హత్య కేసులో నలుగురు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో నలుగురు అరెస్ట్‌

Aug 10 2026 12:40 AM | Updated on Aug 10 2026 12:40 AM

హత్య కేసులో నలుగురు అరెస్ట్‌

యర్రగొండపాలెం: త్రిపురాంతకం మండలంలోని మిట్టపాలేనికి సమీపంలో గత నెల 12వ తేదీ జరిగిన హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. ఆదివారం త్రిపురాంతకం పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. పుల్లలచెరువు మండలంలోని కవలకుంట్ల గ్రామానికి చెందిన నారు వెంకట రామిరెడ్డి మద్యం సేవిస్తూ అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో భార్యాపిల్లలను సక్రమంగా చూసుకోకుండా తిరుగుతున్న రామిరెడ్డి ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి రామసముద్రానికి చెందిన ఆయన మామ దేసిరెడ్డి వీరయ్య సాగుచేసుకోవటానికి కొంత మేర పొలం అప్పజెప్పాడు. ఆ పొలాన్ని సాగుచేసుకుంటూ వెంకట రామిరెడ్డి అక్కడే ఉండేవాడు. తాను చేసిన రూ.10 లక్షల అప్పులు తీర్చుకుంటానని డబ్బులు అడిగాడని, పండించుకోవటానికి పొలం ఇవ్వడంతో పాటు నువ్వు చేసిన అప్పులు తీర్చుకోవడానికి డబ్బులు కూడా ఇవ్వాలా..? ఇక్కడ ఉంటే మా నాన్న ఇచ్చిన పొలం, డబ్బులు కాజేస్తావు, నిన్ను ఊరిలో లేకుండా చేస్తానని అతని బావ వీరారెడ్డి బెదిరించాడు. తన తండ్రి వద్ద ఉన్న డబ్బు, ఆస్తి తానే అనుభవించాలన్న దురుద్దేశంతో గత నెల 12వ తేదీ రామసముద్రం గ్రామానికి చెందిన చిలకల అక్కిరెడ్డి, దేసిరెడ్డి నాగ అంజిరెడ్డి, యర్రగొండపాలెం మండలంలోని అయ్యంబొట్లపల్లి గ్రామానికి చెందిన తోకల చిన్న మూర్తయ్య, మరో ఇద్దరిని కలుపుకుని మద్యం సేవించడానికి తన బావ రామిరెడ్డిని పిలుచుకెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న రామిరెడ్డి ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. హతుడు మద్యం సేవించి బోర్లాపడి చనిపోయినట్లు చిత్రీకరించి శవాన్ని అక్కడే వదలేసి నిందితులు వెళ్లిపోయారు. ముందుగా రామిరెడ్డి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ తర్వాత హత్య కేసుగా నిర్ధారణ చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్‌ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్ట్‌ చేస్తామని డీఎస్పీ తెలిపారు. అరెస్టయిన వారిని మార్కాపురం ఏజేఎఫ్‌ఎం కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు. కేసును త్వరితగతిన ఛేదించిన సీఐ జి.అస్సాన్‌, ఎస్సై బి.శివరామయ్య, దర్యాప్తులో సహకరించిన పోలీస్‌ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

వివరాలు వెల్లడించిన మార్కాపురం డీఎస్పీ నాగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement