వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు పార్టీ కార్యాలయంలో ప్రకాశం పంతులుకు ఘనంగా నివాళులు
ఒంగోలు టౌన్: స్వాతంత్య్రానంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నేటి తరానికి ఆదర్శనీయుడని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు కొనియాడారు. నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ప్రకాశం పంతులు 155వ జయంతిని ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులతో కలిసి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చుండూరి రవిబాబు మాట్లాడుతూ ఒంగోలు జిల్లాలోని వినోదరాయుని పాలెంలో పుట్టిపెరిగిన ఆయన వల్లూరు పాఠశాలలో చదువుకున్నారని తెలిపారు. రాజమండ్రి మున్సిపల్ చైర్మన్‌గా , న్యాయవాదిగా పనిచేసి ప్రజల మన్ననలు పొందారని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా తెల్లవాడిని ఎదిరించి పోరాడిన ప్రకాశం పంతులు చేతనైతే ఇక్కడ కాల్చమని గుండెలు చూపించిన ధైర్యశాలి గా జాతీయోద్యమంలో ఎందరికో స్ఫూర్తినిచ్చారని చెప్పారు. ప్రజల కోసం తన ఆస్తి మొత్తాన్ని రాసిచ్చిన త్యాగమూర్తి ప్రకాశం పంతులు జీవితాన్ని నేటి తరం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు కటారి శంకర్, కొత్తపట్నం మండలాధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, సీనియర్ నాయకులు క్రాంతికుమార్, మహిళా విభాగం రాష్ట్ర నాయకులు భూమిరెడ్డి రవణమ్మ, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, మలిశెట్టి దేవా, షేక్ ఖాదర్ బాషా, గున్నా అమర్, మాల్యాద్రి, షేక్ బాషా, పి.వెంకయ్యనాయుడు, సురేష్, మారుతి, బి.శ్రీనివాసరెడ్డి, మారపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.


