కొత్త పింఛన్లకు ముగిసిన దరఖాస్తుల ప్రక్రియ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పింఛన్ల కోసం వచ్చిన అర్జీలు 80,962 మార్కాపురం జిల్లాలో 30,744, ప్రకాశం జిల్లాలో 50,218 చివరి రోజు భారీగా వచ్చిన దరఖాస్తులు సర్వర్లు పనిచేయక అవస్థలు పెండింగ్‌లోనే వేలాది దరఖాస్తులు మంజూరు చేస్తారో లేదోనని అర్హుల ఆందోళన
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/మార్కాపురం: చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయలేదు. రెండున్నరేళ్ల తరువాత ఎట్టకేలకు పింఛన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించడంతో పెద్ద ఎత్తున అర్హులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ఇప్పటి వరకు పట్టుమని పది శాతం కూడా ఆమోదించకపోవడంతో తమకు పింఛన్లు మంజూరవుతాయో లేదోనన్న ఆందోళన వారిలో నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా పింఛను దరఖాస్తులకు తొలుత ఈనెల 16వ తేదీ ఆఖరుగా ప్రభుత్వం గడువు ఇచ్చింది. అయితే 12, 13, 14 తేదీల్లో వరుసగా సెలవులు రావడంతో అర్హులైన లబ్ధిదారులు పింఛను కోసం దరఖాస్తు చేసుకోలేకపోయారు. చేతివృత్తుల వారు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళ, చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయాల చుట్టూ తిరిగారు. దీంతో ప్రభుత్వం 18 వరకూ గడువు పొడిగించింది. చివరిరోజైన శుక్రవారం సాయంత్రానికి ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో కలిపి మొత్తం 80,962 దరఖాస్తులు వచ్చాయి. సచివాలయాలన్నీ లబ్ధిదారులతో కిటకిటలాడాయి. ఇదే సమయంలో సర్వర్లు మొరాయించడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ సచివాలయంలో పలువురు వేచి ఉన్నారు. ప్రస్తుతం ఆ గడువు కూడా ముగిసిపోయింది. దీంతో ఇంకా అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది.
శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు ప్రకాశం జిల్లాలో మొత్తం 50,218 దరఖాస్తులు రాగా వాటిలో 3,899 మాత్రమే ఆమోదించారు. 162 దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలిన 46,157 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా ఒంగోలులో 5368 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా, అత్యల్పంగా చీమకుర్తిలో 715 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో అత్యధికంగా వృద్ధాప్య పెన్షన్ల కోసం 25,290 దరఖాస్తులు రాగా, తరువాత వితంతు పింఛన్ల కోసం 10,615, వివిధ వృత్తుల వారి పెన్షన్ల కోసం 5,114, వికలాంగుల పెన్షన్ల కోసం 4,674 దరఖాస్తులు, మిగిలినవి ఇతర వాటి కోసం వచ్చాయి. మార్కాపురం జిల్లాలో 30,744 దరఖాస్తులు వచ్చాయి. యర్రగొండపాలెం నుంచి అత్యధికంగా 1891 మంది దరఖాస్తు చేసుకోగా హెచ్‌ఎంపాడులో 682 మంది దరఖాస్తు చేసుకున్నారు. మార్కాపురం పట్టణ, రూరల్ కలిపి 3,237 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.


