జూడాల సమ్మైపె సర్కార్‌ నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

జూడాల సమ్మైపె సర్కార్‌ నిర్లక్ష్యం

Aug 14 2026 8:38 AM | Updated on Aug 14 2026 8:38 AM

మూడు రోజులైనా స్పందించని ప్రభుత్వం కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు వైద్య సేవలు నిలిచిపోయి రోగులకు అవస్థలు

ఒంగోలు టౌన్‌: జూనియర్‌ డాక్టర్ల సమ్మె గురువారం కూడా కొనసాగింది. సమ్మె మరింత ఉధృతమైంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర సేవలు మినహా మిగిలిన వైద్య సేవలను జూడాలు బహిష్కరించారు. మరోవైపు ఒంగోలు జీజీహెచ్‌ ఆవరణలో దీక్షా ప్రాంగణంలో జూనియర్‌ డాక్టర్లు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. స్టైఫండ్‌ మా హక్కు, వుయ్‌ వాంట్‌ జస్టిస్‌ అంటూ నినాదాలు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేదు. బోధనాస్పత్రుల్లో అత్యంత కీలక పాత్ర పోషించే జూనియర్‌ డాక్టర్లు సమ్మెబాట పట్టడంతో రోగులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు. సమ్మెను విరమింపజేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయకుండా వారి దారిన వారిని వదిలేసి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకుంటోంది. అంటే.. జూనియర్‌ డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించేది లేదని తేల్చి చెప్పినట్లే కదా.. అని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్వాకం వలన మూడు రోజులుగా వందలాది మంది రోగులు జీజీహెచ్‌లో సరైన వైద్యసేవలందక బాధపడుతున్నారు. అనేక వ్యయప్రయాసాలకోర్చి ఆస్పత్రికి వచ్చిన రోగులు వైద్యం కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.

తెలంగాణకు సమానంగా స్టైఫండ్‌ ఇవ్వాలి...

మన రాష్ట్రంలో ప్రస్తుతం జూనియర్‌ డాక్టర్లకు మొదటి సంవత్సరం రూ.60 వేలు, రెండో సంవత్సరం రూ.61 వేలు, మూడో సంవత్సరం రూ.64 వేలు స్టైఫండ్‌ ఇస్తున్నారని జూడాల ప్రెసిడెంట్‌ జి.భార్గవసాయినాయుడు తెలిపారు. మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో మొదటి సంవత్సరం రూ.70 వేలు, రెండో సంవత్సరం రూ.74 వేలు, మూడో సంవత్సరం రూ.77 వేలు ఇస్తున్నారని చెప్పారు. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా రూ.82 వేలు, రూ.85 వేలు, రూ.87 వేల చొప్పున స్టైఫండ్‌ ఇస్తున్నారని వెల్లడించారు. తమిళనాడు, కర్ణాటక, కేరళం రాష్ట్రాలలో మాత్రమే మనకంటే తక్కువ స్టైఫండ్‌ ఇస్తున్నారని తెలిపారు. ఇప్పుడు జూనియర్‌ డాక్టర్లు స్టైఫండ్‌ పెంచమని అడుగుతుంటే.. తమిళనాడు రాష్ట్రాన్ని చూపించి సర్దుకోమని చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 శాతం స్టైఫండ్‌ పెంచాల్సిందిగా కోరుతుంటే.. 3 శాతం మాత్రమే పెంచుతామని హెల్త్‌ సెక్రటరీ చెబుతున్నారన్నారు. ఇది ఎంత మాత్రం సమ్మతం కాదని స్పష్టం చేశారు. తాము తెలంగాణకు సమానంగా స్టైఫండ్‌ ఇవ్వమని మాత్రమే అడుగుతున్నామని చెప్పారు. అంతేగాకుండా ప్రభుత్వ వైద్యుల వయోపరిమితి పెంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీని వలన మెడిసిన్‌ పూర్తి చేసిన వైద్యులకు ఉద్యోగం రావడానికి 7 నుంచి 10 సంవత్సరాలు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ రంగంలో మంచి వేతనాలు ఇస్తున్నప్పటికీ వాటిని కాదని ప్రభుత్వ వైద్యులుగా ప్రజలకు సేవ చేయాలని తాము భావిస్తుంటే.. అడ్డుకునే విధంగా ప్రభుత్వ వైఖరి ఉందన్నారు. జూడాల వైస్‌ ప్రెసిడెంట్‌ ఫైజా ఖాన్‌ మాట్లాడుతూ తాము సమ్మె చేస్తున్నా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడం విచారకరమన్నారు. నిరసన దీక్షల్లో పెద్ద సంఖ్యలో జూనియర్‌ డాక్టర్లు పాల్గొన్నారు. జూనియర్‌ డాక్టర్ల సమ్మె పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న కూటమి ప్రభుత్వంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement