కొమరోలు (బేస్తవారిపేట): పాముకాటుతో వివాహిత మృతి చెందిన సంఘటన కొమరోలు మండలంలోని రౌతుపల్లిలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన అవిశనేని లక్ష్మీదేవి (45) పొలంలో చిక్కుడు కాయలు కోస్తున్న సమయంలో పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు కారులో గిద్దలూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త శ్రీనివాసులు, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
పెద్దదోర్నాల: మండల పరిధిలోని పెద్దబొమ్మలాపురం గ్రామంలో అడవి పందులు పంటలను ధ్వంసం చేశాయి. గ్రామానికి చెందిన రైతులు చిన్ని వెంకటేశ్వర్లు, ఎల్లయ్యలు తమ ఐదెకరాల పొలంలో అరటి, బొప్పాయి సాగు చేశారు. గురువారం రాత్రి తోటల్లోకి చొరబడిన అడవి పందులు పంటను పూర్తిగా నాశనం చేయడంతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.
పుల్లలచెరువు: ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పుల్లలచెరువు శివారులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పుల్లలచెరువు తండాకు చెందిన రామావత్ రాంబాబు నాయక్(42) పని నిమిత్తం ఉమ్మడివరం వెళ్లి తిరిగి బైక్‌పై వస్తున్నాడు. గ్రామానికి సమీపంలోని మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో పడిపోయాడు. తలకు బలంగా రాయి తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అటుగా వెళ్తున్న వారు గమనించి సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని తండా వాసులు కోరుతున్నారు.
ఒంగోలు టౌన్: బాలిక(17)పై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.శైలజ శుక్రవారం తీర్పునిచ్చారు. 2017 సెప్టెంబర్ 15న నగరంలోని మారుతీనగర్‌కు చెందిన మార్తల మహేంద్రారెడ్డి(21).. బాలికను దొనకొండ మండలం ఇండ్లచెరువులోని తన బంధువుల ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అప్పటి వన్‌టౌన్ సీఐ వై.రామారావు కేసు నమోదు చేయగా, అప్పటి డీఎస్పీ పి.శ్రీధర్ నిందితుడిని అరెస్ట్ చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష ఖరారు చేసిన న్యాయమూర్తి.. బాధితురాలికి అదనంగా రూ.4 వేలు నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించారు.
సింగరాయకొండ: మండలంలోని కనుమళ్ల పంచాయతీ పరిధిలో కందుకూరు మార్గంలో శుక్రవారం సంభవించిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చిన్న కనుమళ్ల గ్రామానికి చెందిన చొప్పర కొండమ్మ, మెండా వరలక్ష్మి ఉపాధి హామీ పనుల కోసం ఉదయం 5.30 గంటలకు నడిచి వెళ్తుండగా.. అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వీరిని 108 వాహనంలో ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. మరో ఘటనలో.. సింగరాయకొండకు చెందిన షేక్ సుబానీ కందుకూరు వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా జగనన్న కాలనీ సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. తలకు తీవ్ర గాయాలైన అతన్ని ఒంగోలులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్.సుధీర్‌కుమార్ తెలిపారు.


