సచివాలయ ఉద్యోగిపై టీడీపీ నేతల దాడి | - | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగిపై టీడీపీ నేతల దాడి

Aug 8 2026 2:05 AM | Updated on Aug 8 2026 2:05 AM

అడిగిన సర్టిఫికెట్‌ వెంటనే ఇవ్వలేదని కుర్చీలు, కర్రలతో తలపై మోదిన వైనం తలపై గాయంతో కనిగిరి ప్రభుత్వఆస్పత్రిలో చేరిన బాధిత ఉద్యోగి

వెలిగండ్ల (కనిగిరిరూరల్‌): వారు అడిగిన సర్టిఫికెట్‌ను వెంటనే ఇవ్వలేదనే కోపంతో.. టీడీపీ మండల నాయకుడు కే ఇంద్రభూపాల్‌రెడ్డి, అతని అనుచరులు కలిసి సచివాలయ ఉద్యోగిపై దాడి చేసి కొట్టి తలపై తీవ్రగాయాలు చేసిన ఘటన మార్కాపురం జిల్లా వెలిగండ్ల మండలం కొటాలపల్లి స్వర్ణ సచివాలయంలో శుక్రవారం జరిగింది. బాధితుడి కథనం మేరకు ఇటీవల సచివాలయ ఉద్యోగి కె.వెంకటకృష్ణ కొటాలపల్లికి బదిలీపై వచ్చి వెల్ఫేర్‌ అసిస్టెంట్‌గా ఉంటూ సిబ్బంది కొరత వలన డిజిటల్‌ అసిస్టెంట్‌ బాధ్యతలను కూడా తీసుకున్నారు. ఈ తరుణంలో ఎలికా అంజయ్య కుమార్తెకు ఓబీసీ, కుల ధ్రువీకరణ పత్రం కావాలని అంజయ్య స్నేహితుడు వచ్చి అడిగాడు. అయితే ఆ సర్టిఫికెట్‌లను ఇప్పటికే జూన్‌ 23న తీసుకుని ఉన్నారు. అవి మూడేళ్ల వరకు చెల్లుబాటు అవుతాయి. కానీ వారు మాత్రం మళ్లీ సదరు పత్రాలు కావాలని, అవసరం అని చెప్పారు. దీంతో కుల ధ్రువీకరణ పత్రం అందజేశారు. అయితే ఓబీసీ సర్టిఫికెట్‌, క్యాస్ట్‌ సర్టిఫికెట్‌లో నెటివిటీ తేడాగా ఉంది. కనిగిరి నెటివిటీగా చూపిస్తోంది. దీని వల్ల మీ అమ్మాయి కౌన్సిలింగ్‌కు ఇబ్బంది జరుగవచ్చని.. దాని పై తనకు పూర్తి అవగాహన లేదని, మరో చోట చేయించుకుంటే మంచిదని తాను చెప్పినట్లు కే వెంకట కృష్ణ తెలిపారు. దీని పై అంజయ్య వచ్చి.. ‘‘మా ఊర్లో సచివాలయం పెట్టుకుని.. మేం బయటకు ఎందుకు వెళ్లాలి. పని చేతకానప్పుడు మీకు ఉద్యోగాలు ఎందుకని’’ దుర్భాషలాడారు. తనది ఆపోస్టు కాదని.. కేవలం ఎవరూ లేనందు వల్లే ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇన్‌చార్జిగా ఉన్నానని వెంకటకృష్ణ చెప్పినా వినకుండా గురువారం గొడవ చేసి వెళ్లిపోయారు.

మరుసటి రోజు గుంపుగా

టీడీపీ నేతలు వచ్చి దాడి...

గురువారం జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని.. వెలిగండ్ల టీడీపీ మండల నాయకుడు కేలం ఇంద్రభూపాల్‌ రెడ్డి, అతని అనుచరులు, అంజయ్య మరి కొందరు కలిసి శుక్రవారం వచ్చి..కాపు కాసి ఆఫీసులో ఎవరూ లేని సమయంలో వెంకటకృష్ణతో అనవసరంగా గొడవకు దిగి దుర్భాషలాడారు. విచక్షణా రహితంగా దాడి చేసి తలపై కొట్టి, పిడిగుద్దులు గుద్ది తనను హత్యచేసేందుకు ప్రయత్నించగా బయటకు పరిగెత్తినట్లు బాధితుడు వాపోయాడు. తన ఫోన్‌ కూడా లాక్కుని భయభ్రాంతులకు గురిచేసినట్లు బాధితుడు కే వెంకట కృష్ణ విలేకర్లకు తెలిపారు. ఈమేరకు క్షతగాత్రుడు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement