మట్టి దోపిడీకి మంత్రి ఆశీస్సులు! | - | Sakshi
Sakshi News home page

మట్టి దోపిడీకి మంత్రి ఆశీస్సులు!

Aug 8 2026 2:05 AM | Updated on Aug 8 2026 2:05 AM

మేదరమెట్ల:

ద్దంకి నియోజకవర్గంలో ప్రభుత్వ పాలన పూర్తిగా గాడి తప్పింది. విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో టీడీపీ నేతల కక్షసాధింపు చర్యలు శృతిమించుతున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరులే లక్ష్యంగా పచ్చ మూకలు రెచ్చిపోతున్నాయి. పాలనా యంత్రాంగాన్ని, పోలీసులను తమ గుప్పిట్లో పెట్టుకుని ప్రత్యర్థులను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీసేందుకు తెరవెనుక కుట్రలు పన్నుతున్నాయి.

అస్మదీయులకు అండ..

నియోజకవర్గంలో చట్టం రెండు కళ్లతో వ్యవహరిస్తోంది. మంత్రికి అత్యంత ఆప్తులైన ‘షాడో’ నేతలు అంతా తామై చక్రం తిప్పుతున్నారు. టీడీపీ నాయకులు, వారి అనుచరులు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. అదే వైఎస్సార్‌సీపీకి చెందిన వారు ఏ చిన్న పని చేసుకున్నా.. నిబంధనల పేరుతో అడ్డుకుని వేధింపులకు గురిచేస్తున్నారు. కూటమిలో అంతర్గత కుంపట్లు ఉన్న చోట, బలహీన వర్గాలపైనా ఈ పచ్చ సెగలు తీవ్రంగా తగులుతున్నాయి.

పచ్చ నేతల డైరెక్షన్‌.. పోలీసుల ఓవరాక్షన్‌

కొరిశపాడు మండలం అనమనమూరులో తాజాగా జరిగిన ఘటనే ఈ పచ్చపాతానికి సజీవ సాక్ష్యం. అనమనమూరులో ఓ చెరువు ఏర్పాటు కోసం నిబంధనల మేరకు మట్టిని తరలిస్తున్న వాహనాలను గురువారం పోలీసులు అకారణంగా అడ్డుకున్నారు. మట్టితో ఉన్న టిప్పర్లను బలవంతంగా మేదరమెట్ల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ హైడ్రామా వెనుక మంత్రి రథసారధుల డైరెక్షన్‌ ఉందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ, ఇదే సమయంలో తిమ్మనపాలెం చెరువులో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నా ఏ ఒక్క అధికారీ అటు వైపు కన్నెత్తి చూడలేదు. పైగా వారికి ఆటంకం కలిగించవద్దని సాక్షాత్తూ మంత్రి నుంచే మౌఖిక ఆదేశాలు ఉన్నాయని అధికారులు దబాయించడం వారి బరితెగింపునకు నిదర్శనం. సామాన్య ప్రజల్లోనూ ఈ పచ్చపాతంపై తీవ్ర చర్చ జరుగుతోంది.

కీలుబొమ్మలుగా మారిన అధికారులు

వాస్తవానికి మైనింగ్‌, రెవెన్యూ, పోలీస్‌ శాఖల మధ్య సమన్వయంతో జరగాల్సిన పనులను.. టీడీపీ నేతలు తమ రాజకీయ పలుకుబడితో భ్రష్టు పట్టిస్తున్నారు. అనమనమూరు ఘటనలో పోలీసులు పూర్తిగా అధికార పార్టీ నేతల చేతిలో కీలుబొమ్మలుగా మారారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘పైవాళ్ల ఆదేశాలు ఉన్నాయి.. మేమేం చేయలేం.. ఏమైనా ఉంటే మీరే వాళ్లతో మాట్లాడుకోండి’ అని పోలీసులు బాధితులకు చెప్పడం చూస్తే వ్యవస్థ ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. చివరకు మైనింగ్‌ రీజనల్‌ విజిలెన్స్‌ స్క్వాడ్‌ ఏడీ రామచంద్ర ఆదేశాలతో జియాలజిస్టు సురేష్‌కుమార్‌రెడ్డి, మరో ముగ్గురు టెక్నికల్‌ సిబ్బంది శుక్రవారం మేదరమెట్ల స్టేషన్‌లోని టిప్పర్లను పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరిమానా విధించి వాహనాలను విడుదల చేశారు. అధికారులు నిబంధనల ప్రకారం కాకుండా, పచ్చ నేతల కనుసన్నల్లో పనిచేస్తూ సామాన్యులను, వైఎస్సార్‌సీపీ శ్రేణులను వేధిస్తుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ నేతల బరితెగింపు

తిమ్మనపాలెంలో యథేచ్ఛగా సాగుతున్న

అడ్డగోలు తవ్వకాలు

వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా పనులకు ఆటంకాలు

ప్రభుత్వ అధికారులు, పోలీసులను పావులుగా

వాడుకుంటున్న వైనం

అనమనమూరులో మట్టి టిప్పర్ల సీజ్‌ వెనుక

మంత్రి ‘షాడో’ల ఒత్తిడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement