● ఆదేశాలు జారీ చేసిన జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి
ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలో వైన్‌షాపుల లైసెన్సులు రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి ఎస్‌కే ఆయేషా బేగం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 1వ తేదీ 2026వ సంవత్సరం నుంచి సెప్టెంబర్ 30వ తేదీ 2027వ సంవత్సరం వరకూ ఏడాది పాటు నూతన పాలసీతో రెన్యువల్ చేశారు. జిల్లాలో ఓపెన్ కేటగిరీలో 124 మద్యం దుకాణాలు, గీత కార్మికులకు 15 దుకాణాలు ప్రస్తుతం ఉన్నాయి. దుకాణాల పర్మిట్ రూంకు లైసెన్సు తప్పని సరి. ప్రతి దుకాణదారుడు తమ లైసెన్సులను సెప్టెంబర్ 21వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు లోపు రెన్యువల్ చేసుకోవాలని ఎకై ్సజ్ అధికారి కోరారు.
ఒంగోలు వన్‌టౌన్: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ల్లో మొత్తం 18,700 కేసులు పరిష్కరించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.సత్యానంద్ తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా కేసుల పరిష్కారం కోసం మొత్తం 29 బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ బెంచ్‌ల ద్వారా 18,380 క్రిమినల్ కేసులు, 238 సివిల్ కేసులు, 3 ప్రీ–లిటిగేషన్ కేసులు పరిష్కరించామన్నారు. ఆయా కేసులకు సంబంధించి కక్షిదారులకు వివిధ పరిహారాలు, అవార్డుల రూపంలో మొత్తం రూ.4.50 కోట్ల మేరకు పరిహారం అందజేశామని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను సత్వరంగా, స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవచ్చని, ఇరుపక్షాల సమ్మతితో వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషిచేసిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులకు సత్యానంద్ అభినందనలు తెలిపారు.
గిద్దలూరు రూరల్: సినిమా ఫక్కీలో ఇద్దరు వ్యక్తులు పోలీసులమని నమ్మించి ఓ వృద్ధుడి వద్ద బంగారు ఆభరణాలను చాకచక్యంగా అపహరించుకుని వెళ్లిన సంఘటన పట్టణంలోని క్లబ్‌రోడ్డులో శనివారం జరిగింది. అందిన వివరాల ప్రకారం.. రిటైర్డ్ వార్డెన్ కొండయ్య తన స్కూటీపై వెళుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు తాము పోలీసులమని చెప్పి స్కూటీ ఆపారు. వృద్ధుడివి నీ చేతికి రెండు ఉంగరాలు పెట్టుకున్నావు..బంగారు ధర విపరీతంగా పెరిగింది ఉంగరాలను దొంగలు అపహరించుకుని వెళ్తారని నమ్మించి రెండు ఉంగరాలను తీసి ఒక పేపర్‌లో చుట్టుకుని స్కూటీ డిక్కీలో వేసుకోవాలని సూచించారు. దీంతో కొండయ్య తన ఉంగరాలను ఒక పేపర్‌లో ఉంచి చుట్టుకుని స్కూటీ డిక్కీలో వేశాడు. ఈలోగా దొంగలు అతడితో కొంత సేపు మాటల్లో ఉంచి స్కూటీ డిక్కీ సరిగా పడలేదు. సరిగా వేయాలని స్కూటీ డిక్కీ తెరిచి అందులో వారి వద్ద ఉన్న రాళ్లతో కూడిన పేపర్ చుట్టను తెలివిగా అందులో పడేసి ఉంగరాలు ఉండే పేపర్ చుట్టను అపహరించుకుని వెళ్లారు. కొండయ్య ఇంటి వద్దకు వెళ్లి స్కూటీలో ఉన్న పేపర్ చుట్టను విప్పి చూసుకునే సరికి రాళ్లు కనిపించాయి. దీంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం పోలీసులకు వివరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అపహరణకు గురైన బంగారు ఉంగరాలు సుమారు రెండున్నర తులాలు ఉంటాయని తెలిపారు.
పెద్దదోర్నాల: మేతకు వెళ్లిన ఆవుల మందపై పెద్దపులి దాడి చేయటంతో ఓ ఆవు తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన మండల పరిధిలోని పెద్దబొమ్మలాపురానికి సమీపంలోని నల్లమల అభయారణ్యం, ఊరకొండ వద్ద శనివారం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో పెద్ద బొమ్మలాపురానికి చెందిన అమ్మిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి అనే రైతుకు చెందిన ఆవు తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన ఆవులు మేత కోసం సమీపంలోని ఊరకొండ వద్దకు వెళ్లిన నేపథ్యంలో పెద్దపులి దాడి చేసింది. ఈ దాడిలో ఆవు గొంతు భాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి. కాపరులు గట్టిగా కేకలు వేయటంతో పులి అక్కడ నుంచి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. ఆవులపై పులి దాడి చేసిందన్న విషయాన్ని అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు.


