అభివృద్ధికి నోచుకోని పునరావాస కాలనీ రెండేళ్లు పట్టించుకోకుండా..నేడు హడావుడి వసతులు లేకపోవడంతో గృహాలు నిర్మించుకునేందుకు ముందుకురాని వైనం ముంపు గ్రామాలను ఖాళీ చేయిస్తున్న ప్రభుత్వం
ఊరు పొమ్మంది..
బేస్తవారిపేట: వెలిగొండ ప్రాజెక్ట్ పరిధిలోని కాకర్ల డ్యామ్ ముంపు బాధితుల పట్ల కూటమి ప్రభుత్వం దారుణమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రాజెక్ట్ పనుల్లో పురోగతి చూపించకపోగా, చట్ట ప్రకారం కల్పించాల్సిన పునరావాస ప్యాకేజీని గాలికొదిలేసి ముంపు గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయించేందుకు అధికారులు యత్నించడం తీవ్ర దుమారం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో 60 శాతానికి పైగా పనులు పూర్తయితే, కూటమి ప్రభుత్వ రెండేళ్ల కాలంలో మిగులు పనులను పూర్తి చేయడంలో ఘోరంగా విఫలమైంది. పునరావాస కాలనీల్లో కనీస మౌలిక వసతులు కల్పించకుండానే ఇళ్లను ఖాళీ చేయాలంటూ ఒత్తిడి తేవడంపై 5 ముంపు గ్రామాల నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెలిగొండ ప్రాజెక్ట్‌లో భాగమైన అర్థవీడు మండలంలోని కాకర్ల గ్యాప్ ముంపులో మెట్టుగొంది, క్రిష్ణనగర్, సాయిరామ్ నగర్, పొట్టిబసవపల్లి, లక్ష్మీపురం గ్రామాలు ఉన్నాయి. ఈ ఐదు గ్రామాల పునరావాస నిర్వాసితుల కోసం గతంలో బేస్తవారిపేట మండలంలోని పూసలపాడు బస్టాండ్ సమీపంలో ఒంగోలు–నంద్యాల హైవేరోడ్డు పక్కన పునరావాస కాలనీ ఏర్పాటు చేశారు. 20 ఎకరాలను రైతుల నుంచి భూసేకరణ చేసి 130 ప్లాట్లు వేశారు. ముంపు గ్రామాల్లోని నిర్వాసితులకు ప్లాట్లు కేటాయించారు. సకాలంలో కాలనీలో పనులు పూర్తి చేసి గృహాలు నిర్మించుకునేందుకు అనువైన పరిస్థితులు కల్పించాల్సిన ప్రభుత్వం రెండేళ్లుగా పట్టించుకోలేదు.
శ్రీశైలం హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలకు సంబంధించి ట్రయల్ రన్ పేరిట అధికారులు హడావుడి చేస్తుండగా, క్షేత్రస్థాయిలో కాకర్ల డ్యామ్ ముంపునకు గురయ్యే ఐదు గ్రామాల ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత రెండేళ్లుగా పునరావాస కాలనీలో పనులను పట్టించుకున్న పాపానపోలేదు. పునరావాస చట్టం–2013 ప్రకారం నిర్వాసిత బాధితులకు పూర్తి స్థాయి నష్టపరిహారం, పునరావాస ప్యాకేజీ పూర్తిగా చెల్లించిన తర్వాతే ఇళ్లు లేదా భూములను స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ పునరావాస కేంద్రంలో పనులు పూర్తి చేయకుండానే గ్రామాలను ఖాళీ చేయించేందుకు అధికారులు రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ అసమర్థత, అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల ముంపు గ్రామాల ప్రజలు వీధిన పడే పరిస్థితి దాపురించింది.
దొంగల హల్‌చల్...
ప్రభుత్వం మారక పట్టించుకోకపోవడంతో పంచాయతీ కార్యాలయం, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు, స్విచ్‌బోర్డులు, మెయిన్‌లు, విద్యుత్ పరికరాలన్నీ అపహరణకు గురయ్యాయి. విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలను కూడ దోచుకెళ్లారు. ముంపు గ్రామాలకు చెందిన వారు తమకు కేటాయించిన ప్లాట్లలో గృహాలు నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉన్నప్పటికి కనీస మౌలిక వసతులు సకాలంలో పూర్తి కాకపోవడంతో ఏ ఒక్కరూ ముందుకు రాలేని పరిస్థితి నెలకొంది.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జరిగిన పనులివీ..
లేఅవుట్‌లో లెవలింగ్, రూ.33 లక్షలతో గ్రామ పంచాయతీ కార్యాలయం, రూ.16.70 లక్షలతో అంగన్‌వాడీ కేంద్రం, రూ.86 లక్షలతో ప్రాథమిక పాఠశాల, రూ. 30 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రూ.24 లక్షలతో కమ్యూనిటీ హాల్, రూ.55 లక్షలతో ఓవర్‌హెడ్ ట్యాంక్, రూ.19 లక్షలతో విద్యుత్ స్తంభాలు–విద్యుత్ లైన్ ఏర్పాటు, 40 శాతం సీసీ రోడ్లు నిర్మాణ పనులు పూర్తి చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న పనులు..
మిగిలిన 60 శాతం సీసీ రోడ్ల నిర్మాణ పనులు, డ్రైనేజీ కాలువలు, లైబ్రరరీ, పోస్టాఫీసు, పశువైద్యశాల నిర్మాణ పనులు ఈ రెండేళ్లలో పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వంలో ఓహెచ్‌ఆర్ నిర్మాణం పూర్తయింది. అయినా ఈ ప్రభుత్వం బోర్ల నుంచి నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోలేదు. కాలనీలోని అన్నీ ప్లాట్ల వద్దకు పైపులైన్ ఏర్పాటు చేయాల్సి ఉంది.


