ఒంగోలు సబర్బన్: గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సమగ్రాభివృద్ధిపై సర్వే చేయాలని డిస్ట్రిక్ట్ సెన్సస్ హ్యాండ్ బుక్ (డీసీహెచ్‌బీ) అధికారి ఓ.శ్రీవాణి సచివాలయాల సిబ్బందికి సూచించారు. జనాభా లెక్కలకు సంబంధించి ముందస్తు చర్యల్లో భాగంగా వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బందికి శుక్రవారం ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఒంగోలు ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలోని మండల వనరుల కేంద్రం భవన్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో శ్రీవాణి మాట్లాడుతూ.. 2011లో జనగణన జరిగిందని, ఆ తర్వాత 2021లో జరగాల్సిన జనగణన కోవిడ్ సందర్భంగా వాయిదా పడిందని తెలిపారు. అందువలన ప్రస్తుతం జనగణన చేపడుతున్నట్లు చెప్పారు. సర్ కార్యక్రమానికి ముందు జనగణనలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించటం జరిగిందన్నారు. ప్రస్తుతం జనగణనను పురస్కరించుకుని రెండో విడతలో గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనతో పాటు 2011తో పోలిస్తే ప్రస్తుతం ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందనేది స్పష్టంగా డిస్ట్రిక్ట్ సెన్సస్ హ్యాండ్ బుక్‌లో నమోదు చేయాలన్నారు. మొత్తం ఎనిమిది రకాల అంశాలను నమోదు చేయాలని వివరించారు. ప్రభుత్వానికి సంబంధించిన స్కూళ్లు, రోడ్లు, మంచినీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, శానిటేషన్, ఈ 15 సంవత్సరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి గ్రాంట్లు వచ్చి అభివృద్ధి జరిగిందనే అంశాలపై సమగ్రంగా సర్వే నిర్వహించాలని వివరించారు. అప్పటి పరిస్థితిని, ఇప్పటి పరిస్థితిని పోల్చుతూ నివేదికలు తయారు చేయాలన్నారు. ఒక్కో రెవెన్యూ విలేజ్‌ని ఒక యూనిట్‌గా తీసుకుని సర్వే చేయాల్సి ఉందన్నారు. డీసీహెచ్‌బీ శిక్షణ కార్యక్రమాన్ని డీఆర్‌ఓ వెంకట రమణ, ఒంగోలు రూరల్ తహసీల్దార్ కృష్ణమోహన్ సందర్శించారు. ఒంగోలు అర్బన్, ఒంగోలు రూరల్, కొత్తపట్నం, టంగుటూరు మండలాలకు ఒంగోలులో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఒంగోలు రూరల్ డిప్యూటీ తహసీల్దార్ కొల్లిబోయిన అశోక్, రూరల్ ఆర్‌ఐ శ్రీకంఠ శ్రీనివాసరావు, ఏఎస్‌ఓ బ్రహ్మయ్య, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.


