కంభం: పట్టణంలో ఈ నెల 4వ తేదీ జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులైన తల్లీకూతుర్లను అరెస్టు చేసి సొత్తును రికవరీ చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు. కంభం పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు వెల్లడించారు. స్థానిక నెహ్రూనగర్‌లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆసియా ఇంట్లో ఈ నెల 4వ తేదీ దొంగతనం జరిగింది. బంగారు నగలు అపహరణకు గురవగా.. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కంభం సీఐ కె.మల్లికార్జున ఆధ్వర్యంలో ఎస్సై శివకృష్ణారెడ్డి సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టి గురువారం రాత్రి 8 గంటల సమయంలో మార్కాపురంలోని దోర్నాల బస్టాండు సెంటర్‌లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.10 లక్షల విలువైన 72 గ్రాముల బంగారు నగలు రికవరీ చేశారు.
నగలు అమ్మేందుకు ప్రయత్నిస్తూ దొరికిపోయిన నిందితులు...
ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆసియా ఇంట్లో గతంలో 20 రోజులు పనిచేసి మానేసిన కంభం పట్టణంలోని అర్బన్ కాలనీకి చెందిన సయ్యద్ కరీమున్ చోరీ చేసేందుకు పన్నాగం పన్ని ఆమె తల్లి సయ్యద్ ఖాసింబీ, అర్థవీడు మండలం గన్నేపల్లి గ్రామానికి చెందిన షేక్ నాగూర్‌వలిని కలుపుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ నెల 4వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు అక్కడికి చేరుకుని తల్లిని, నాగూర్‌వలిని బయట కాపాలాపెట్టి లోపలికి వెళ్లిన కరీమున్ దివాన్‌కాట్ మీద ఉన్న బంగారు నగల పర్సును తీసుకురాగా, ముగ్గురూ కలిసి ఉడాయించారు. వారు దొంగతనం చేసి పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తం కావడంతో వాటి ఆధారంగా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దొంగిలించిన సొత్తును హైదరాబాదులో అమ్మేందుకు ప్రయత్నించగా.. అక్కడ ఎవరూ కొనకపోవడంతో మార్కాపురం వచ్చి నగలు అమ్మేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు దొరికిపోయారు. నేరానికి పాల్పడిన వారితో పాటు దొంగ సొత్తు కొనుగోలు చేసిన వ్యక్తి అనుముల వీరయ్య (సంజనా జ్యూయలరీస్ యజమాని)పై కూడా కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును చేధించిన ఎస్సై శివకృష్ణారెడ్డి, కానిస్టేబుళ్లను డీఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. చోరీ జరిగిన ఇంట్లో సీసీ కెమెరాలు ఉండటం వలనే నిందితులను త్వరగా పట్టుకోగలిగామని, అందువలన ప్రజలు, వ్యాపారులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని పోలీసులకు సహకరించాలని డీఎస్పీ కోరారు. విలేకరుల సమావేశంలో సీఐ మల్లికార్జున, ఎస్సై శివకృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
కంభంలో చోరీ కేసు ఛేదించిన పోలీసులు
72 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం


