్యాంకుకు బురిడీ

Sep 24 2026 2:48 AM | Updated on Sep 24 2026 2:48 AM

సంతమాగులూరు (అద్దంకి): నకిలీ బంగారం బ్యాంకులో పెట్టి రూ.70 లక్షల రుణం తీసుకున్న ఘటన మండలంలోని ఓ జాతీయ బ్యాంకు శాఖలో చోటు చేసుకుంది. విజిలెన్స్‌ అధికారుల తనిఖీల్లో 17 మంది పేర్లతో రుణం తీసుకున్న నగలు నకిలీవని తేలడంతో బ్యాంకు అధికారులకు నోట మాట రాలేదు. తీగ లాగితే డొంక కదిలింది. సదరు బ్యాంకులో పనిచేసే అప్రైజరే 17 మంది పేర్లతో నకిలీ బంగారం బ్యాంకులో పెట్టి ఈ అక్రమానికి పాల్పడినట్లు గుర్తించారు. అతడిని ఆ పోస్టు నుంచి తొలగించారు. అతడే ఆ డబ్బు చెల్లించేలా రాజీ కుదర్చుకున్నట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం బయట పడితే తమ పరువు ఎక్కడ పోతుందోనని ఆ బ్యాంకు అధికారులు గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారాన్ని బయటకు పొక్కనీయలేదు. అందిన వివరాల ప్రకారం..కనిగిరి మండలం చాకిరాలకు చెందిన శ్రీనివాసరావు కొన్నేళ్లుగా బ్యాంకు శాఖలో అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన ఇంట్లో పనిచేసే వారు, తెలిసిన స్నేహితులతో తాను తయారు చేసిన నకిలీ నగలను, తాను పనిచేసే బ్యాంకులో పెట్టించాడు. ఆ బంగారం మంచిదని తాకీదు ఇచ్చాడు. దీంతో మొత్తం 17 మంది పేర్లతో రూ.70 లక్షల రుణం తీసుకున్నాడు. ప్రతి మూడు నెలలకు ఒక సారి బ్యాంకుకు సంబంధించిన విజిలెన్స్‌ అధికారులు లెక్కలు, బంగారం క్వాలిటీని పరిశీలిస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల బ్యాంకును సందర్శించిన విజిలెన్స్‌ అధికారులు తనిఖీల్లో 17 మంది పేర్లతో లోను పెట్టి నగలు నకిలీవని తేల్చారు. దీంతో ఆ బంగారం తాకట్టు పెట్టిన వారిని పిలిపించి విచారించగా ఆ బంగారం తమకు శ్రీనివాసరావే ఇచ్చాడని చెప్పడంతో నకిలీ బంగారం లీల బయటకు పొక్కింది. ఈ అప్రైజర్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు కూడా వ్యాపారం చేస్తుంటారు. ఆ వ్యాపారాల్లో నష్టం రావడంతో నకిలీ బంగారం తయారు చేసి బ్యాంకులో తెలిసిన వారి పేర్లతో రూ.70 లక్షలు తీసున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సదరు అప్రైజర్‌ను బ్యాంకు అధికారులు నిలదీయడంతో తానే ఆ నగదును తిరిగి చెల్లిస్తానని చెప్పినట్లు సమాచారం. నకిలీ బంగారం విషయమై ఆ బ్యాంకు అధికారులు కేసు పెట్టలేదని తెలుస్తోంది.

ఫేక్‌ పోలీసుల హల్‌చల్‌

ఖాకీల ముసుగులో మోసాలు

గిద్దలూరు రూరల్‌: అసలైన పోలీసులు కూటమి నాయకులకు జీ.. హుజూర్‌..అని ఒత్తాసు పలుకుతూ అడుగులకు మడుగులు ఒత్తుతూ చట్టాన్ని వారికి చుట్టాలుగా చేశారు. దీన్ని గమనించిన ఫేక్‌ పోలీసులు పోలీసుల ముసుగులో మోసాలకు పాల్పడుతూ ప్రజలను నిలువునా మోసగిస్తున్నారు. నకిలీ పోలీసుల ఆగడాలు మితిమీరిపోయాయి. పట్టపగే పోలీసులమని ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు సైతం అపహరించుకుని వెళ్తున్నారు. ఫేక్‌ పోలీసుల బారిన పడకుండా పోలీసు శాఖ మాత్రం నకిలీ పోలీసులు ఉన్నారు జాగ్రత్త.. ప్రజలు అప్రమత్తంతో ఉండాలని సోషల్‌ మీడియాలో ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీన కొమరోలు మండలానికి చెందిన నాగమణి, గురవయ్య దంపతులు బైక్‌పై వస్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులమని చెప్పి బైక్‌ ఆపి మీ ఒంటిపై ఇంత బంగారు ఉండకూడదని, బంగారం అంతా మూట కట్టుకుని బైక్‌లో దాచుకోండి..అని మాయమాటలు చెప్పి బంగారు నగలు అపహరించుకెళ్లారు. 12వ తేదీ పట్టణంలోని క్లబ్‌ రోడ్డులో రిటైర్డ్‌ ఉద్యోగి కొండయ్య తన స్కూటీపై వెళ్తున్న సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులమని చెప్పి అతడి చేతికి ఉన్న బంగారు ఉంగరాలను భద్రంగా ఉండాలంటే మూటకట్టుకుని స్కూటీలో వేసుకోవాలని సూచించి మాటల్లో పెట్టి బంగారు ఉన్న మూటను అపహరించుకెళ్లారు. దీంతో బంగారు పోగొట్టుకున్న బాధితులు మాత్రం పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పట్టపగలే పోలీసు వేషాలు వేసి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారంటే దొంగల చాకచక్యం అనుకోవాలా లేక పోలీసుల చేతగాని తనంగా భావించాలా అనే ప్రశ్నలు బాధితుల మదిలో వెల్లువెత్తుతున్నాయి. నకిలీ పోలీసులు తిరుగుతున్నారు. పోలీసులమని ఎవరైన సరే మీ వద్దకు వస్తే వారి గుర్తింపు కార్డు చూపమని అడగండి.. వృద్ధులు, మహిళలు మరింత జాగ్రత్తలు పాటించాలి. అనుమానాస్పద వ్యక్తుల గుర్తులు పోలీసులకు తెలియజేయాలి. భద్రత పేరుతో బంగారు ఆభరణాలను కాగితాల్లో, కవర్‌ల్లో ఉంచి మూట కట్టమని చెప్పడం వంటి అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసులను సంప్రదించాలంటూ పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. నకిలీ పోలీసులు అసలైన పోలీసులకు తలనొప్పిగా మారని తెలుస్తోంది. ఎట్టకేలకు ఫేక్‌ పోలీసులను గుర్తించి పట్టుకోవాలని పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. పోలీసుల ప్రతిష్టకు భంగం కలిగిస్తూ అమాయక ప్రజలను మోసగించే వారి ఆటకట్టించేందుకు పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

17 మంది పేర్లతో రూ.70 లక్షల రుణం తీసుకున్న అప్రైజర్‌

ఆడిట్‌లో వెలుగు చూసిన ఘరానా మోసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement