అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

Aug 17 2026 1:53 AM | Updated on Aug 17 2026 1:53 AM

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి ప్రజలకు మెరుగైన సేవలందించాలి నేడు ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్‌

సింగరాయకొండ: అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని మూలగుంటపాడు పంచాయతీ రేగలకుంట చెరువు వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం దాసరిపాలెంలోని సీఆర్‌ నగర్‌లో నివసిస్తున్న పూసలపాటి రాజేష్‌ (38)కు వివాహమై ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కొంతకాలం క్రితం ఒక ఆడపిల్ల మరణించగా, మరో ఆడపిల్లకు మతిస్థిమితం లేదు. కొద్ది రోజుల క్రితం భార్య పార్వతితో గొడవపడిన రాజేష్‌.. రేగలకుంట ప్రాంతానికి వచ్చి లారీ పట్టలు కుడుతూ జీవిస్తున్నాడు. ఇతనికి అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. తోటి స్నేహితులు చికిత్స చేయించుకోమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏమైందో ఏమోగానీ రేగలకుంట చెరువులో రాజేష్‌ శవమై కనిపించాడు. చెరువులో ప్రమాదవశాత్తూ పడిపోయాడా.. లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? అనే విషయం పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఇతను రెండు రోజుల క్రితం చెరువులో పడి మరణించాడని, శరీరంపై చర్మం, వెంట్రుకలు ఊడిపోతున్నాయని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం యువనేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ అంకేపల్లి బంగారు బాబు సహకారంతో ఒంగోలు జీజీహెచ్‌కి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్‌.సుధీర్‌కుమార్‌ తెలిపారు.

ఆర్టీసీ నెల్లూరు ఈడీ జగదీష్‌

గిద్దలూరు రూరల్‌: ప్రజలకు ఆర్టీసీపై నమ్మకం కలిగించేలా పనిచేస్తూ మెరుగైన సేవలందించాలని నెల్లూరు ఈడీ ఎం.జగదీష్‌ సిబ్బందికి సూచించారు. పట్టణంలోని ఆర్టీసీ డిపోను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ప్రజలకు మెరుగైన సేవలందించేలా నిబద్ధతతో పనిచేయాలన్నారు. ఇంధనం పొదుపును ప్రతి డ్రైవర్‌ తప్పకుండా పాటించాలన్నారు. ఆర్టీసీని లాభాల బాటలో పయనించేందుకు ప్రతిఒక్కరం కలిసి ప్రయత్నించాలన్నారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షిత ప్రయాణమనే బలమైన నమ్మకాన్ని ప్రజలకు కల్పించాలన్నారు. ఈ సందర్భంగా డిపో ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్‌ రోడ్లను ఆయన పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలతో రోడ్ల నిర్మాణాలు చేపట్టేలా చూడాలన్నారు. ఆయన వెంట ఆర్టీసీ మార్కాపురం జిల్లా ఆర్‌ఎం జి.వెంకటేశ్వర్లు, డిపో మేనేజర్‌, షేక్‌ మౌనిక, ఎస్‌టీఐ నాయక్‌, ఈయూ రీజినల్‌ ప్రెసిడెంట్‌ రత్నం, జిల్లా రీజినల్‌ సెక్రటరీ కొత్తకోట పోలయ్యయాదవ్‌, గ్యారేజీ ప్రెసిడెంట్‌ భానుప్రకాష్‌, తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు సబర్బన్‌: కలెక్టర్‌ పి.రాజాబాబు ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్‌ నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి వెంకట రమణ తెలిపారు. ఆ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ప్రతి నెలా 3వ సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీటింగ్‌ హాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన ప్రజలు, ఆయా కుల సంఘాల అసోసియేషన్‌ వారు సమస్యలపై కలెక్టర్‌, జేసీ, జిల్లా అధికారులకు అర్జీలు అందించి పరిష్కరించుకోవాలని సూచించారు. కాగా, ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) యథావిధిగా జరుగుతుందని డీఆర్వో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement