జిల్లాలో మొత్తం గృహ విద్యుత్ కనెక్షన్లు
వ్యవసాయ విద్యుత్ కనెక్షను
మార్కాపురం జిల్లాలో భారీగా పేరుకుపోయిన విద్యుత్ బిల్లుల బకాయిలు జిల్లావ్యాప్తంగా రూ.405.97 కోట్ల మేర బకాయిలు రోజుకు 3.438 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం కరెంటు బిల్లులు మాత్రం సక్రమంగా చెల్లించని వైనం బకాయిదారుల్లో పంచాయతీలు, వాటర్ వర్క్స్, ప్రైవేటు వినియోగదారులే అధికం విద్యుత్ అధికారులు, సిబ్బందికి సవాలుగా మారిన వసూళ్లు
బకాయిల వివరాలు...
1,12,321
వినియోగదారులు సకాలంలో కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో మార్కాపురం జిల్లాలో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఏకంగా 405.97 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ ఉండటం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. వందల కోట్లలో విద్యుత్ బిల్లులు వసూలు చేయాల్సి ఉన్నప్పటికీ.. సంబంధిత అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా ఎందుకున్నారనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. బకాయిల్లో పంచాయతీలు, వాటర్ వర్క్స్, ప్రైవేటు వినియోగదారులు చెల్లించాల్సిన మొత్తాలే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యుత్ శాఖపై తీవ్రస్థాయిలో ఆర్థిక భారం పడే అవకాశముంది. వసూలు చేయడం అధికారులు, సిబ్బందికి సవాల్‌గా మారింది.
వసూల్.. సవాల్..!
మార్కాపురం: కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో ఒకవైపు రోజురోజుకూ విద్యుత్ వినియోగం పెరుగుతుండగా.. మరోవైపు విద్యుత్ బిల్లుల బకాయిలు కూడా భారీగా పేరుకుపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. వివిధ కేటగిరీల వినియోగదారుల నుంచి రూ.405.97 కోట్ల మేర విద్యుత్ బిల్లులు వసూలు కావాల్సి ఉండటం విద్యుత్ శాఖకు సవాల్‌గా మారింది. బకాయిల్లో ప్రైవేటు వినియోగదారులతో పాటు స్థానిక సంస్థలు, వాటర్ వర్క్స్, ప్రభుత్వ కార్యాలయాల వాటా కూడా ఉండటం గమనార్హం. జిల్లాలో అన్ని కేటగిరీలకు కలిపి రోజుకు సగటున 3.438 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఇదే స్థాయిలో రోజువారీ విద్యుత్ సరఫరా అవుతున్నట్లు విద్యుత్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. విద్యుత్ వినియోగం భారీగా ఉన్నప్పటికీ.. అందుకు అనుగుణంగా బిల్లుల వసూళ్లు జరగకపోవడంతో బకాయిలు మొత్తం నాలుగు వందల కోట్ల రూపాయలు దాటాయి.
గృహ విద్యుత్ కనెక్షన్ల బకాయిలు
రూ.9 కోట్లు...
జిల్లాలో 3,10,387 గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. గృహావసరాలకు రోజుకు సుమారు 0.93 మిలియన్ల యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. జిల్లాలోని మొత్తం విద్యుత్ డిమాండ్‌లో గణనీయమైన భాగాన్ని గృహాల వినియోగం ఆక్రమిస్తోంది. వ్యవసాయ రంగానికి సంబంధించి జిల్లాలో 1,12,321 విద్యుత్ కనెక్షన్లున్నాయి. వ్యవసాయ అవసరాలకు విద్యుత్ సరఫరా చేయడం ద్వారా రైతులు పంటలు సాగు చేస్తున్నప్పటికీ.. ఈ విభాగంలో కూడా రూ.9 కోట్ల బకాయిలున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
పంచాయతీల బకాయిలు
రూ.131.62 కోట్లు...
జిల్లాలో పంచాయతీల విద్యుత్ బకాయిలు రూ.131.62 కోట్లు ఉండిపోయాయి. వీధి దీపాలు, పంచాయతీ కార్యాలయాలు, ఇతర ప్రజా అవసరాల కోసం వినియోగించిన విద్యుత్‌కు సంబంధించిన బిల్లులు కూడా భారీగా పేరుకుపోయినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఆర్థిక పరిస్థితి, నిధుల కొరత వంటి అంశాలు బకాయిలకు కారణమవుతున్నా.. ఏళ్ల తరబడి బిల్లులు పేరుకుపోతే విద్యుత్‌శాఖపై ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేగాకుండా వాటర్ వర్క్స్ బకాయిలు రూ.108.44 కోట్లుగా ఉండగా, తాగునీటి సరఫరా వ్యవస్థలకు సంబంధించిన విద్యుత్ బకాయిలు కూడా భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని మార్కాపురం, పొదిలి, త్రిపురాంతకం, కనిగిరి, కొనకనమిట్ల ప్రాంతాల్లో తాగునీటి పథకాలు, ఎస్‌ఎస్ ట్యాంకుల నిర్వహణ ఉంది. తాగునీటి పథకాలకు విద్యుత్ తప్పనిసరి కావడంతో బకాయిల చెల్లింపులో జాప్యం జరిగితే భవిష్యత్తులో విద్యుత్ సరఫరా, నీటి సరఫరా వ్యవస్థలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం, సంబంధిత స్థానిక సంస్థలు సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రైవేటు వినియోగదారులు చెల్లించాల్సింది రూ.147.25 కోట్లు...
ప్రైవేటు వినియోగదారుల నుంచి రూ.147.25 కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిలు వసూలు కావాల్సి ఉంది. మొత్తం బకాయిల్లో ఇదే పెద్ద మొత్తం. దీన్ని గమనిస్తే.. సాధారణ వినియోగదారుల నుంచి సకాలంలో బిల్లులు వసూలు చేయడంలో ఎక్కడైనా జాప్యం జరుగుతోందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు కూడా విద్యుత్ బకాయిల్లో భాగస్వాములుగా ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.5.36 కోట్ల బకాయిలు వసూలు కావాల్సి ఉంది. జిల్లాలో మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, పొదిలి మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి నుంచి మరో రూ.8 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ప్రభుత్వ విభాగాలే విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించకపోతే.. ఇక, సాధారణ వినియోగదారుల నుంచి బిల్లుల వసూళ్లకు విద్యుత్ శాఖ చేస్తున్న ప్రయత్నాలపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు, సరఫరా వ్యవస్థకు భారీగా ఖర్చవుతున్న నేపథ్యంలో వినియోగదారుల నుంచి సకాలంలో బిల్లులు వసూలు చేయడం అత్యంత కీలకం. కానీ, భారీ మొత్తంలో విద్యుత్ బకాయిలు పేరుకుపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
బకాయిల వసూళ్లకు
ప్రత్యేక కార్యాచరణ
మార్కాపురం జిల్లాలో రూ.405.97 కోట్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోవడంతో వాటి వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాం. బకాయిల వసూళ్లకు మా సిబ్బంది తిరుగుతున్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు కూడా మాకు సహకరించి బిల్లులు చెల్లించాలి. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం. పాత బకాయిలు గుర్తించడం, పెద్ద మొత్తంలో బకాయి ఉన్న వినియోగదారులపై ప్రత్యేక దృష్టి పెట్టడం, ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవడం ద్వారా పూర్తిగా వసూలు చేస్తాం.
– కరీమ్, ఎస్‌ఈ, విద్యుత్ శాఖ
విభాగం బకాయి
(రూపాయల్లో)
గ్రామ పంచాయతీలు 131.62 కోట్లు
ప్రభుత్వ కార్యాలయాలు 5.36 కోట్లు
మున్సిపాలిటీలు 8 కోట్లు
వ్యవసాయ విద్యుత్ 9 కోట్లు
వాటర్ వర్క్స్ 108.44 కోట్లు
ప్రైవేటు వినియోగదారులు 147.25 కోట్లు


