ఆరో రౌండ్‌లోనూ కొనసాగుతున్న ధరల పతనం నేలచూపులు చూస్తున్న సరాసరి ధరలు తిరస్కరణ బేళ్ల సంఖ్య పెరుగుతుండటంతో రైతుల్లో ఆందోళన వ్యాపారుల సిండికేట్‌తో వీడని ఆర్థిక కష్టాలు పొదిలిలో కొంతసేపు ఆగిన వేలం
పొగాకు రైతును కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకవైపు సరాసరి అమ్మకం ధరలు క్రమంగా తగ్గిపోతుండడం, మరోవైపు వేలం కేంద్రాల్లో తిరస్కరణ బేళ్ల సంఖ్య
పెరుగుతుండడం సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతోంది. దీనికితోడు పొగాకు కొనేందుకు వ్యాపారులు మొండికేస్తున్నారు. ఇలా అయితే మిగిలిన పంటకు ఎన్ని నెలలు పడుతుందో అనే ఆందోళన రైతుల్ని వెంటాడుతోంది. ప్రస్తుతం కందుకూరు, కొండపి, టంగుటూరు వేలం కేంద్రాల్లో ఆరో రౌండ్ మొదలైంది. ప్రారంభం నుంచే ధరలు రైతులకు షాక్‌నకు గురిచేస్తున్నాయి. శుక్రవారం పొదిలి వేలం కేంద్రంలో రైతులు కొద్దిసేపు వేలాన్ని అడ్డుకున్నారు.
కందుకూరు/కొండపి/టంగుటూరు/పొదిలి:
పొగాకు ధరలు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఇప్పటికే 6వ రౌండ్ అమ్మకాలు ప్రారంభమైనా ధరల్లో ఏమాత్రం పెరుగుదల నమోదు కావడం లేదు. పైగా ధరలు మరింత పతనం దిశగా పయనిస్తున్నాయి. కందుకూరులో రెండు వేలం కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. కనిగిరి రోడ్డులోని ఒకటో వేలం కేంద్రంలో పరిధిలో శుక్రవారం నాటికి ఐదు రౌండ్ల వేలం ప్రక్రియ ముగిసింది. బ్రైట్ గ్రేడ్ పొగాకు కేజీ రూ.160 నుంచి రూ.170 మధ్యలోనే కొనసాగుతోంది. అలాగే పామూరు రోడ్డులోని రెండో వేలం కేంద్రంలో 6వ రౌండ్ పొగాకు అమ్మకాలు పూర్తయ్యాయి. ఇక్కడ కూడా అదే పరిస్థితి. దీంతో కేజీ పొగాకు సరాసరి ధరలు అమాంతం పడిపోతున్నాయి. ప్రస్తుతం ఒకటో వేలం కేంద్రంలో సరాసరి ధర రూ.208 ఉంటే, రెండో వేలం కేంద్రంలో సరాసరి ధర రూ.203కి పడిపోయింది. ఈ ధరలు మరింత పతనమయ్యే దిశగా కొనసాగుతున్నాయి. అదే సందర్భంలో నో బిడ్‌లు కూడా అధికంగా నమోదవుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండపి వేలం కేంద్రంలో శుక్రవారం నుంచి ఆరో రౌండ్ వేలం ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజే రైతులకు షాక్ తగిలింది. 2025 – 26 పొగాకు వేలం కేంద్రంలో కొనుగోలు ప్రారంభించిన నాటి నుంచి పొగాకు రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఎన్నో ఆశలతో పొగాకు వేలానికి రైతులు సిద్ధపడగా.. రైతుల ఆశలపై వ్యాపారులు నీళ్లు చల్లుతున్నారు. గత సంవత్సరం కేజీ గరిష్ట ధర రూ.360 పలకగా, ఈ సంవత్సరం ప్రారంభ ధర గరిష్టంగా రూ.250తో ప్రారంభమైంది. రానురాను గరిష్ట ధర పెరుగుతోందన్న ఆశతో రైతులు వేలం కేంద్రానికి పొగాకు బేళ్లను తీసుకొస్తుండగా కేవలం కొన్ని బేళ్లకు మాత్రమే గరిష్ట ధర రూ.250కి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. కొండపి వేలం కేంద్రంలో వేలం మొదటి రౌండు ప్రారంభం రోజు ధరలు రైతుకు షాకిచ్చాయి. 5వ రౌండ్ ముగింపు రోజు సరాసరి రూ.195.12 ఉండగా, ఆరో రౌండు ప్రారంభం రోజు రూ.184.02 పలికింది. అంటే ఒక్కసారిగా సరాసరి ధర రూ.11కి పడిపోయింది. దీంతో రైతులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ రౌండ్లోనైనా వ్యాపారస్తులు రైతుల మీద కనికరం చూపి గిట్టుబాటు ధర వస్తుందని ఆశించగా, రైతులకు నిరాశే ఎదురైంది. ఇదిలా ఉండగా శుక్రవారం 383 బేళ్లు తిరస్కరణకు గురైనట్లు వేలం కేంద్రం నిర్వహణ అధికారి ఎం.శంకర్రావు తెలిపారు. టంగుటూరు వేలం కేంద్రంలో శుక్రవారం ప్రారంభమైన ఆరో రౌండ్లో కనిష్ట ధర ఒకేసారి రూ.10 తగ్గించారు. తిరస్కరణ బేళ్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. బేళ్లను వేలం కేంద్రానికి తీసుకెళ్లడం, తిరస్కరణ గురైన వాటిని తిరిగి తీసుకెళ్తుండడంతో ఒక్కోదానికి రూ.1000 వరకూ నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.
ఆగి.. సాగి...
పొదిలి వేలం కేంద్రానికి శుక్రవారం రైతులు 993 చెక్కులు తీసుకెళ్లారు. వాటిలో 430 చెక్కులకు వేలం జరిగే సరికి 210 రిటర్న్ అయ్యాయి. దీంతో ఆందోళన చెందిన రైతులు వేలాన్ని కొంతసేపు అడ్డగించారు. అనంతరం వ్యాపారులతో రైతులతో అధికారులు చర్చలు జరిపారు. దీంతో వేలం ప్రారంభమైంది. ఎప్పటిలాగానే నోబిడ్లు ఎక్కువగా నమోదయ్యాయి. వచ్చిన బేళ్లలో 41 శాతం నోబిడ్లు అయ్యాయి.


