కనిగిరిలో పోలీసుల అరాచకం
దౌర్జన్యంగా దీక్ష శిబిరం తొలగింపు
రోడ్డుపై బైఠాయించిన వైఎస్సార్ సీపీ నేతలపై దురుసు ప్రవర్తన
దర్శిలో దీక్ష భగ్నానికి పోలీసుల యత్నం
డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ చేయాలి
మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి
డీఎస్సీ అక్రమాలపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాలతో కలిసి వైఎస్సార్ సీపీ నిరసన దీక్షలు
కనిగిరిలో పోలీసులు దీక్షలు భగ్నం చేసేందుకు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని పోలీసులు ఉదయాన్నే కూల్చి వేశారు. శిబిరాలు నిర్వహించేందుకు పార్టీ నాలుగు రోజులుగా అనుమతి కోరుతూనే ఉంది. ఉద్దేశపూర్వకంగానే అనుమతివ్వని పోలీస్ అధికారులు.. దీక్షా శిబిరానికి ఎలాంటి అనుమతులు లేవంటూ బుధవారం రాత్రి వేసిన టెంట్‌లను గురువారం వేకువజామునే తొలగించారు. తమకు పైనుంచి ఒత్తిడి ఉందంటూ నిర్ధాక్షణ్యంగా తొలగించారు. దీంతో వైఎస్సార్ సీపీ కనిగిరి ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్, పార్టీ శ్రేణులు, యువత, వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక చర్చి సెంటర్ రోడ్డులో బైఠాయించి శాంతియుతంగా నిరసన తెలిపారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ.. ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా.. ఎవరికీ ఇబ్బంది జరగకుండా ప్రశాంతంగా, శాంతియుతంగా నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయిస్తే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందంటూ ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని, ప్రైవేటు స్థలాల్లో కూర్చుని నిరసన తెలుపుకోవాలని కనిగిరి, పామూరు సీఐలు, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలీసులతో వచ్చి బలవంతం చేశారు. వైఎస్సార్ సీపీ కనిగిరి ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ మాట్లాడుతూ 20 ఏళ్ల నుంచి కనిగిరిలో అన్ని పార్టీలకు చెందిన వారు నిరసనలు, ధర్నాలు చేసుకునే ప్రదేశమైన పీవీఆర్ పార్క్ వద్ద దీక్షా శిబిరం ఏర్పాటు చేస్తే పర్మిషన్ ఇవ్వకుండా పైనుంచి ఒత్తిడి వచ్చిందంటూ తొలగించారని, మళ్లీ ఇప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా నిరసన తెలుపుతుంటే ఇక్కడ ఖాళీ చేయమంటున్నారని, మేం ఏం తప్పు చేశామని పోలీసులకు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా..? అని నిలదీశారు. ఇక్కడేమైనా జంగిల్ రాజ్ పాలన సాగుతోందా.. అంటూ తీవ్రంగా ప్రతిఘంటించారు. కనిగిరి ఇన్‌చార్జి డీఎస్పీ పి.శ్రీధర్ నేతృత్వంలో పోలీసు బలగాలు మొహరించాయి. పార్టీ నాయకులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీ ఇన్‌చార్జి దద్దాల నారాయణతో పాటు, పార్టీ శ్రేణులను పోలీసులు దౌర్జన్యంగా రోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తాయి. అనంతరం పార్టీ కనిగిరి ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్‌తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలో దాదాపు గంట సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా దద్దాల మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాల్లో, అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉండి పోరాటం చేస్తామని, మూడు రోజుల పాటు కనిగిరిలో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
సాక్షి నెట్‌వర్క్:
డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ చేపట్టాలని, అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు విద్యార్థి సంఘాలతో కలిసి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన దీక్షలు చేపట్టారు. అయితే, కనిరిగి పట్టణంలో పోలీసులు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు అత్యుత్సాహం చూపించారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో ‘ప్రశ్నిస్తే.. గొంతు నొక్కేస్తారా..? ఇది ప్రజాస్వామ్యమా.. లేక రెడ్‌బుక్ రాజ్యాంగమా’ అన్న తీరులో పోలీసులు వ్యవహరించారు. దర్శిలో సైతం పోలీసులు దీక్షను భగ్నం చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఈ పోరాటం ఆగదని, అరెస్టులు, దాడులు తమను ఆపలేవని, డీఎస్సీ కుంభకోణానికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ దీక్ష శిబిరాల వద్ద నాయకులు, విద్యార్థి సంఘాల నేతలు నినదించారు. నైతిక బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాలని, సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమాలపై చంద్రబాబు ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటం ఆగదని హెచ్చరించారు.
దర్శిలో...
దర్శిలోనూ రిలే నిరాహారదీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు శతవిధాలా యత్నించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం పది గంటలకు విద్యార్థి సంఘాల నేతలతో కలిసి వైఎస్సార్ సీపీ నాయకులు దీక్షను ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు ముగ్గురు కానిస్టేబుళ్లు వచ్చి శిబిరాన్ని ఖాళీ చేయాలని హడావిడి చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు సీఐ రామారావు తన బృందంతో వచ్చి శిబిరాన్ని తొలగించాలంటూ హంగామా చేశారు. ఈ రోజుకు ఇక్కడే నిర్వహిస్తామని, శుక్రవారం నుంచి వేరే చోటకు మారుస్తామని జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ నాయకులు సమాధానం చెప్పారు. సాయంత్రం 3.30 గంటలకు డీఎస్పీ బాలమురళీకృష్ణ వచ్చి శిబిరాన్ని తొలగించాలని పట్టుబట్టారు. ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని శివప్రసాద్‌రెడ్డి డీఎస్పీకి చెప్పారు. కొంతసేపటి తర్వాత తొలిరోజు దీక్షను ముగించారు. మిగిలిన రెండు రోజులు వేరే ప్రాంతంలో శిబిరం ఏర్పాటు చేస్తామని శివప్రసాదరెడ్డి తెలిపారు.
వై.పాలెంలో...
డీఎస్సీ–2025లో అక్రమాలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని యర్రగొండపాలెంలో నిరుద్యోగులు గళమెత్తారు. వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు గురువారం స్థానిక యూనియన్ బ్యాంక్ సమీపంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షను ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రారంభించారు. సాయంత్రం వరకు దీక్షలో కూర్చున్నారు. తొలిరోజు రిలే నిరాహార దీక్షలో నియోజకవర్గంలోని వివిధ విభాగాల నాయకులతో పాటు నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలి : అన్నా రాంబాబు
మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మండిపడ్డారు. వైఎస్ జగన్ ఆదేశాలతో గురువారం మార్కాపురంలో రిలే దీక్షలు ప్రారంభించారు. తొలిరోజు దీక్షలో మార్కాపురం, పొదిలి మండలాలకు చెందిన 70 మంది నిరుద్యోగులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నా మాట్లాడుతూ సమాజ భవిష్య త్తును తీర్చిదిద్దే పవిత్రమైన ఉపాధ్యాయ పోస్టులను వక్రమార్గంలో కట్టబెట్టడం సమంజసం కాదన్నారు. నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో టీడీపీ కార్యకర్తలకు దొడ్డి దారిన ఉద్యోగాలిచ్చి అర్హులకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఈ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని, తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
స్పోర్ట్స్ కోటా పేరుతో పోస్టుల అమ్మకాలు : ఆదిమూలపు సురేష్
కొండపి నియోజకవర్గంలోని జరుగుమల్లిలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. దీక్షల్లో పెత్త ఎత్తున యువత పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటా పేరు చెప్పి వేలాది ఉద్యోగాలను ఒక్కో పోస్టును రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. అర్హులైన డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ :
మాజీ మంత్రి మేరుగు నాగార్జున
సంతనూతలపాడులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో నిర్వహించిన దీక్షలను మాజీ మంత్రి, పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ మేరుగు నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ నిరుద్యోగుల పట్ల దగా డీఎస్సీగా మారిందని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో భారీగా అవినీతి జరిగిందని, అర్హత లేని వారికి ఉద్యోగాలు కల్పించారని విమర్శించారు. డీఎస్సీ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నైతిక విలువలుంటే లోకేష్ రాజీనామా చేయాలి : బుర్రా మధుసూదన్‌యాదవ్
కందుకూరులో మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున రిలే దీక్షలు చేపట్టారు. మాజీ మంత్రి, పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్దన్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి బుర్రాతో కలిసి అభ్యర్థుల మెడలో పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. డీఎస్పీలో జరిగిన అక్రమాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏమాత్రం నైతిక విలువలున్నా డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ వెంటనే మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తొలి రోజు దీక్షలో పెద్ద ఎత్తున డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు, యువత పాల్గొన్నారు. కనీసం క్రీడా మైదానంలోకి దిగని వారు కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించారని, బంగారు పతకాలు సాధించిన వారిని ఉద్యోగానికి అనర్హులుగా చేశారని డీఎస్సీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరుద్యోగులను మోసం చేసిన ఘనత
చంద్రబాబుదే : చుండూరి రవిబాబు
రాష్ట్రంలో దగా పాలన నడుస్తోందని.. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలోని పోస్టులు అమ్ముకుని నిరుద్యోగులను మోసం చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు. ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహారదీక్షను రవిబాబు ప్రారంభించారు. లోకేష్ రాజీనామా చేయాలి.. షేమ్ షేమ్ లోకేష్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతం మోర్మోగింది. ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడారు.
డీఎస్సీలో పెద్ద ఎత్తున అక్రమాలు :
కేపీ నాగార్జునరెడ్డి
డీఎస్సీ 2025 నిర్వహణలో జరిగిన భారీ అవినీతి, అక్రమాలపై తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలని.. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి కేపీ నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రం అర్ధవీడులో జెండా చెట్టు వద్ద వైఎస్సార్ విగ్రహం సమీపాన రిలే నిరాహార దీక్షలో పాల్గొని మాట్లాడారు. ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు జరిగిన రిలే నిరాహార దీక్షకు ప్రజలు, నిరుద్యోగుల నుంచి మద్దతు లభించింది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగించిన దీక్షల్లో కూర్చున్న వారికి నాగార్జునరెడ్డి నిమ్మరసం తాగించి విరమింపజేశారు.
అద్దంకిలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా
నినాదాలు...
డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై అద్దంకిలో వైఎస్సార్ సీపీ నాయకులు భగ్గుమన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో టౌన్ హాల్ సమావేశం నిర్వహించారు. దీనికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరై మద్దతు ప్రకటించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. దీక్షలు చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులకు పార్టీ లీగల్ సెల్ నాయకులు మద్దతు ప్రకటించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సంతనూతలపాడులో దీక్షలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ
ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, నాయకులు, కార్యకర్తలు
కందుకూరులో మాట్లాడుతున్న నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్, పక్కన మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి
అర్ధవీడులో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి
కేపీ నాగార్జునరెడ్డి, నాయకులు
అద్దంకిలో రిలే దీక్షలు ప్రారంభించి మద్దతుగా కూర్చున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్డర్ చింతలపూడి అశోక్‌కుమార్, నాయకులు
డీఎస్సీ అక్రమాలపై గర్జించిన విద్యార్థులు, వైఎస్సార్ సీపీ నేతలు
అక్రమ అరెస్టులతో ఉద్రిక్తత


