డ్వాక్రా రుణాల పేరుతో నిండా ముంచేశారు ఇచ్చింది రూ.20 వేలు..తమపై తీసుకున్న రుణాలు రూ.26 లక్షలు కలెక్టర్ ఆదేశించినా కేసు నమోదు చేయలేదని ఆవేదన ప్రకాశం భవన్ వద్ద డ్వాక్రా మహిళల ఆందోళన
ఒంగోలు టౌన్: డ్వాక్రా రుణాలు ఇప్పిస్తామని చెప్పి నమ్మించి పులివెంకటరెడ్డి కాలనీకి చెందిన తల్లీ, కుమారుడు కలిసి మోసం చేశారని అదే కాలనీకి చెందిన పలువురు మహిళలు ఆరోపించారు. శుక్రవారం ప్రకాశం భవనం వద్ద స్థానిక పులివెంకటరెడ్డి కాలనీకి చెందిన రామలక్ష్మి, జిలకర బేబి, తేళ్ల వనజ, సలోమి తదితర మహిళలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మీడియాకు జరిగిన మోసాన్ని వెల్లడించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం...పులివెంకటరెడ్డి కాలనీకి చెందిన సునీత, ఆమె కుమారుడు కలిసి వినాయక స్వశక్తి డ్వాక్రా పొదుపు సంఘం పేరుతో పది మందితో ఓ గ్రూపు ఏర్పాటు చేశారు. సభ్యులు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున రుణాలు ఇప్పించారు. లబ్ధిదారులు తీసుకున్న రుణాన్ని నెలకు వేయి రూపాయల చొప్పున తిరిగి చెల్లించారు. అయితే ఇటీవల వారికి రూ.26 లక్షల రుణం బకాయి ఉందని, వెంటనే చెల్లించాలని నోటీసులు వచ్చాయి. ఆందోళన చెందిన బాధితులు వెంటనే సునీత వద్దకు వెళ్లి నోటీసులు వచ్చిన విషయాన్ని తెలిపారు. మీకు సంబంధం లేదు, నేను చూసుకుంటానని ఆమె బదులిచ్చారు. దీంతో అనుమానం వచ్చి బ్యాంకుకు వెళ్లి మేనేజర్‌తో మాట్లాడారు. ఆయన కూడా మీ ఆర్‌పీ చూసుకుంటుందని జవాబు చెప్పాడు. ఫీల్డ్ ఆఫీసర్ ను సంప్రదించగా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మీకు చేతనైంది చేసుకోమంటూ బెదిరింపులకు దిగాడు.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మహిళలు...
డ్వాక్రా రుణాల పేరుతో తమను మోసం చేశారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు బాధిత మహిళలు తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని మెప్మా అధికారులను అదేశించారని వివరించారు. అయినా ఇప్పటి వరకు సునీత మీద ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిపారు. ఈ విషయం గురించి పోలీసు అధికారులకు కూడా ఫిర్యాదు చేశామని, అయితే బ్యాంకు అధికారులు, పీడీ కార్యాలయానికి చెందిన అధికారుల పేర్లు తొలగిస్తే కేసు నమోదు చేస్తామని చెబుతున్నారని ఆరోపించారు. సోమవారం లోపు తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బాధిత మహిళలు హెచ్చరించారు.


