గిద్దలూరు రూరల్: మత్తు వదలరా.. మద్యం మత్తు వదలరా.. ఆ మత్తులోనే జీవితం చిత్తు అవును రా... అంటూ ఓ సినీ కవి పాడిన పాట గిద్దలూరులోని మందుబాబులకు ఇట్టే సరిపోతోంది. పట్టణంలోని రాచర్ల గేటు సెంటర్ సమీపంలో గల ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆదివారం మద్యం మత్తులో పడి ఉన్న ఓ వ్యక్తిని లేపేందుకు అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ విశ్వప్రయత్నం చేశాడు. పూటుగా మద్యం తాగిన ఆ వ్యక్తి గమ్యస్థానానికి వెళ్లలేని పరిస్థితిలో గుడి వద్ద కిందపడిపోయాడు. దీంతో ఓ కానిస్టేబుల్ పక్కనే ఉన్న హోటల్ నుంచి మగ్గుతో నీళ్లు తీసుకొచ్చి మద్యం సేవించిన వ్యక్తి మొహం మీద చల్లి పైకి లేపాడు. రోడ్డు మీద నుంచి బలవంతంగా లేపి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశాడు. అదేవిధంగా కొమరోలు బస్టాండ్ సమీపంలో మరో వ్యక్తి మూసివేసిన షాపు మెట్ల మీద మద్యం మత్తులో పడిపోయి ఉన్నాడు. ఇలా మద్యం మత్తులో తూగుతున్న వ్యక్తులను చూసి మహిళలు, పిల్లలు జంకుతున్నారు. మద్యానికి బానిసైన వ్యక్తులు ఈ విధంగా ఇష్టానుసారంగా తాగుతూ..ఊగుతూ రోజూ రోడ్లకు అడ్డంగా, రోడ్ల పక్కన కిందపడి దొర్లుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ఏరులై పారుతుండటమే ఇందుకు కారణమని ప్రజలు విమర్శిస్తున్నారు.


