నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి | - | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి

Sep 24 2026 2:48 AM | Updated on Sep 24 2026 2:48 AM

నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి శ్రీశైలం ఘాట్‌లో ప్రమాదం రూ.2.31 లక్షలు పలికిన వినాయకుడి లడ్డూ ఐసీడీఎస్‌లో దొంగలు పడ్డారు

అద్దంకి: నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన పట్టణంలోని ముజావారిపాలెంలో బుధవారం జరిగింది. అందిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ముజావారిపాలేనికి చెందిన ఓ నాలుగేళ్ల బాలుడు ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో గుంపుగా ఉన్న కుక్కలు ఒక్కసారిగా బాలునిపై దాడి చేశాయి. బాలుడు కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చి కుక్కలను తరిమేశారు. దీంతో బాలునికి ప్రాణాపాయం తప్పింది. క్షతగాత్రుడిని బంధువులు ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స కోసం తరలించారు. పట్టణంలో దాదాపు అన్ని వార్డుల్లో వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కుక్కల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

ఎదురెదురుగా ఢీకొన్న కారు, ఆర్టీసీ బస్సు

ప్రమాదంతో ట్రాఫిక్‌కు అంతరాయం

పెద్దదోర్నాల: ఎదురెదురుగా వస్తున్న ఓ ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ప్రమాదం శ్రీశైలం రహదారిలోని చింతల, తుమ్మలబైలు గిరిజన గూడేలకు సమీపంలో బుధవారం జరిగింది. దీంతో ప్రమాదానికి కారణమైన రెండు వాహనాలు రోడ్డుకు అడ్డంగా ఉండటంతో శ్రీశైలం రహదారిలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటనలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకుండా క్షేమంగా బయట పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ప్రయాణికుల కథనం ప్రకారం.. మండల కేంద్రం నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్తున్న కారు, శ్రీశైలం నుంచి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ లగ్జరీ బస్సులు చింతల, తుమ్మలబైలు గిరిజన గూడేలకు సమీపంలో ఒకదాని కొకటి ఎదురెదురుగా ఢీకొనటంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించడంతో ట్రాఫిక్‌కు ఏర్పడిన అంతరాయం తొలగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మార్కాపురం: వినాయక నవరాత్రుల సందర్భంగా పట్టణంలోని పలు మండపాల్లో ఉన్న గణనాథులను బుధవారం నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా పట్టణంలోని విఘ్నేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూ వేలం నిర్వహించగా పట్టణానికి చెందిన డాక్టర్‌ లావణ్య రూ.2.31 లక్షలకు పాడి దక్కించుకున్నారు. గణేష్‌ ఉత్సవ కమిటీ కార్యకర్తలు, భక్తులు, సాంస్కృతిక కార్యక్రమాలు, డీజేలతో కోలాహలంగా నాలుగు మండపాల్లో ఊరేగిస్తూ స్వామి వారిని నిమజ్జనానికి తరలించారు.

తాళాలు పగలగొట్టి సెల్‌ఫోన్లు దోపిడీ

కనిగిరి రూరల్‌: ఐసీడీఎస్‌లో దొంగలు పడ్డారు. ఆఫీసు కార్యాలయం తలుపులు పగలకొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు సీడీపీఓ ఆఫీసు, సిబ్బంది గదుల్లోకి వెళ్లి వస్తువులు చిందర వందర చేశారు. బీపీఏ సిబ్బంది డెస్క్‌లో ఉన్న ఐదు సెల్‌ఫోన్లు అపహరించుకెళ్లారు. సీడీపీఓ సరోజని ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం..ఉదయం 8.10 గంటకు ప్రధాన గేటు వద్దకు వచ్చిన అంటెండర్‌ దొంగతనం జరిగినట్లు గుర్తించారు. బీపీఏ సిబ్బంది డెస్క్‌లో ఉన్న (ఆఫీసుకు సంబంధించిన 4 సెల్‌ఫోన్‌లు, ఇటీవల సస్పెండ్‌ అయిన సూపర్‌వైజర్‌ సుమతికి చెందిన సెల్‌ఫోన్‌) మొత్తం 5 సెల్‌ఫోన్లను దొంగలించుకెళ్లినట్లు స్పష్టమైంది. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీడీపీఓ చెప్పారు.

అంగన్‌వాడీ కార్యకర్త, ఆయా రిమూవ్‌

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలోని 8వ వార్డు కార్యకర్త సత్యవతి, ఆయా రామసుబ్బులును రిమూవ్‌ చేసినట్లు సీడీపీఓ సరోజని బుధవారం విలేకర్లకు తెలిపారు. సోమవారం ఇద్దరికీ నోటీసులు అందచేశామని సీడీపీఓ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement