● ఒక మోస్తరు వర్షం కురిస్తేనే జలమయమవుతున్న ఒంగోలు నగరం ● గతేడాది మోంథా తుఫాన్‌కు అతలాకుతలం ● పోతురాజుకాలువలో పూడికతీత పనుల్లో పాలకులు, అధికారుల నిర్లక్ష్యం ● వరద నీరు వెళ్లే మార్గం లేక నగరంలో విలయతాండవం ● అసలు సమస్యలు పక్కనబెట్టి ౖపైపె మెరుగులతో మభ్యపెడుతున్న పాలకులు ● ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 ఏళ్లయిన సందర్భంగా సుందరీకరణ అంటూ కలెక్టర్ సైతం హడావిడి ● స్వాగత ఆర్చీలు, విగ్రహాలు, పెయింటింగ్‌లు, ఆర్ట్ గ్యాలరీలు, ప్రముఖుల చిత్రాలతో ఫేమ్ వాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ● వరద, మురుగు సమస్యలు పరిష్కరించకుండా.. మౌలిక వసతులు లేకుండా.. ౖపైపె మెరుగులు ఎందుకంటున్న ప్రజలు
వర్షాకాలం వచ్చిందంటే ఒంగోలు నగర ప్రజలకు వరద భయం పట్టుకుంటోంది. ఒక మోస్తరు వర్షం కురిసినా నగరంలోని ప్రధాన రహదారులు సైతం జలమయమవుతున్నాయి. వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పలు లోతట్టు కాలనీల్లో రోజుల తరబడి వర్షం నీరు నిలిచిపోతోంది. ఇళ్లలోకి సైతం నీరు చేరి ఎంతో మంది నిరుపేద, మధ్య తరగతి ప్రజలు ఉండటానికి, తినడానికి సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో పాటు ప్రధాన డ్రైనేజీ కాలువ అయిన పోతురాజుకాలువ పూర్తిగా పూడికతో నిండిపోవడంతో దాని చుట్టుపక్కల కాలనీలన్నింటికీ వర్షాకాలంలో వరద ముప్పు పొంచి ఉంటోంది. చిన్నపాటి వర్షం కురిసినా నగరంలోని కర్నూలు రోడ్డు, ఊరచెరువురోడ్డు, ఉత్తర బైపాస్, గుంటూరు రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్, అద్దంకి బస్టాండ్ సర్కిల్లోని ప్రధాన రోడ్లన్నీ మోకాలి లోతు నీటితో నిండిపోతున్నాయి. వాహనాలు, ప్రజల రాకపోకలు స్తంభిస్తున్నాయి. ఆయా రోడ్ల పక్కనున్న షోరూంలు, షాపుల ముందు నీరు నిలిచి రోజుల తరబడి వ్యాపారాలు లేక దుకాణదారులు నష్టపోతున్నారు. నగర శివారుకాలనీల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటోంది. వర్షం కురిసినప్పుడల్లా ఇళ్లలోకి నీరు చేరి కూలి పనులు మానుకుని వాటిని తోడిపోసుకుంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మోంథాకు మునిగిన నగరం...
గత సంవత్సరం అక్టోబర్‌లో మోంథా తుఫాన్ ప్రభావానికి కురిసిన భారీ వర్షాలకు నగరంలోని ప్రధాన డ్రైనేజీ కాలువ అయిన పోతురాజుకాలువ పూడిక తీయకపోవడం వలన పొంగిపొర్లింది. నగరంలోని వెంకటేశ్వరకాలనీ, నెహ్రూకాలనీ, బలరాంకాలనీ, భరత్‌కాలనీ, ప్రకాశంకాలనీ, సత్యనారాయణపురం, వంటకాలనీ, గోపాలనగరం, కరుణాకాలనీ, భగత్‌సింగ్‌కాలనీ, పాపాకాలనీ, తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అయినప్పటికీ ఆ తర్వాత కూడా పోతురాజుకాలువలో పూడిక తీయకుండా పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రస్తుతం మళ్లీ వర్షాకాలం రావడంతో నగర ప్రజలు భయపడుతున్నారు.
గత ప్రభుత్వంలో పోతురాజుకాలువ అభివృద్ధి పనులు.. నేడు పూడిక కూడా తీయని వైనం...
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పోతురాజుకాలువ అభివృద్ధికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. ఇరువైపులా కాంక్రీట్ గోడలతో పాటు కాలువలో సిమెంట్ ఫ్లోరింగ్ పనులను కొంతమేరకు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో ఆయా పనులు నిలిచిపోయాయి. ఇటీవల పడవలతో పోతురాజుకాలువ పూడికతీత పనులంటూ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఆర్భాటంగా ప్రారంభించి ప్రచారం చేసుకున్నారు. కానీ, పూడికతీత పనులు పూర్తిగా కొనసాగలేదు. తూతూమంత్రంగా చేసి వదిలేయడంతో ప్రస్తుతం పోతురాజుకాలువ మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలు, చిల్లచెట్లు, పిచ్చిమొక్కలు, గుర్రపుడెక్కతో పూడిపోయింది. చుక్క నీరు కూడా ప్రవహించే పరిస్థితి లేకుండా పోయింది. గత సంవత్సరం మోంథా తుఫాన్ వర్షానికి నగరం జలమయమై నగర ప్రజలు పడిన ఇబ్బందులు చూసి కూడా పాలకులు, అధికారులకు కనువిప్పు కలగకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
గుర్రాలు, సింహాలు, విగ్రహాలు ఎందుకంటూ ప్రజల ప్రశ్నలు...
వర్షాలకు నగరం మునగకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచని పాలకులు, అధికారులు.. నగరంలో గుర్రాలు, సింహాలు, విగ్రహాలు, గోడలకు రంగులు వంటి పనికిరాని ౖపైపె మెరుగులు దిద్దడంపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి వచ్చే నెలాఖరుకు 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నగరంలోకి ప్రవేశించే ప్రధాన మార్గాలలో స్వాగత ఆర్చీలు, కూడళ్లలో ప్రముఖుల విగ్రహాలు, ఒంగోలు నగర చారిత్రక నేపథ్యం, విశిష్టతను తెలిపేలా పెయింటింగ్, పచ్చదనం పెంపు, ఆర్ట్ గ్యాలరీలు, ప్రముఖుల చిత్రాలతో ఫేమ్ వాల్స్ ఏర్పాటు చేస్తామని శనివారం నగరంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ ప్రకటించడంపై కూడా విమర్శలొస్తున్నాయి. నగర సుందరీకరణ పేరుతో ప్రజలకు ఉపయోగపడని పనులు చేసే బదులుగా నగరంలో వర్షం నీరు నిల్వ ఉండకుండా చూడాలని, మురుగు, చెత్త లేకుండా నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని, రోడ్లు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని, తాగునీటి సమస్య తీర్చాలని, ఇతర మౌలిక వసతులను మెరుగుపరిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని నగరవాసులు సూచిస్తున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలంటూ పాలకులకు, ప్రస్తుత ఒంగోలు నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న కలెక్టర్ రాజాబాబుకు విజ్ఞప్తి చేస్తున్నారు. మౌలిక వసతులు మెరుగుపరిచిన తర్వాతే నగర సుందరీకరణ దిశగా అడుగులు వేయాలని కోరుతున్నారు. ఇకనైనా ప్రజలకు కావాల్సిన పనులు చేస్తారో.. ఆర్భాటాలకు పోయి ౖపైపె మెరుగులు దిద్ది ప్రజాధనం వృథా చేస్తారో వేచిచూడాలి మరి.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఒంగోలు


