బాధితులపైనే బెదిరింపు కేసులు | - | Sakshi
Sakshi News home page

బాధితులపైనే బెదిరింపు కేసులు

Aug 17 2026 1:53 AM | Updated on Aug 17 2026 1:53 AM

దర్శి:

ర్శి నియోజకవర్గంలో అధికార పార్టీ అరాచకాలు మితిమీరిపోతున్నాయి. పోలీసులను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు చేస్తున్న అవినీతి అక్రమాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పచ్చనేతల దౌర్జన్యాలకు పోలీసులు సైతం కొమ్ముకాస్తూ వారు చెప్పిందల్లా చేస్తున్నారు. వారి పరిధి దాటి సివిల్‌ వివాదాల్లో సైతం పోలీసులు తలదూరుస్తున్నారు. ఏకంగా బాధితులపైనే అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారు. ఇటీవల తాళ్లూరు మండలం తూర్పుగంగవరంలోని గుంటి గంగా భవానీ అమ్మవారి ఆలయ చైర్మన్‌, టీడీపీ నాయకుడు సానే సురేష్‌ ఏకంగా అన్నపూర్ణ అనే మహిళా భక్తురాలిపై విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరచడం, కేసు నమోదు కాకుండా బాధితురాలినే అదృశ్యం చేయడాన్ని మరవకముందే.. దర్శి మండలంలో అధికార పార్టీ దుర్మార్గం మరొకటి వెలుగుచూసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా భూములు ఆన్‌లైన్‌ చేయించుకుని రోడ్డును ఆక్రమించిన ఇద్దరు టీడీపీ నాయకులు.. తమపై ఫిర్యాదు చేసిన వారిపైనే అక్రమ కేసు బనాయించి పోలీసులను అడ్డం పెట్టుకుని నెల రోజులుగా వేధిస్తున్నారు. ఆ వివరాల్లోకెళ్తే...

దర్శి మండలం శామంతపూడి రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్‌ 325/14లో 14 మంది దాయాదుల కుటుంబాలకు 3.07 ఎకరాల తోటల భూమి (దొడ్లభూమి) ఉంది. ఆ భూమిలో గడ్డివాములు, గేదెల దిబ్బలు, ట్రాక్టర్లు పెట్టుకుని గేదెలు మేపుకుంటూ జీవిస్తున్నారు. ఆ భూమిలో 31 సెంట్లను ఉమ్మడి మీద వినాయకుని గుడికి, ఇతర దొడ్లకు దారి కోసం, బావి కింద స్థలానికి తమ పూర్వీకుల కాలం నుంచి అందరూ కలిసి వదిలిపెట్టారు. అందులో 7 సెంట్లలో భావి తవ్వారు. 24 సెంట్లలో బాటలు, చాకల్లు గుడ్డలు ఉతికేందుకు నీటి తొట్లు ఏర్పాటు చేశారు. అయితే, సమాన భాగస్తులైన మిగిలిన వారికి తెలియకుండా ఇద్దరు వ్యక్తులైన టీడీపీ వర్గీయులు భోగిరెడ్డి అంకిరెడ్డి 7 సెంట్లు, భోగిరెడ్డి జయరామిరెడ్డి 24 సెంట్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా ఆన్‌లైన్‌ చేయించుకున్నారు. ఆ బాటలో ఎవరినీ వెళ్లనీయకుండా కంపవేసి అడ్డుకున్నారు. దీనిపై మిగిలిన భాగస్తులైన భోగిరెడ్డి కృష్ణారెడ్డి, అంకిరెడ్డి, పెద్దఅంజిరెడ్డి, గంగవరపు వెంకటరెడ్డి, కోటిరెడ్డి ప్రశ్నించినా ఫలితం లేకపోవడంతో వారి వద్ద ఉన్న 14 మందికి భాగం ఉన్నట్లు రెవెన్యూ అధికారులిచ్చిన ఎఫ్‌ఎల్‌ఆర్‌, వీఆర్వో రిపోర్టులు, మండల సర్వే రిపోర్టులన్నీ తీసుకుని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ, రాజకీయ పలుకుబడి ఉపయోగించి టీడీపీ నేతల అండతో గుడికి వెళ్లే బాటను కూడా మూసివేసి తమను గుడికి, తమ దొడ్లలోకి కూడా వెళ్లనీయకుండా ఆక్రమణదారులు ఇబ్బంది పెడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారనే కక్షతో అక్రమ కేసులు...

దర్శి పోలీస్‌స్టేషన్‌లో న్యాయం జరగకపోగా, బెదిరిస్తుండటంపై బాధితులు గత నెలలో గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసి తమ గోడు వినిపించుకున్నారు. దీనిపై కక్ష పెంచుకున్న ఆక్రమణదారులైన టీడీపీ నేతలు.. బాధితులపైనే అక్రమ కేసు పెట్టించి వేధింపులకు గురిచేస్తున్నారు. గత 20వ తేదీ సదరు టీడీపీ నేతల స్థలాల్లోని పాకలను బాధితులు పీకేశారంటూ అక్రమ కేసు బనాయించారు. నెల రోజులుగా వారిని ఏ పనీ చేసుకోనివ్వకుండా పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిప్పుతూ వేధింపులకు గురిచేస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో బాధితులను పదేపదే ఎస్సై పిలిపిస్తున్నారు. సదరు భూమి జోలికి వెళ్తే ఊరుకునేది లేదని, మీరు అడ్డొస్తే.. నేనే దగ్గరుండి ఆక్రమణదారులతోనే పాకలు వేయిస్తానని ఎస్సై బెదిరిస్తున్నారు. న్యాయం చేయమని అడిగినందుకు తమపైనే అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని, ఇంకా గట్టిగా నిలదీస్తే తమ ఇళ్లలోని మహిళలను కూడా అసభ్యంగా మాట్లాడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులైనా స్పందించి తమ వద్ద ఉన్న ఆధారాలు, పత్రాలన్నీ పరిశీలించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

14 మందికి హక్కు కలిగినట్లు ఉన్న అడంగల్‌ కాపీ ,14 మంది హక్కుదారులకు మండల సర్వేయర్‌ ఇచ్చిన సర్వే రిపోర్ట్‌

అక్రమంగా భూమి ఆన్‌లైన్‌

చేయించుకుని రోడ్డును ఆక్రమించిన టీడీపీ నేతలు

గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు

ఆ ఫిర్యాదును పట్టించుకోకపోగా

కక్ష కట్టి బాధితులపైనే అక్రమ కేసు

బనాయించి వేధింపులు

నెల రోజులుగా పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిప్పుతూ బెదిరిస్తున్న పోలీసులు

దర్శి మండలంలో అధికార పార్టీ

అరాచకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement