● చేనేత కార్మికులను సన్మానించిన డీఆర్‌ఓ వెంకటరమణ
ఒంగోలు సబర్బన్: జాతీయ చేనేత దినోత్సవాన్ని ఒంగోలులోని కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చేనేత, జౌళి శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట రమణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాచీన కళావైభవానికి చేనేత రంగం ప్రతీక అని కొనియాడారు. చేనేత కార్మికుల కుటుంబాలకు ఆసరాగా నిలిచి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,210 మంది చేనేత కార్మికులు ఉన్నారని, 12 చేనేత సహకార సంఘాలు విస్తరించి ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో ప్రధానంగా రూపుదిద్దుకునే జాకార్డ్ డిజైన్ చీరలు, సెమీ గద్వాల్ చీరలు, లుంగీలు, డ్రెస్ మెటీరియల్స్, షర్టింగ్ వస్త్రాలకు మార్కెట్‌లో మంచి ఆదరణ ఉందన్నారు. సమాజంలోని ప్రతిఒక్కరూ చేనేత ఉత్పత్తులు కొనుగోలు చేసి నేతన్నల శ్రమకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందించాలని డీఆర్వో పిలుపునిచ్చారు. అనంతరం పలువురు చేనేత కార్మికులను సత్కరించారు.


