వైఎస్సార్‌తో కలిసి సొరంగాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన క్షణాలు మరువలేను వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్‌ను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి
పెద్దదోర్నాల: వెలిగొండ ప్రాజెక్టు కోసం అప్పట్లో ఎంతో కృషి చేశానని సీనియర్ వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి పేర్కొన్నారు. ఫీడర్ కాలువ ద్వారా విడుదలవుతున్న కృష్ణా జలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ గంటా రమణారెడ్డి, మండల వైఎస్సార్ సీపీ నాయకులు గంటా గురవారెడ్డిలతో కలిసి ఆయన కొత్తూరు వద్ద నిర్మించిన జంట సొరంగాలు, గంటవానిపల్లె వద్ద ఏర్పాటు చేసిన ఫీడర్ కెనాల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పట్లో ప్రాజెక్టు కోసం ఎంతో కృషి చేశానని, సొరంగాల నిర్మాణాల కోసం ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లిన అంశాలను ఆయన గుర్తు చేసుకున్నారు. దీంతో పాటు నాటి గత స్మృతులను స్మరించుకుంటూ నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో సొరంగాల నిర్మాణాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న క్షణాలు మరిచిపోలేనని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు నాయకులు ఫీడర్ కెనాల్‌ను పరిశీలించారు.


