మార్కాపురం టౌన్: నూతన జిల్లాలో తొలి స్వాతంత్య్ర దిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ విజయసునీత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వేడుకల ఏర్పాట్లు, వెలిగొండ ప్రాజెక్టుపై ఆమె సమీక్షించారు. ఈ నెల 15న స్థానిక ఎస్వీకేపీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న వేడుకలకు విద్యార్థులు, ప్రజలు భారీగా తరలిరానున్న నేపథ్యంలో పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌తో పాటు తాగునీరు, పారిశుధ్యం, షామియానాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, సాంస్కృతిక ప్రదర్శనలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల స్టాళ్లు, వినూత్న శకటాలు ఏర్పాటు చేయాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనున్న నేపథ్యంలో నిర్వాసితుల పునరావాసానికి అధికారులు అత్యంత ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్వాసితుల కాలనీల్లో తాగునీరు, రోడ్లు, విద్యుత్ తదితర మౌలిక వసతులు కల్పించాలన్నారు. సమావేశంలో జేసీ పి.శ్రీనివాసులు, ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి, డీఈఓ సుబ్బారావు, డ్వామా పీడీ సువార్త, ఐసీడీఎస్ ఇన్‌చార్జ్ పీడీ పద్మావతి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, తహసీల్దార్ చిరంజీవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మార్కాపురం కలెక్టర్ విజయ సునీత


