యర్రగొండపాలెం: చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితుల జీవితాల్లో నీళ్లు వదులుతోందని, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి చూపుతోందని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో జరిగిన అవకతవకలపై దృష్టి పెట్టకుండా ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయి, నీళ్లు వదులుతున్నాం, ఊళ్లు ఖాళీ చేయండని నిర్వాసితులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారని, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అవార్డు లిస్టులో లేని 1150 మందికి తక్షణమే పేర్లు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్యాకేజీ ఇవ్వకుండా అక్కడి కుటుంబాలను తరలించాలన్న ఆలోచన వెంటనే విరమించుకోవాలని హితవుపలికారు. లేకుంటే ఆ కుటుంబాల పక్షాన ఉద్యమించటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. నిర్వాసితుల జీవితాలతో చెలగాటం ఆడటం, వారిని అవమానపరిచేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందన్నారు. వారికి ఇవ్వాల్సిన ప్యాకేజీని ఇవ్వడం లేదని, నిర్వాసితుల నివాస స్థలాల్లో వసతులు ఏర్పాటు చేయడంలేదని, నిర్మించిన కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలేదని, రెండేళ్ల నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో, ప్రాజెక్ట్ అధికారులు తమ చుట్టూ తిప్పుకుంటున్నారని అన్నారు. ఇప్పటి వరకు ఒక్క సమస్య పరిష్కరించకుండా వారిపై ద్వేషంతో అధికారులు రగిలిపోవడం గర్హనీయమని, నిర్వాసితులు ఏం తప్పు చేశారని వారి హక్కులకు అడ్డుపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. వెలిగొండ ప్రాజెక్ట్ నిజరూపం దాల్చటానికి వారి జీవితాలతో ముడిపడిఉన్న ఇళ్లు, పొలాలు, స్థలాలు, బంధాలు అన్నీ త్యాగంచేసి రాష్ట్రం కోసం నిలబడటం వారు చేసిన తప్పా, ఇది ఎంతవరకు సమర్ధనీయమన్నారు. ఉన్నపలంగా విద్యుత్ కట్ చేస్తాం, పోలీసులతో గెంటిస్తాం, గ్రామాల్లోకి రానివ్వమని నియంత పోకడలకు వెళితే చంద్రబాబు ప్రభుత్వం తీవ్రమైన చేదు అనుభవాన్ని ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు.
అసమర్ధ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి
అసమర్ధ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హతలేదని తాటిపర్తి అన్నారు. పుల్లలచెరువులోని కేజీబీవీ స్కూల్‌లో తాగేందుకు, కాలకృత్యాలు తీర్చుకోవటానికి నీళ్లు లేక ఆడపిల్లలు బక్కెట్లు పట్టుకొని రోడ్డుపైకి వచ్చారని, వేరే ప్రాంతంలో ఉన్న బోరుదగ్గర నీళ్లు పట్టుకొని వెళ్తున్నారని అన్నారు. ఈ సంఘటన ఎంత దుర్మార్గమని, అవమానకరమన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్, విద్యాశాఖలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఇటువంటి అసమర్ధత మంత్రి ఉంటే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు. సమావేశంలో యర్రగొండపాలెం, పెద్దదోర్నాల మండలాల పార్టీ అధ్యక్షులు ఏకుల ముసలారెడ్డి, గంటా వెంకటరమణారెడ్డి, పంచాయతీ రాజ్ వింగ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూమిరెడ్డి సుబ్బారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పర్తి చిన్న ఓబులరెడ్డి, వైస్ ఎంపీపీ మందుల ఆదిశేషు, కందూరి గురుప్రసాద్, ఆవుల వీరకోటిరెడ్డి, కందుల నాగార్జునరెడ్డి, అరుణాబాయి, సరళ, రాములు నాయక్, సురేష్ నాయక్ పాల్గొన్నారు.
అసమర్ధ విద్యాశాఖ మంత్రి లోకేష్
తక్షణమే రాజీనామా చేయాలి
ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్


