న్యూస్‌రీల్
పోలింగ్ కేంద్రం ఎక్కడ?
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. బలమైన గాలులు వీస్తాయి. ఉరుములు, మెరుపులతో జల్లులు పడవచ్చు.
పంగులూరులో ఉద్రిక్తత
నూజిళ్లపల్లిలో అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టాలంటూ కేవీపీఎస్ చేపట్టిన చలో పంగులూరు కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.
గ్రామాన్ని కోల్పోయిన బాధ ఒకవైపు.. జీవనోపాధి కోసం కొత్త ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి మరోవైపు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే తమ సమస్య మరింత తీవ్రమవుతుందని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘మా ఊరు లేకపోయినా మా ఓటు హక్కు ఉండాలి. ఎక్కడ ఓటు వేయాలో ముందుగానే చెప్పాలి. ఎన్నికల సమయంలో ఇబ్బందులు పడకుండా అధికారులు స్పష్టత ఇవ్వాలి’’ అని ముంపు గ్రామాల బాధితులు కోరుతున్నారు. వెలిగొండ ముంపు గ్రామాల నిర్వాసితుల ఓటు హక్కుకు సంబంధించి ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఓటర్ల జాబితాల పరిశీలన, చిరునామాల మార్పు, వార్డుల పునర్వ్యవస్థీకరణ, పోలింగ్ కేంద్రాల కేటాయింపు వంటి అంశాలపై స్పష్టత ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే 11 ముంపు గ్రామాలకు చెందిన ఓటర్ల పరిస్థితిపై ప్రత్యేక మార్గదర్శకాలు ప్రకటించి, ప్రతి ఓటరుకు తన ఓటు వివరాలు తెలియజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఊరు మారినా.. ప్రాంతం మారినా.. తమ ఓటు హక్కు మాత్రం కోల్పోకూడదు.
– పత్తి రవిచంద్ర, వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి
లక్షల మంది ప్రజలకు మేలు చేసే వెలిగొండ ప్రాజెక్టు కోసం తరతరాలుగా జీవించిన గ్రామాలు..పూర్వీకుల జ్ఞాపకాలు నిండిన ఇళ్లు అన్నింటినీ వదిలి నిర్వాసితులుగా మారిన వేలాది మంది వేర్వేరు చోట్ల తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. వారందరికీ శాశ్వత పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కనీసం తమకు ఓటు హక్కు కూడా లేకుండా చేస్తారేమోనన్న బెంగ వారిని వెంటాడుతోంది. 11 ముంపు గ్రామాలు ఖాళీ అవడంతో అక్కడి పోలింగ్ కేంద్రాలూ లేనట్లే. ఆయా గ్రామాల్లోని దాదాపు 25 వేల మంది ఓటర్లు తమ ఓటు ఎక్కడ ఉంది..వచ్చే ఎన్నికల్లో ఎక్కడ ఓటేయాలని అధికారులను ప్రశ్నిస్తున్నారు.
మార్కాపురం:
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలు పుట్టిన ఊరును విడిచి వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు. ఏళ్ల తరబడి నివసించిన ఇళ్లు.. పంట పొలాలు.. గ్రామాలతో అనుబంధాన్ని వదులుకుని కొత్త ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నారు. కొంతమంది మార్కాపురం పట్టణం, పరిసర గ్రామాలు.. మరికొంతమంది పెద్దారవీడు, తర్లుపాడు, కంభం, బేస్తవారిపేట తదితర ప్రాంతాల్లో తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు వారికి మరో సమస్యను ముందుకు తెచ్చాయి. తమ ఓటు ఎక్కడ ఉంది? ఏ పోలింగ్ కేంద్రానికి వెళ్లాలి? ఏ వార్డులో ఓటు వేయాలి? అన్న సందేహాలు నిర్వాసితులను వెంటాడుతున్నాయి. వెలిగొండ ప్రాజెక్టు ముంపు పరిధిలోకి వచ్చే 11 గ్రామాల్లో సుమారు 22 వేల నుంచి 25 వేల మంది ఓటర్లు ఉన్నట్లు అంచనా. ఆయా గ్రామాల్లోని కుటుంబాలు పునరావాసం, పరిహారం, ఇతర కారణాలతో ఇప్పటికే వివిధ ప్రాంతాలకు తరలివెళ్లాయి. ముంపునకు గురవుతున్న గ్రామాలుగా గొట్టిపడియ, అక్కచెరువు తండా, సుంకేసుల, కలనూతల, గుండంచర్ల, చింతలముడిపి, కాటంరాజు తండా, సాయిరాంనగర్, రామలింగేశ్వరపురం, కృష్ణానగర్, లక్ష్మీపురం ఉన్నాయి.
తలోదారి..తలో నివాసం:
ఒకప్పుడు ఒకే గ్రామంలో కలిసిమెలిసి జీవించిన కుటుంబాలు ఇప్పుడు ఒక్కో ప్రాంతంలో నివాసం ఉంటున్నాయి. కొందరు పునరావాస కాలనీలకు వెళ్లగా మరికొందరు మార్కాపురం, ఇతర పట్టణాలు, సమీప గ్రామాల్లో ఇళ్లు అద్దెకు తీసుకున్నారు. ఇంకొందరు బంధువుల ఇళ్లలో తాత్కాలికంగా ఉంటున్నారు. దీంతో ఒకే గ్రామానికి చెందిన ఓటర్లు సైతం వేర్వేరు ప్రాంతాల్లోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో తమకు ఎలాంటి విధానం అమలు చేస్తారన్నది నిర్వాసితులకు అంతుచిక్కడం లేదు.
పాత గ్రామమా.. కొత్త నివాసమా?
గ్రామాలు ఖాళీ చేసిన తర్వాత కూడా పాత గ్రామాల ఓటర్ల జాబితాలోనే పేర్లు కొనసాగుతాయా? లేక ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు అనుగుణంగా ఓటర్ల జాబితాల్లో మార్పులు చేస్తారా? అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. ప్రస్తుతం ఒక ప్రాంతంలో నివసిస్తున్నా ఓటు మాత్రం పాత గ్రామంలో ఉంటే ఎన్నికల సమయంలో అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ పాత గ్రామం పూర్తిగా ఖాళీ అయి.. పోలింగ్ కేంద్రం మరో ప్రాంతానికి మారితే ఆ సమాచారం ప్రతి ఓటరుకు చేరాల్సి ఉంటుంది.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలింగ్ కేంద్రాలపై స్పష్టత లేకపోవడం నిర్వాసితుల్లో ఆందోళనకు కారణమవుతోంది. తమ గ్రామాలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను అధికారులు పరిశీలించి, ప్రస్తుతం నిర్వాసితులు నివసిస్తున్న ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ప్రక్రియను స్పష్టంగా రూపొందించాలని వారు కోరుతున్నారు. ప్రతి ఓటరుకు తన ఓటు ఏ వార్డులో ఉంది.. ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలి అనే వివరాలను ముందుగానే తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


