● జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు
మార్కాపురం: ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తామని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు చెప్పారు. ఆదివాసి దినోత్సవాన్ని పట్టణంలోని డ్వాక్రాబజార్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కాపురం జిల్లాలో ఏడు మండలాల్లో గిరిజనులు అధికంగా ఉన్నారని మార్కాపురంలో గిరిజన భవన్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. వారికి అందాల్సిన పథకాలను అందించేందుకు సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో హాస్టల్స్ పాఠశాలలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వారి జీవన విధానం మెరుగుపడాల్సి ఉందని జాయింట్ కలెక్టర్ అన్నారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను అందరూ గౌరవించాలన్నారు. గిరిజనులకు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఆర్డీఓ శివరామిరెడ్డి జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ చిరంజీవి, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.


