ఒంగోలు టౌన్: రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతుందని జూడా ప్రసిడెంట్ డాక్టర్ భార్గవ సాయి స్పష్టం చేశారు. స్టై ఫండ్ పెంచాల్సిందిగా జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తుంటే స్పందిచని రాష్ట్ర ప్రభుత్వం జూడాల గురించి అసత్య ప్రచారం చేయడాన్ని ఖండించారు. స్టైఫండ్ పెంచాలని, బోధనా వైద్యుల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచవద్దని, నాన్ మెడికల్ వ్యక్తులను అసిస్టెంట్ టీచర్లుగా నియామకాలు చేపట్టవద్దంటూ డిమాండ్ చేస్తూ జూడాలు చేపట్టిన సమ్మె శుక్రవారం 12వ రోజుకు చేరింది. తొలుత అత్యవసర సేవలను, ఐసీయూ, క్యాజువాలిటీ సర్వీసులను సమ్మె నుంచి మినహాయించి మిగతా రెగ్యులర్ వైద్య సేవలను బహిష్కరించారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో మూడో విడత నుంచి అత్యవసర సేవలను కూడా బహిష్కరించి పూర్తిస్థాయి సమ్మెకు దిగారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడమే కాకుండా జూనియర్ డాక్టర్ల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే జూనియర్ డాక్టర్లు సమ్మెను మరింత ఉధృతం చేశారు. జూడా ప్రసిడెంట్ భార్గవ సాయి, కార్యదర్శి క్రిస్ కాంత్, ఉపాధ్యక్షురాలు ఫైజ్ ఖాన్ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. అనంతరం మెడికల్ కాలేజీ, సర్వజన ఆస్పత్రి ఆవరణలో ర్యాలీ నిర్వహించారు. 12వ రోజు రిలే నిరాహార దీక్షలో జూనియర్ డాక్టర్లు జోయల్, భరత్, రుచిత, నివేదిత, రమ్య, లాస్య, మౌనిక, బద్రీ రుచిత పాల్గొన్నారు.


