లాభాలొచ్చే పంటలు సాగుచేయాలి | - | Sakshi
Sakshi News home page

లాభాలొచ్చే పంటలు సాగుచేయాలి

Aug 8 2026 2:05 AM | Updated on Aug 8 2026 2:05 AM

మద్దిపాడు: తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చే పంటలను ఎంపిక చేసుకుని రైతులు సాగు చేసుకోవాలని కలెక్టర్‌ రాజాబాబు సూచించారు. మద్దిపాడు మండల కేంద్రంలోని నటరాజ కళామందిరం ప్రాంగణంలో శుక్రవారం ఉదయం వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉందని, అందువలన నీటి ఎద్దడిని తట్టుకునే పంటలను రైతులు సాగు చేసుకోవాలని చెప్పారు. వ్యవసాయంపై రైతులకు మరింత అవగాహన కల్పించేందుకు రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతులంతా ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలని, తద్వారా భూసారాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో తిరిగి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. రెగ్యులర్‌ పంటలు కాకుండా వాతావరణానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటే రైతులకు ఆదాయం పెరుగుతుందని తెలిపారు. సముద్ర ఉపరితలంపై ఉష్ణోగ్రతల కారణంగా వర్షాలు సకాలంలో ఉండవన్నారు. అందువలన రైతులు తగిన విధంగా పంటలు వేసుకోవాలన్నారు. ఎల్‌నినో కారణంగా పశుగ్రాసం కొరత కూడా ఏర్పడే అవకాశాలున్నాయని, దానిని ఎదుర్కొని పశువులను సంరక్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. అనంతరం పలువురు రైతులు తమ అభిప్రాయాలను అధికారులకు తెలిపారు. చివరిగా రైతులకు పీఎండీఎస్‌ విత్తనాలను కలెక్టర్‌ చేతుల మీదుగా అందించారు. ఎల్‌నినో నేపథ్యంలో పంటల సాగుకు సంబంధించిన వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీనివాసరావు, వ్యవసాయ శాస్త్రవేత్త రమేష్‌, డీపీఎం సుభాషిణి, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి గోపీచంద్‌, ఆర్‌డీఓ చంద్రశేఖర నాయుడు, ఇన్‌చార్జి ఎంపీడీఓ కిషోర్‌కుమార్‌, తహసీల్దార్‌ ఆదిలక్ష్మి, వ్యవసాయశాఖ ఏఓ, ఉద్యోగులు, రైతులు పాల్గొన్నారు.

తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి ఉండేలా చూసుకోవాలి

రైతులకు కలెక్టర్‌ రాజాబాబు సూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement