కనిగిరిరూరల్: వరుణుడి కరుణ కోసం ముస్లింలు కనిగిరిలో ప్రత్యేక నమాజ్, దువా చేశారు. దుర్భిక్షం పోవాలని, వర్షాలు సంవృద్ధి కురవాలని, భూగర్భజలం మట్టం పెరిగి.. నీటి సమస్య పోవాలని, పచ్చని పంటలతో పొలాలు కళకళలాడాలని అల్లాను ప్రార్థిస్తూ ఆదివారం ఉదయం స్థానిక ఈద్గా వద్ద పట్టణంలోని ముస్లింలు ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎస్‌కే అబ్దుల్ గఫార్, మాజీ అంజుమన్ కమిటీ అధ్యక్షుడు ఎస్‌కే జంషీర్ అహమ్మద్, మాజీ కౌన్సిలర్ సయ్యద్ నాయబ్ రసూల్, మాజీ టెలికాం అడ్వయిజరీ కమిటీ మెంబర్ ఎస్‌కే ఖాదర్‌వలి పలువురు నాయకులు, మసీద్ కమిటీల పెద్దలు పాల్గొన్నారు.
పొదిలి రూరల్: వర్షాలు సంవృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటూ పొదిలి మండలంలోని ఈగలపాడు గ్రామ ప్రజలు గ్రామ దేవత పోలేరమ్మతల్లికి ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులు తొలగిపోవాలని భక్తులు పోలేరమ్మను వేడుకుంటూ ఆదివారం ఉదయం అమ్మవారి మూల విరాట్‌కు అభిషేకాలు చేశారు. గ్రామం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పోలేరమ్మ ఆలయం వద్దకు బాణాసంచా, మంగళవాయిద్యాలు, డప్పుల సందడితో ఊరేగింపుగా ఉత్సవ విగ్రహానికి నీరు వారు పోసి బయలు దేరారు. పోలేరమ్మ దేవతకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలోని రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


