కంటినిండా కన్నీళ్లతో...బరువెక్కిన గుండెతో..
పుట్టిన ఊరిని వీడి పరాయి చోటికి..
వెలిగొండ ముంపు గ్రామాల్లో విషాద ఛాయలు
ఇళ్లు ఖాళీ చేస్తున్న నిర్వాసితులు
పరిహారం దక్కక..నిలువ నీడ లేక ఆవేదన
పునరావాస గ్రామాల్లో పరిస్థితిపై గ్రౌండ్ రిపోర్ట్
ఏళ్ల తరబడి తమకు నీడనిచ్చిన ఇల్లు.. చిన్ననాటి జ్ఞాపకాలను మోసిన వీధులు.. కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన పొరుగువారు.. పంటలతో అనుబంధం పెంచుకున్న పొలాలు.. ఇక ఇవన్నీ జ్ఞాపకాలుగానే మిగిలిపోనున్నాయి. వెలిగొండ ప్రాజెక్టు కోసం నల్లమలసాగర్ జలాశయంలో ముంపునకు గురికానున్న గ్రామాల్లో ప్రజలు ఒక్కొక్కరుగా ఇళ్లను ఖాళీ చేస్తుండటంతో గ్రామాల్లో విషాద వాతావరణం నెలకొంది.
గూడు చెదిరి..
మార్కాపురం:
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కోసం 11 గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. వేలాది కుటుంబాలు తమ సొంత ఊళ్లను, ఇళ్లను వదిలి పునరావాస ప్రాంతాలకు తరలిపోతున్నాయి. మార్కాపురం మండలంలోని గొట్టిపడియ, అక్కచెరువు తాండ, పెద్దారవీడు మండలంలోని సుంకేశుల, కలనూతల, గుండంచర్ల, కాటంరాజు తాండ తదితర గ్రామాల నుంచి నిర్వాసితులు ఇళ్లను, పొలాలను వదిలేస్తున్నారు. నీళ్లను వదిలే సమయం దగ్గరపడుతుండటంతో గుండెల్లో అలజడి రేగుతోంది. ఆర్‌ఆర్‌ప్యాకేజీ రాకపోయినా.. ఇళ్లను ఖాళీ చేస్తుంటే..కన్నీళ్లు ఆగడం లేదు. తరతరాలుగా బతికిన ఇళ్లను ఖాళీ చేయడం నిర్వాసితులకు అత్యంత బాధాకరంగా మారింది. ఇంట్లోని సామాన్లను సర్దుకుంటున్న సమయంలో ఒక్కో కుటుంబానికి తమ జీవితంలోని ఎన్నో జ్ఞాపకాలు కళ్లముందు కదులుతున్నాయి. చిన్నారుల బాల్యం, పెద్దల జ్ఞాపకాలు, పండుగలు, పెళ్లిళ్లు, కుటుంబ వేడుకలు.. ఇలా ఎన్నో మధుర స్మృతులను మోసిన ఇల్లు ఇప్పుడు ఖాళీగా మారుతోంది. ఇంట్లోని వస్తువులను వాహనాల్లోకి ఎక్కిస్తూ కొందరు కన్నీటి పర్యంతమవుతున్నారు. ‘ఈ ఇంట్లోనే పుట్టాం.. ఇక్కడే పెరిగాం.. ఇప్పుడు మా చేతులతోనే ఖాళీ చేసి వెళ్లాల్సి వస్తోంది’ అంటూ పలువురు నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఊరు మారుతోంది.. జ్ఞాపకాలు మాత్రం వెంట
గ్రామం నుంచి బయటకు వెళ్తున్న ప్రతి కుటుంబం వెంట సామాన్లతో పాటు ఎన్నో జ్ఞాపకాలను కూడా తీసుకెళ్తోంది. ఇన్నాళ్లు తమ జీవనాధారంగా ఉన్న వ్యవసాయ భూములు, పశువులు, ఇళ్లు, చెట్లు, దేవాలయాలు, గ్రామంలోని బంధాలు అన్నీ ఇక గతమే కానున్నాయి. ఒకప్పుడు జనంతో కళకళలాడిన వీధులు ఇప్పుడు ఖాళీ అవుతుండటంతో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి. పునరావాసం పూర్తిస్థాయిలో కల్పించకుండానే ఇళ్లు ఖాళీ చేయాల్సి వస్తోందని పలువురు నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాత ఊరి జ్ఞాపకాలతో.. కొత్త జీవితం
తరతరాలుగా బతికిన ఇళ్లను ఖాళీ చేయడం నిర్వాసితులకు అత్యంత బాధాకరంగా మారింది. ఇంట్లోని సామాన్లను సర్దుకుంటున్న సమయంలో ఒక్కో కుటుంబానికి తమ జీవితంలోని ఎన్నో జ్ఞాపకాలు కళ్లముందు కదులుతున్నాయి. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయి జలాశయంలో నీరు చేరిన తర్వాత ఈ గ్రామాల ఆనవాళ్లు కనుమరుగవుతాయి. కానీ ఆ గ్రామాల్లో జీవించిన వేలాది కుటుంబాల జ్ఞాపకాల్లో మాత్రం ఆ ఊళ్లు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఊరు వదిలి వెళ్లడం తప్పనిసరైన పరిస్థితుల్లో నిర్వాసితులు కొత్త ప్రాంతాల్లో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టు కోసం ఒక ఊరు త్యాగం చేస్తుంటే.. ఆ త్యాగానికి ప్రతిఫలంగా నిర్వాసితులకు గౌరవప్రదమైన పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మరోవైపు అధికారులు ఉదయం 7 గంటలకే గ్రామాలకు వెళ్లి ఊర్లు ఖాళీ చేయాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో నిర్వాసితుల్లో తీవ్ర ఆందోళన చెలరేగుతోంది.
ముంపు గ్రామాల్లో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ నిలిపివేత
పెద్దారవీడు/మార్కాపురం రూరల్: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుల ముంపు గ్రామాల వ్యవసాయ బోరు మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. సుంకేసుల, కలనూతల, గుండంచర్ల గ్రామాల్లో నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజి బ్యాంక్ ఖాతాలో జమైన వారిని స్థానిక విద్యుత్ లైన్‌మెన్ రైతులను గుర్తించి వారి మోటార్లకు సరఫరా తీస్తున్నారు. ముంపునకు గురైన మూడు గ్రామాల్లో మొత్తం 94 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల పరిధిలో వ్యవసాయ మోటార్లు మొత్తం 450 మంది రైతులకు కనెక్షన్లు ఉన్నాయి. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నామని అధికారులు తెలిపారు. ఖాళీగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లును ఎప్పటికప్పుడు విద్యుత్‌శాఖ కార్యాలయానికి అధికారులు తరలిస్తున్నారు. మార్కాపురం మండలంలోని ముంపు గ్రామమైన గొట్టిపడియలోనూ త్రీఫేజ్ విద్యుత్ సరఫరా నిలిపేయడంతో నీటి కోసం గ్రామస్తులు అల్లాడుతున్నారు.


