సాక్షి టాస్క్‌ఫోర్స్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తాళ్లూరు మండలంలోని గుంటి గంగమ్మ తల్లి దేవస్థానం వద్ద మతిస్థిమితం లేని ఒంటరి మహిళపై ఆలయ చైర్మన్, కూటమి నేత సానే సురేష్ కర్రతో అమానుషంగా దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయ సమీపంలో తిరుగుతూ ఉండే అన్నపూర్ణ అనే మహిళపై సురేష్ విచక్షణారహితంగా దాడి చేశాడు. దర్శి నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేత గొట్టిపాటి లక్ష్మి అండదండలతోనే అతడు తనపై ఈ దారుణానికి ఒడిగట్టాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తీవ్ర గాయాలపాలైన ఆమె.. దాడి అనంతరం దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి, ఓ అబల అని కూడా చూడకుండా కర్కశంగా వ్యవహరించడంపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. కాగా, సదరు చైర్మన్ సురేష్ గతంలోనూ ఓ వ్యక్తిపై ఇలాగే దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అమానుష ఘటనపై పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి, నిజానిజాలు వెలికితీయాలని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటోంది.
కర్రతో చితకబాదిన గుంటిగంగ
ఆలయ చైర్మన్ సానే సురేష్
ఆస్పత్రిలో చికిత్స పొందిన బాధితురాలు..


