న్యాయం కోసం ఆరు నెలలుగా పోరాటం పాఠశాల యాజమాన్యం అవమానించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య మృతురాలి కుటుంబానికి అండగా ఉంటామన్న మాజీ మంత్రి సురేష్
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే
టంగుటూరు: ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యానికి, అధికారుల బాధ్యతా రాహిత్యం తోడవడంతో ఒక నిండు ప్రాణం బలైందని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ సురేష్ అన్నారు. సింగరాయకొండలోని మాజీ మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫిబ్రవరిలో సింగరాయకొండ మండలం మూలగుంటపాడు శ్రీ చైతన్య నవోదయ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న కనిగిరికి చెందిన తౌషిక్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. విద్యార్థి తల్లిదండ్రులు ఆలీ, మౌలాబి తమ కుమారుడి మృతి అనుమానాస్పదంగా ఉందని, దానిపై దర్యాప్తు చేయాలని అధికారులను విన్నవించుకున్నారని ఆయన తెలిపారు. ఆరో తరగతి చదివే విద్యార్థికి ఆత్మహత్య చేసుకునే అంత ఆలోచనలు ఏముంటాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారని, కానీ పాఠశాల యాజమాన్యం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మబలికే ప్రయత్నాలు చేశారని అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పినా.. రెండు నెలలు గడిచినా దర్యాప్తు ముందుకు సాగకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారన్నారు. దర్యాప్తు చేస్తున్న సీఐ, ఎస్‌ఐలపై నమ్మకం లేదని దర్యాప్తు ముందుకు సాగడం లేదని హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. స్పందించిన హైకోర్టు ఒక అడిషనల్ ఎస్పీ హోదాలో ఉన్న వ్యక్తిని విచారణ అధికారిగా నియమించి కేసును దర్యాప్తు చేయాలని ఆదేశించారన్నారు. తర్వాత నెల్లూరు అడిషనల్ ఎస్పీ సౌజన్య విచారించిందని, కలెక్టర్ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ కూడా విచారణ చేసి నివేదికను అందజేస్తే పాఠశాలకు ఒక సంవత్సరం అనుమతి రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసిందన్నారు. కానీ పాఠశాల యాజమాన్యం తరగతుల నిర్వహణకు ఆదేశాలు తెచ్చుకుందన్నారు. పాఠశాల మళ్లీ నిర్వహిస్తుంటే ఆగస్టు 16వ తేదీ నుంచి విద్యార్థి తల్లి మౌలాబి ఎండకి, వానకి తడుస్తూ పాఠశాల ఎదురు ధర్నా నిర్వహించారని, విద్యాశాఖ అధికారిని కలిసినా ప్రయోజనం లేకపోవడంతో మళ్లీ పాఠశాల ఎదురు న్యాయం కోసం ధర్నా చేసిందని చెప్పారు. పాఠశాల యాజమాన్యం అవహేళన చేయడంతో బాధ తట్టుకోలేని స్థితిలో మౌలాబి పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసిందని తెలిపారు.
తౌషిక్ కుటుంబానికి న్యాయం చేసే వరకు పోరాటం:
మౌలాబి ఆత్మహత్య ప్రయత్నానికి ముందు విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో ఆమె మాటలు వింటే గుండె తరుక్కుపోతుందని సురేష్ అన్నారు. తన బిడ్డ చనిపోయిన చోటే తాను చనిపోవాలని, తన బిడ్డ సమాధి పక్కనే తన సమాధి ఉండాలని మాటలు పలకడం బాధాకరమైన విషయమన్నారు. తనకు న్యాయం జరగకపోవడంతోనే అలాంటి కఠిన నిర్ణయం తీసుకుందని చెప్పారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేసే వరకు పోరాడతామన్నారు. పక్కా ఆధారాలతో అధికారులకు వివరాలు అందజేసినా అధికారుల నిర్లక్ష్యం, పాలకుల నిర్లక్ష్య వైఖరితో ఒక నిండు ప్రాణం బలైందన్నారు. అందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు.పాఠశాలలో విద్యార్థి మరణిస్తే ఆ కేసును దర్యాప్తు చేయలేని దౌర్భాగ్య స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శించారు. ముందుగా విద్యార్థి, తల్లి మరణానికి సంతాపం తెలియజేశారు. విలేకరుల సమావేశంలో వివిధ మండలాల పార్టీ కన్వీనర్లు మసనం వెంకటరావు, చింతపల్లి హరిబాబు, పిన్నిక శ్రీనివాసులు, పార్టీ నాయకులు సుల్తాన్ కరీం, రియాజ్, మాధవి, ప్రభావతి, అబూద్ అలీ, జిలాని, కరీం, అబ్దుల్లా, అల్లాబక్షు, బాష, శ్రీరాములు, గుప్తా, నౌషద్ ,అల్లా, మస్తాన్, కోటేశ్వరమ్మ, సురేంద్ర, విజయ్, మదన్, రామకృష్ణ, వేణుగోపాల్, ప్రసాద్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.


