తాగునీటి ప్రాజెక్ట్‌పై టీడీపీ నియోజకవర్గ నేత కన్ను
అధికారులు, కాంట్రాక్టర్‌లు, టీడీపీ నేతల కుమ్మక్కు
మెయింటినెన్స్ నిధులు బొక్కేస్తున్న వైనం
ఆరు నెలలుగా వర్కర్‌లకు అందని జీతాలు
అధిక బిల్లులు చేయాలంటూ అధికారులపై ఒత్తిళ్లు
తమ ఉద్యోగాలు పోతాయని ససేమిరా అంటున్న అధికారులు
దీంతో పనులు నిలిపేసిన కాంట్రాక్టర్‌లు
శుద్ధజలం అందక ప్రజల అవస్థలు
శుద్దిలేదు..బుద్దిలేదు:
ప్రజలకు తాగునీటిని శుద్ది చేసి బ్లీచింగ్, క్లోరినేషన్ చేసి అందించాల్సి ఉండగా కాసుల కక్కుర్తితో రిజర్వాయర్ లోని నీటిని ఎటువంటి శుద్ది లేకుండా నేరుగా ప్రజలకు తరలిస్తున్నారు. ఆ నీరు కూడా నిత్యం విడుదల చేయకుండా నెలకు ఒకటీ రెండు సార్లు మాత్రమే సరఫరా చేసి మమ అనిపిస్తున్నారు. మురుగు వాసన వస్తూ రంగు మారిన ఆ నీరు తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కొందరు ఆనీరు వాసన చూసి తాగలేక మురుగు కాలువల్లోకి వదిలేస్తున్నారు.
దర్శి నియోజకవర్గంలో కూటమి నేతలు చేస్తున్న పాపాలు ప్రజలకు శాపాలుగా మారాయి. తాగునీటి విడుదలలో అధికారులు, కాంట్రాక్టర్‌లు, టీడీపీ నేతలు కుమ్మకై ్క చేస్తున్న చేష్టలకు ప్రజలకు తాగునీరు అందక ఊళ్లకు ఊళ్లు దాహార్తితో అల్లాడుతున్నాయి. నియోజకవర్గ ముఖ్యనేత తాగునీటి ప్రాజెక్టు నిర్వహణ నిధులు బొక్కేస్తూ పనిచేసిన కార్మికులకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారు. కాంట్రాక్టర్ కూడా నీటిని శుద్ధి చేయకుండానే కలుషిత నీటిని అరకొరగా వదులుతున్నారు.
చంద్రబాబు హామీ నీటి మూటే..
ఏళ్ల తరబడి స్కీములో పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చక పోగా కనీసం జీతాలు కూడా ఇవ్వడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జాయింట్ కలెక్టర్, జెడ్పీ సీఈఓ, అధికారులు కాంట్రాక్టర్ల సమక్షంలో లేబర్‌యాక్ట్ ప్రకారం కార్మికులకు కనీస వేతనం రూ.17400 అమలు చేయాలని ఆదేశించారు. పీఎఫ్, ఈఎస్‌ఐ కల్పించాలని తీర్మానించారు. అయితే ఇప్పటికీ ఆ ప్రకారం జీతాలు చెల్లించడం లేదని కార్మికులు వాపోతున్నారు.
దర్శి: ఎన్‌ఏపీ రిజర్వాయర్ ద్వారా నిత్యం శుద్ది చేసిన నీరందించేందుకు దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఉన్న తాగునీటి ప్రాజెక్ట్‌లకు ప్రతి ఏటా రూ.3 కోట్లకు పైగా ప్రభుత్వం కేటాయిస్తుంది. వీటిలో నెలకు తాళ్లూరు మండలం రూ.48 లక్షలు, కురిచేడు రూ.48 లక్షలు, దొనకొండ రూ.60 లక్షలు, దర్శి రూ.84, ముండ్లమూరు రూ.60 లక్షల వరకు సుమారుగా కేటాయిస్తారు. ఈ నిధులు తీసుకుని తాగునీరు శుద్ది చేసి ప్రజలకు అందించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌ల కింద పని చేసే కాంట్రాక్ట్ వర్కర్‌లు 81 మంది ఉండగా దర్శి 29, కురిచేడు 7, దొనకొండ 9, ముండ్లమూరు 22, తాళ్లూరు 14 మందికి ఆ నిధుల్లో కాంట్రాక్ట్ వర్కర్‌లకు నెలకు రూ.9 వేలు చొప్పున రూ.7,29,000 జీతాలు చెల్లించాలి. అయితే ఒక్కో ఉద్యోగికి కనీస వేతనం రూ.26 వేలు ఉండగా రూ.9 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ కాంట్రాక్ట్ పనికి టెండర్‌లు పిలిచేవారు. అయితే ఆ ప్రాజెక్ట్‌లపై కన్నేసిన అధికార పార్టీ నియోజకవర్గ ముఖ్య నేత ఎటువంటి టెండర్లు వేయనీయకుండా నామినేషన్ పద్దతిలో ఈ నియోజకవర్గంతో సంబంధం లేని బినామీలకు కాంట్రాక్ట్‌ను కట్టబెట్టారు. కేటాయించిన నిధులను నీటి శుద్ధికి ఖర్చు చేయనీయకుండా మొత్తం బొక్కేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటి నుంచి నియోజకవర్గంలో ప్రజలకు సరిగా తాగునీరు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు. వర్కర్‌లకు జీతాలు కూడా చెల్లించకుండా వారిని పస్తులు ఉంచుతున్నారు. 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా బిల్లులు రాలేదని వంకలు చెప్తున్నారు. చేయాల్సిన పనులు చేయకుండా ఈ కేటాయించిన రూ.3 కోట్లు ఎటు వెళ్తున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనికి తోడు నీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుంది. మోటార్ల మరమ్మతులు, పైప్ లైన్ మరమ్మతులు వంటి అన్నీ పనులకు మళ్లీ బిల్లులు చేస్తుంటారు. అయినా నేతల కక్కుర్తి ప్రజలకు శుద్దినీటిని దూరం చేస్తోంది.
అధిక మొత్తంలో బిల్లుకు ఒత్తిళ్లు:
నియోజకవర్గంలో ఏఈగా పని చేస్తున్న అధికారిపై సుమారు రూ.40 లక్షలకు మరమ్మతులు, మోటార్లు రిపేర్లు వచ్చినట్లు, ఇతర మరమ్మతుల పనులు చేసినట్లు బిల్లులు చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే సదరు అధికారి దొంగ బిల్లులు చేస్తే తన ఉద్యోగం పోతుందని తెగేసి చెప్పారని ఆ శాఖ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. దీంతో ఎలాగైనా ఆ బిల్లులు చేస్తేనే మేం పనులు మొదలు పెడతామని కాంట్రాక్టర్లు కూడా తప్పించుకుని వెళ్లిపోయేందుకు ఎత్తులు వేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మూడు రోజులుగా దర్శికి వచ్చి బేరసారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


