● మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
సింగరాయకొండ: డీఎస్సీలో అవకతవకలపై వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో సోమవారం కొండపి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన శాంతియుత ర్యాలీకి పోలీసులు అడ్డంకులు సృష్టిస్తుండటంపై ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై వైఎస్సార్ సీపీ చేపట్టిన ఉద్యమం మలిదశకు చేరుకుందని, చివరిగా నిర్వహించే శాంతియుత ర్యాలీకి అనుమతికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోలీసులు నిరాకరించడం బాధాకరమని అన్నారు. దీనికితోడు సింగరాయకొండ పోలీసులు పార్టీ నాయకులు, కార్యకర్తలను తీసుకెళ్లేందుకు ప్రైవేటు వాహనదారులు సహకరించవద్దని, సహకరించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారని, ఈ విషయాన్ని కారు స్టాండ్ ప్రతినిధులు గమనించాలని కోరుతూ ఆ మండల యూనియన్ నాయకులు పెట్టిన ఆడియో సోషల్ మీడియాలో వైరలైందని సురేష్ తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేందుకు పోలీసులు యత్నించగం దుర్మార్మమన్నారు. ఇప్పటికే తమ పార్టీ అధినేత, రాష్ట్ర, జిల్లా అధ్యక్షుల పిలుపు మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతున్నామన్నారు. శాంతియుతంగా నిర్వహించే ర్యాలీకి అడ్డంకులు సృష్టించవద్దని, అనుమతులిచ్చి సహకరించాలని పోలీసులకు ఆదిమూలపు సురేష్ విజ్ఞప్తి చేశారు.


