మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఆవేదన పట్టదా అని నెల్లూరు పార్లమెంట్ వైఎస్సార్ సీపీ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాలు ఇప్పటికీ తమ సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పునరావాసం, పరిహారం, గృహాల కేటాయింపులో నిర్వాసితులందరూ అవస్థలు పడతున్నారని, ప్రాజెక్టులు కట్టడంతోపాటు నిర్వాసితుల సమస్యల పరిష్కారంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. వారి త్యాగాన్ని మరువవద్దన్నారు.
మార్కాపురం: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా టన్నెల్, సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల డ్యామ్‌లను జలవనరుల శాఖ సీఈ రమేష్, ఎస్‌ఈ అబూతలీ, ఈఈ రమేష్ తదితరులు శుక్రవారం పరిశీలించారు. ఈనెల 26 లోగా పెండింగ్ పనులు పూర్తిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. 26 తరువాత ట్రయల్‌రన్ నిర్వహించే అవకాశం ఉందని, సుమారు 10 టీఎంసీల నీరు నిల్వఉండే అవకాశం ఉందని, నిర్వాసితులందరూ గ్రామాలను ఖాళీ చేయాలని తెలిపారు. ఫీడర్ కెనాల్, టన్నెల్‌లో పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే ట్రయల్ రన్ నిర్వహిస్తామని ఎస్‌ఈ తెలిపారు. పది టీఎంసీల నీటిని వదిలే అవకాశం ఉన్నందున సుంకేశుల, అక్కచెరువు తాండ, చింతలముడిపి, కాటంరాజు తాండ మునిగిపోయే అవకాశం ఉందన్నారు. వారికి పూర్తిగా పరిహారం అందిస్తామన్నారు. ఈనెల 22న ట్రయల్ రన్ నిర్వహించాలని అధికారులు ముందుగా నిర్ణయించి మెమో జారీ చేశారు.
వెలిగొండ ట్రయల్ రన్ 27కు వాయిదా
పెద్దదోర్నాల: వెలిగొండ ప్రాజెక్టు ట్రయల్ రన్ ఈ నెల 27కు వాయిదా వేసినట్లు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 18న సొరంగంలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు మరణించిన నేపథ్యంలో శనివారం జరగాల్సిన ట్రయల్ రన్ వాయిదా పడినట్లు తెలిపారు. సొరంగంలో కార్మికుడు మృతి చెందిన నేపథ్యంలో పనులు కొంత మేర ఆలస్యమైనట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో 27వ తేదీన ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ఒంగోలు టౌన్: దళితులపై కొనసాగుతున్న వివక్షకు వ్యతిరేకంగా, దళితవాడల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24వ తేదీ కలెక్టరేట్ ముట్టడి నిర్వహించనున్నట్లు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు, సీఐటీయూ సీనియర్ నాయకుడు ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం నేతాజీ కాలనీ, చైతన్య కాలనీ, వెంకటేశ్వర కాలనీ, జయప్రకాష్ కాలనీ ఎక్సటెన్షన్, నెహ్రూ కాలనీ ఎక్స్‌టెన్షన్, వడ్డివానికుంట, గాంధీ నగర్, యానాది కాలనీ, కొత్తడొంక, ప్రగతి కాలనీ, గద్దలగుంట, మామిడిపాలెం ప్రాంతాల్లో మోటారు బైకు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు దాటినా దళితుల జీవన పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల వివక్ష కారణంగా దళితులు విద్య, వైద్యానికి దూరమవుతున్నారని తెలిపారు. దళిత వాడల్లో మౌలిక వసతులు లేవని, రోడ్లు, డ్రైనేజీ, మురుగునీటి పారుదల, మంచినీటి సమస్యలు తిష్టవేశాయని చెప్పారు. దళితవాడల్లో రోడ్లుంటే డ్రైనేజీలు ఉండవని, డ్రైనేజీ ఉంటే రోడ్లు ఉండటంలేదన్నారు. ఈ రెండూ ఉంటే శ్మశానవాటిక ఉండటంలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను వారికే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు అందాల్సిన 26 రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. కుల వివక్ష, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో దళితులంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ బైకు యాత్రలో కేఎఫ్ బాబు, విజయమ్మ, బీవీ రావు, తంబి శ్రీనివాసరావు, మహేష్, శేషయ్య తదితరులు పాల్గొన్నారు.


