కందుకూరు: ఇటీవల ఉలవపాడు మండలం చాగొల్లు గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ అన్వర్‌బాషా తెలిపారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. ఈ నెల 4వ తేదీ చాగొల్లు గ్రామానికి చెందిన ఉప్పుటూరి రమణయ్య ఇంటి ముందు అరుగుపై కూర్చుని ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన నత్తా అభిలాష్ అనే యువకుడు కొబ్బరికాయలు కొట్టే కత్తితో రమణయ్యపై విచక్షణారహితంగా దాడిచేసి హతమార్చాడు. గతంలో ఉన్న పాతకక్షల నేపథ్యంలో ఈ హత్యకు పాల్పడినట్లు మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉలవపాడు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న అభిలాష్‌ను శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నామని, నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఉలవపాడు, కందుకూరు రూరల్ ఎస్సైలు సుబ్బారావు, బాలకృష్ణ, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
కురిచేడు: మండలంలోని అలవలపాడు అడ్డరోడ్డు వద్ద శుక్రవారం పట్టపగలే ఓ మహిళ మెడలోంచి దుండగులు బంగారు నానుతాడు లాక్కెళ్లారు. ఎస్సై జి.కోటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పడమర గంగవరం సచివాలయంలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న బత్తుల స్వరాజ్యలక్ష్మి విధుల నిమిత్తం ఉదయం కురిచేడు నుంచి ఆటోలో అలవలపాడు రోడ్డు వద్దకు చేరుకుంది. అక్కడ తనను తీసుకెళ్లే ద్విచక్ర వాహనం కోసం ఎదురుచూస్తుండగా.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి, ఈ రోడ్డు ఏ ఊరు వెళ్తుందని అడిగారు. ఆమె అలవలపాడు వెళ్తుందని చెబుతూ మొబైల్ చూసుకుంటున్న సమయంలో, క్షణాల్లో మెడలోని 10 గ్రాముల నానుతాడును లాక్కొని ఉడాయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


