ఏడుగురిపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు...
న్యూస్‌రీల్
తవ్వేకొద్దీ బయటపడుతున్న ఒంగోలు కార్పొరేషన్ అధికారుల అక్రమాలు ఆర్‌అండ్‌బీ స్థలంలో ప్రైవేటు వ్యక్తులకు బిల్డింగ్ ప్లాన్ రూ.5 కోట్ల విలువైన 50 గదుల ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం సెట్ బ్యాక్స్ లేవు...అక్రమంగా అదనపు అంతస్థు విచారణలో బయటపడిన మాజీ కమిషనర్ అవినీతి, అక్రమాలు
ఒంగోలు నగర పాలక సంస్థలో అధికారుల అవినీతి పుట్ట పగులుతోంది...తవ్వే కొద్దీ మాజీ కమిషనర్ వెంకటేశ్వరరావు టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి చేసిన అవినీతి లీలలు ఒక్కోటీ వెలుగుచూస్తున్నాయి. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్)లో దోపిడీ ఒక రకమైతే, ప్రభుత్వ స్థలాలను సైతం ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసి మరీ లక్షల రూపాయలు దోచుకున్న వైనాలు బయట పడుతున్నాయి. గతంలో బైపాస్ నిర్మాణానికి తీసుకొని నష్ట పరిహారం చెల్లించి ఆర్‌అండ్‌బీకి అప్పగించిన రూ.కోట్ల విలువైన స్థలంలో ప్రైవేటు వ్యక్తికి బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఇచ్చిన వైనం విచారణలో తాజాగా వెలుగుచూసింది.
ఒంగోలు సబర్బన్:
ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొత్త రకం అవినీతికి తెరలేపారు. భూసేకరణ కింద ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్లాన్ అప్రూవల్ ఇచ్చేశారు. ఒంగోలు ఉత్తర బైపాస్ రోడ్డు జంక్షన్‌కు పక్కనే ఉండటంతో ఆ స్థలం విలువ రూ.5 కోట్లకు పైగా ఉంది. టౌన్‌ప్లానింగ్‌లో చోటుచేసుకున్న అక్రమాలపై న్యాయవాది డీఎస్ బాబు చేసిన ఫిర్యాదులు, ఆరోపణలపై గత 10 రోజులుగా గుంటూరు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ స్వయంగా ఒంగోలు వచ్చి విచారణ జరిపి మాజీ కార్పొరేషన్ కమిషనర్‌తో పాటు టౌన్ ప్లానింగ్ అధికారులు చేసిన అక్రమాలపై రాష్ట్ర టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్‌కు నివేదిక పంపారు. విచారణలో వెలుగు చూసిన అక్రమాలు విస్తుగొలుపుతున్నాయి.
ఆగని అవినీతి ఊట
ఉత్తర బైపాస్‌లో ఆర్‌అండ్‌బీ స్థలంలో తాతా ప్రశాంత్‌కు చెందిన కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంలో చోటుచేసుకున్న అక్రమాలను నిర్ధారించి నిబంధనలు పాటించకుండా ప్లాన్ అప్రూవల్ ఇచ్చిన ఒంగోలు నగర పాలక సంస్థకు చెందిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని గుంటూరు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. గతంలో ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావుతో పాటు రిటైరైన ఏసీపీ డీ.సుధాకర్, టీపీఓ కే.బాబూరావు, టీపీఎస్ ఎస్‌కే రసూల్, రిటైరయిన డిప్యూటీ డైరెక్టర్ ఎన్.నారాయణరావు, టీపీబీఓ జి.సాయి మురళీకృష్ణ, కే.జోషిలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. వీరిలో కొంతమంది రిటైర్ కాగా మరికొంత మంది ఇప్పటికే సస్పెండై ఉన్నారు. అయినా చర్యలు తీసుకోవాలని తేల్చారు. ఆర్‌అండ్‌బీ రోడ్డు స్థలం ఆక్రమించి భారీ బిల్డింగ్ నిర్మిస్తున్న యాజమాన్యంపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. అలాగే అప్రూవల్ ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించిన బిల్డింగ్‌ను తొలగించాలని సూచించారు.


