పామూరు: మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి జరిగిన మూడు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులు, క్షతగాత్రుల బంధువులు తెలిపిన వివరాల మేరకు.. కనిగిరి నియోజకవర్గంలోని వెలిగండ్ల మండలం బాపనపల్లి (రామలింగాపురం) గ్రామానికి చెందిన పుల్లారెడ్డి (45) తన బంధువులతో కలిసి పామూరు మండలం దాదిరెడ్డిపల్లె గ్రామంలో వివాహానికి బైక్ మీద వెళ్తున్నాడు. పామూరు మండలంలోని వగ్గంపల్లె కొండారెడ్డిపల్లె గ్రామ సమీపంలో 565వ నంబర్ జాతీయ రహదారి పక్కన బైక్ ఆపుకుని మాట్లాడుకుంటున్నారు. రోడ్డు పక్కన ఉన్న పుల్లారెడ్డిని పామూరు నుంచి కనిగిరి వైపునకు వెళ్తున్న కారు ఢీకొట్టి వెళ్లిపోవడంతో రోడ్డుమీదపడి మృతిచెందాడు. మృతునికి భార్య రమాదేవి, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని హైవే అంబులెన్స్‌లో పామూరు సీహెచ్‌సీకి తరలించారు. మరో ప్రమాదం మండలంలోని అయ్యవారిపల్లె – బోడవాడ గ్రామాల మధ్య చోటుచేసుకుంది. పామూరు డి.వి.పాలేనికి చెందిన ఆటో డ్రైవర్ దర్శినం బాలవెంకటయ్య (29) బైక్‌ను అతని సోదరుడు తీసుకుని ఆదివారం ఉదయం కందుకూరు వెళ్తుండగా, అయ్యవారిపల్లె – బోడవాడ గ్రామాల మధ్య పంక్చరైంది. దీంతో ఆ బైక్‌ను అక్కడే పెట్టి అతని సోదరుడు వెళ్లిపోయాడు. బాలవెంకటయ్య తన బైక్‌కు పంక్చర్ వేయించుకుని తీసుకొచ్చేందుకు పామూరు నుంచి మరో బైక్‌పై స్నేహితుడైన మెకానిక్‌ను ఎక్కించుకుని వెళ్తున్నాడు. ఆ సమయంలో అయ్యవారిపల్లె గ్రామ జంక్షన్ దాటిన తర్వాత బైక్‌కు అడ్డుగా వ్యక్తి రావడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో బాలవెంకటయ్య తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుకవైపు ఉన్న మెకానిక్‌కు గాయాలవగా 108లో కందుకూరు తరలించారు. మృతుడు బాలవెంకటయ్యకు భార్య రమ, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాలవెంకటయ్యను ఓ ప్రైవేటు వాహనంలో పామూరు సీహెచ్‌సీకి తరలించారు. మూడో ఘటన మండలంలోని కమ్మవారిపాలెం – కొత్తపల్లె గ్రామాల మధ్య బొట్లగూడూరు – కంబాలదిన్నె రోడ్డుపై చోటుచేసుకుంది. ఈ ఘటనలో నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రొంపిదొడ్ల గ్రామానికి చెంది ప్రస్తుతం పామూరు మండలంలోని రేణిమడుగు నుంచి బైక్‌పై పామూరు వెళ్తున్న మేకల నారాయణ మరోబైక్‌ను ఢీకొట్టి రోడ్డుపై పడిపోయాడు. నారాయణ తలకు తీవ్రగాయాలవడంతో 108 వాహనంలో పామూరు సీహెచ్‌సీకి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై కట్టా అనూక్ వైద్యశాలకు చేరుకుని మృతులు, క్షతగాత్రుల వివరాలు సేకరించారు. ఆయా ఘటనలపై విచారణ చేపట్టారు. మృతులు, క్షతగాత్రుల బందువుల ఆర్తనాదాలతో వైద్యశాల ప్రాంగణంలో విషాదం నెలకొంది.
మరో ముగ్గురికి గాయాలు


