ఒంగోలు సిటీ: మీపై వస్తున్న ఆరోపణలను ప్రశ్నిస్తే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు ఎందుకు కోపం వస్తోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు ఇన్‌చార్జి చుండూరి రవిబాబు నిలదీశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడుగురు పీఏలను ఏర్పాటుచేసుకుని, వారికి డిపార్టుమెంట్‌లను పంచేశారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల సమస్యలు పరిష్కారం కావడంలేదని విమర్శించారు. ప్రభుత్వాలు మారినా అధికారులు మారరు కదా? పక్షపాత వైఖరి అవలంబించడం సరికాదన్నారు.
కలెక్టర్ విచారణ జరిపించాలి..
మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారని, కూటమిలో లేకుంటే తండ్రీకొడుకులను లోపల వేసేవాడినని ఎమ్మెలే...కూటమి ధర్మం పాటిస్తున్నా లేదంటే మిమ్మల్ని కడిగేసే వాడిని అంటూ మాజీ మంత్రి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమిలో ఉంటే ఒక పద్ధతి, లేకుంటే మరో పద్ధతి అన్నట్టుగా వీరి ప్రకటనలు ఉన్నాయన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఒకరిపై ఒకరు చేసుకున్న అవినీతి ఆరోపణలపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాధనం దుర్వినియోగంపై ఆరోపణలు ఉన్నాయని, ఇసుక, మట్టీ అక్రమాలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇసుక డిపోల వద్ద సొంత మనుషులను పెట్టుకుని టీడీపీ ఎమ్మెల్యే జనార్దన్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అధికార పార్టీ నేతల వేధింపులు భరించలేక టిప్పర్ల యజమానులు ధర్నా చేశారని ఆయన గుర్తు చేశారు. టిడ్కో ఇళ్లకు సంబంధించిన భూ సేకరణకు రూ. 3 కోట్లు అడ్వాన్స్ ఇచ్చానని, తర్వాత తీసుకున్నానని ఎమ్మెల్యే అంటున్నారని, ఎవరికి అడ్వాన్స్ ఇచ్చారు.. ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారనేది బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై పోరాటం చేస్తుంటే ఎమ్మెల్యే మమ్మల్ని దొంగలంటూ తూలనాడడం సరికాదని చుండూరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒంగోలు డెయిరీ స్థితికి మీరే కారణం..
ఒంగోలు డెయిరీని ఎవరికోసం మూత వేశారని చుండూరి రవిబాబు ప్రశ్నించారు. పాడి రైతులకు మా ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తు చేశారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటుచేసి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించామని, మీ ప్రభుత్వం పరిశ్రమలు మూసివేసి ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారని ఆరోపించారు. కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. ప్రభుత్వం వచ్చి రెండేళ్లు లోపే లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. రాజధాని పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని, పల్లపు ప్రాంతంలో రాజధాని కడుతూ లెక్కకు మించి డబ్బులు వెచ్చిస్తూ లూఠీకి పాల్పడుతున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి పదవిని లీజుకిస్తారా..?
ప్రభుత్వ ఆస్తులను లీజుకిస్తున్న చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని లీజుకిస్తారా అంటూ చుండూరి రవిబాబు ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య విధానంలో ఆందోళన చేస్తున్నామని, టీడీపీ సోషల్ మీడియా వ్యక్తిగతంగా కించపరిచేలా పోస్టులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ మాటలు, మీ పోస్టులు రికార్డులు అవుతున్నాయని జాగ్రత్తగా ఉండండని హెచ్చరించారు. సోషల్ మీడియా వారు జాగ్రత్తగా ఉండాలన్నారు. అనవసరంగా మీ జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు.
టీడీపీ భూ దందాలను అడ్డుకున్నాం..
టీడీపీ హయాంలో నియోజకవర్గంలో జరుగుతున్న భూ దందాలకు మా పార్టీ నేతలు అడ్డుకున్నారని చుండూరి రవిబాబు తెలిపారు. పాత కూరగాయల మార్కెట్ వద్ద, కేశవరాజుకుంట వద్ద భూ అక్రమాలను అడ్డుకున్నామన్నారు. మెప్మా అక్రమాలపై అధికారిని సస్పెండ్ చేసి వదిలేశారన్నారు. దీనిపై ఆ నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీసిందన్నారు. మాజీ మంత్రి వాస్తవాలు తెలియకుండా మాట్లాడడం సరికాదన్నారు. నగరంలో జరుగుతున్న భూ దందాలపై మా ప్రభుత్వ హయాంలో సిట్ వేశామని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అది ఏమైందో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలన్నారు. కొత్తపట్నంలో ఉన్న డీకే భూములపై విచారణ జరిపించాలని ప్రశ్నించారు. మద్యం దుకాణాల విషయంలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేయాలన్నారు. డబ్బుల కోసం ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని విమర్శించారు.
ఆరోపణలపై దామచర్ల సమాధానం చెప్పాలి
కూటమి నేతల ఆరోపణలపై విచారణ జరిపించాలి
నియోజకవర్గంలో భూ దందాలను అడ్డుకున్నది వైఎస్సార్ సీపీనే
బాలినేని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి
వైఎస్సార్ సీపీ ఒంగోలు ఇన్‌చార్జి
చుండూరి రవిబాబు
కష్టాల్లో పొగాకు రైతు
కనీస మద్దతు ధర రాక పొగాకు రైతు కష్టాల్లో ఉన్నారని రవిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేస్తున్న ప్రకటనలు కామెడీగా ఉన్నాయన్నారు. వేలం కేంద్రాల్లో ఉన్న ధరల కంటే తక్కువకు కొనాలని ఆయన ప్రకటనలు చేయడం సరికాదన్నారు. వ్యాపారస్తులు సిండికేట్ అయి రైతులను ముంచేస్తున్నారని ఆరోపించారు. ఆక్వా రైతుల విషయంలో సైతం ప్రభుత్వం ఇదే రీతిలో వ్యవహరిస్తోందన్నారు. కేపాసిటర్‌లు ఏర్పాటు ద్వారా ఆక్వారైతుపై మోయలేని భారం వేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెళ్ల బంగారుబాబు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు మండల అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, నాయకులు ఇనగంటి పిచ్చిరెడ్డి, ఉప్పలపాటి ఏడుకొండలు, వైవీ గౌతమ్ అశోక్, పెట్లూరి ప్రసాద్, మల్లిశెట్టి దేవా, ప్రసన్న, యర్రజర్ల రమేష్‌బాబు పాల్గొన్నారు.


