గడువు పంజా! | - | Sakshi
Sakshi News home page

గడువు పంజా!

Aug 14 2026 8:38 AM | Updated on Aug 14 2026 8:38 AM

● పంట చేతికొచ్చేవేళ.. పొలాలు ఖాళీ చేయాలా? ● వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతుల ఆవేదన ● 2,000 ఎకరాల్లో పత్తి, మిర్చి సాగు ● నెలాఖరులోగా ఖాళీ చేయాలన్న ఆదేశాలతో ఆందోళన ● రైతులకు సుమారు రూ.3 కోట్ల పంట నష్టం

● పంట చేతికొచ్చేవేళ.. పొలాలు ఖాళీ చేయాలా? ● వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతుల ఆవేదన ● 2,000 ఎకరాల్లో పత్తి, మిర్చి సాగు ● నెలాఖరులోగా ఖాళీ చేయాలన్న ఆదేశాలతో ఆందోళన ● రైతులకు సుమారు రూ.3 కోట్ల పంట నష్టం

ముంపు రైతుపై

మార్కాపురం:

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురయ్యే పెద్దారవీడు, మార్కాపురం మండలాల పరిధిలోని గొట్టిపడియ, అక్కచెరువుతండా, సుంకేసుల, కలనూతల, గుండంచెర్ల తదితర గ్రామాల పరిధిలో సుమారు 2,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగుశారు. ఇందులో సుమారు 1,500 ఎకరాల్లో పత్తి, మరో 500 ఎకరాల్లో మిర్చి సాగులో ఉంది. పంటలు ఏపుగా పెరిగి దిగుబడికి సిద్ధమవుతున్న సమయంలో ప్రభుత్వం నెలాఖరులోగా పొలాలు ఖాళీ చేయాలని ఆదేశించడంతో రైతులు అయోమయంలో పడ్డారు. ఎకరా పత్తి సాగుకు సుమారు రూ.10 వేలు ఖర్చవగా, ఎకరా మిర్చికి రూ.25 వేల వరకూ ఖర్చుపెట్టారు. ఈ లెక్కన మొత్తంమీద పత్తి, మిర్చితో పాటు ఇతర పంటల సాగు కలుపుకుని సుమారు రూ.3 కోట్ల మేర ఖర్చు వచ్చిందని రైతులు తెలిపారు.

పంటను ఏం చేయాలి.?

వెలిగొండ ప్రాజెక్టు కోసం తమ భూములు, ఇళ్లను వదులుకున్న రైతులకు కొత్త కష్టం వచ్చిపడింది. ఇప్పటికే వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటను మధ్యలోనే వదిలేయాల్సి వస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టుకు భూములిచ్చేందుకు అభ్యంతరం లేదుగానీ.. ఇప్పటికే సాగు చేసిన పంట చేతికి రాకముందే వదిలేయమంటే ఎలా.? పంట కోసం పెట్టిన పెట్టుబడైనా తిరిగి రావాలి కదా.? అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

రూ.3 కోట్ల వరకు నష్టం...

సుమారు 2,000 ఎకరాల్లో సాగులో ఉన్న పత్తి, మిర్చి పంటలను పూర్తిగా పండించుకోలేకపోతే నిర్వాసిత రైతులకు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రస్తుత సాగు పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే సుమారు 3 కోట్ల రూపాయల వరకు నష్టం సంభవించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, దుక్కులు, కూలీల ఖర్చులు, నీటి ఖర్చులు తదితరాల కోసం ఇప్పటికే పెట్టుబడి పెట్టిన మొత్తం నష్టపోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పత్తి రైతులకు పెను దెబ్బ...

ముంపు భూముల్లో సుమారు 1,500 ఎకరాల్లో ప్రస్తుతం పత్తి సాగులో ఉంది. పెద్దారవీడు మండలంలోని కలనూతల, గుండంచర్ల, సుంకేశుల, మార్కాపురం మండలంలోని గొట్టిపడియ, అక్కచెరువుతండా, తదితర గ్రామాల్లో పత్తి సాగు చేశారు. కలుపు తీయడం, ఎరువులు వేయడం, పురుగుమందులు పిచికారీ చేయడం, కూలీల ఖర్చులు.. ఇలా వరుసగా పెట్టుబడులు పెడుతూ పంట కాపాడుకున్నారు. ఇప్పుడు పంట దిగుబడికి వచ్చే సమయంలో పొలాన్ని ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాల్సి వస్తే ఇప్పటివరకు పెట్టిన పెట్టుబడితోపాటు ఆశించిన ఆదాయాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుందని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మిర్చి రైతుల పరిస్థితి మరింత ఆందోళనకరం...

మరోవైపు సుమారు 500 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. మిర్చి సాగుకు పెట్టుబడి అధికంగా ఉంటుంది. విత్తనాలు, నారు, ఎరువులు, మందులు, కూలీల ఖర్చులతో రైతులు ఇప్పటికే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారు. ఇలాంటి సమయంలో పొలాలు ఖాళీ చేయాల్సి వస్తే పెట్టుబడి తిరిగి రాకపోవడంతో పాటు పంట ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు కోసం భూమి తీసుకుంటున్న సమయంలో ఆ భూమిలో సాగులో ఉన్న పంటను కూడా పరిగణనలోకి తీసుకుని ప్రత్యేకంగా పంట నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement