హామీలు ఏమయ్యాయి బాబు | - | Sakshi
Sakshi News home page

హామీలు ఏమయ్యాయి బాబు

Aug 8 2026 2:05 AM | Updated on Aug 8 2026 2:05 AM

లోకేష్‌కు విద్యా శాఖ మంత్రిగా కొనసాగే అర్హత లేదు వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌

యర్రగొండపాలెం: ఎన్నికల ముందు, అధికారం చేజిక్కించుకున్న తరువాత ఇచ్చిన హామీలు ఏమయ్యాయి చంద్రబాబు అని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ప్రశ్నించారు. దగా డీఎస్సీపై జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న వారికి శుక్రవారం ఆయన సంఘీభావం తెలిపి వారికి నిమ్మ రసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ హామీలతోపాటు రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారని, ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నెలకు రూ.3 వేలు ఇస్తామని కల్లబొల్లి మాటలుచెప్పి గద్దెనెక్కిన తరువాత చంద్రబాబు ఏ ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదని, రూ.3 వేలు భృతి ఇవ్వలేదని ఆయన విమర్శించారు. అధికారం ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలను తొక్కేయాలి, నరికేయాలని చెప్పి ఎన్నో విధాలుగా వారిని ఇబ్బంది పెడుతున్నారే తప్ప మీ అజెండా ప్రజాశ్రేయస్సు కాదని, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలని కాదన్నారు. ఎంతకాడికి జగన్‌మోహన్‌రెడ్డిపై బురదజల్లాలనేదే తప్ప వేరే ఆలోచనేలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో జగన్‌మోహన్‌రెడ్డి నాడు–నేడు కార్యక్రమాన్ని పెట్టి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారని, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తృప్తికరంగా ఉండేదని చెప్పారు. ఈ రోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా తయారు చేశారని, అసలు ఆయన క్వాలిఫికేషన్‌ చంద్రబాబు కుమారుడు అని తప్ప మరేమైనా అర్హత ఉందా అని ప్రశ్నించారు. లోకేష్‌ మొదటి సారి ఎమ్మెల్యే అయిన తరువాత ఇంతపెద్ద మంత్రి పదవి ఇస్తే డీఎస్సీ పరీక్షలు సరిగా నిర్వహించడం చేతకాలేదన్నారు. పేపర్‌ లీకవడం వల్లే మీ ఆఫీసులో ఉన్నవారికి ర్యాంకులు వచ్చాయన్నారు. పచ్చ వర్గీయుల కోసమే 2 శాతం స్పోర్ట్స్‌ కోటా నుంచి 4 శాతానికి పెంచారని అన్నారు. డీఎస్సీ ఉద్యోగస్తులందరి వద్ద రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు తీసుకొని ఉద్యోగాలు అమ్ముకున్నారని అన్నారు. పేదలంతా చదువుకోవాలన్న ఉద్దేశంతో వైఎస్సార్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు వర్గాలందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలుచేశారని, ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి కరోనా మహమ్మారి సమయంలో కూడా పేద విద్యార్థులు ఇబ్బందిపడకుండా చర్యలు తీసుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ పథకాలను తూట్లు పొడుస్తున్నారని, లోకేష్‌ విద్యాశాఖ మంత్రిగా ఉండే అర్హతలేదని, వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ విద్యాశాఖలో అవినీతి జరిగిందంటే అది ఆంధ్ర రాష్ట్రంలోనేనని రిపోర్ట్‌లు చెప్తున్నాయని, విద్యార్థులు తింటున్న తిండిలో ఈగలు, బొద్దింకలు, రాసే పరీక్షల్లో పేపర్‌ లీక్‌లు, ఇచ్చే ఉద్యోగాలలో డబ్బుల మూటలకు అమ్ముకుంటున్నది నారా లోకేష్‌ శాఖేనని అన్నారు. అర్హత కలిగిన నిరుద్యోగులకు కాకుండా ఎటువంటి అర్హత లేకున్నా సూట్‌కేసులు ఇచ్చిన అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై నిరుద్యోగులు, విద్యార్థులు, పేదల పక్షాన వైఎస్సార్‌ సీపీ నిలబడుతుందని అన్నారు. నారా లోకేష్‌ విద్యాశాఖకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం రిలే దీక్షలో కూర్చున్న వారికి బూచేపల్లి, తాటిపర్తి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్‌, మండలాల పార్టీ అధ్యక్షులు ఏకుల ముసలారెడ్డి, గంటా వెంకట రమణారెడ్డి, దోమకాల వెంకటేశ్వర్లు, పాలిరెడ్డి కృష్ణారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు దోగిపర్తి సంతోష్‌ కుమార్‌, పట్టణ అధ్యక్షుడు కందూరి కాశీవిశ్వనాథ్‌, త్రిపురాంతకం మండల ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్‌.బుజ్జి, సయ్యద్‌ జబీవుల్లా, ఐటీ వింగ్‌ జిల్లా అధ్యక్షుడు దొండేటి నాగేశ్వరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఏలూరి వెంకట నారాయణరెడ్డి, వెన్నా వెంకటేశ్వరరెడ్డి, ఇంటిలెక్చువల్‌ జిల్లా అధ్యక్షుడు అంగిరేకుల ఆదినారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement