కనిగిరిరూరల్: చేనేత కార్మికులకు రుణాలు అందించేంకు ప్రభుత్వం ‘నేతన్న సేవలో’ పథకం ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకం కేవలం పచ్చ నేతలకే నన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతల ఆశీస్సులు, సిఫార్సులు ఉన్న వారి దరఖాస్తులను మాత్రమే ‘నేతన్న సేవలో’ స్కీం లాగిన్‌లో అధికారులు అప్ లోడ్ చేసినట్లు కనిగిరి నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. కొన్ని గ్రామాల్లో దరఖాస్తుదారుల వద్ద అధికార పార్టీ నేతలు, సచివాలయ అధికారులు మిలాఖత్ అయి హస్తలాఘవం చూపించారనే ఆరోపణలున్నాయి. నేత వృత్తిలో ఉన్న వాస్తవ కార్మికుడు కాకుండా..అనర్హుల దరఖాస్తులు కూడా అన్‌లైన్ చేసినట్లు సమాచారం. అధికార పార్టీ నేతలు, అధికారులు చేనేత కార్మికుడిగా ఐడీ కార్డు ఇప్పించడం, అతని చేత దరఖాస్తు చేయించడం.. ఈ తంతు జరిపినందుకు లబ్ధిదారుని వద్ద నుంచి రూ.7వేల వరకు నజరానాలు తీసుకున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రూ.25 వేలు రుణం వస్తున్నండటంతో వారు కిమ్మనకుండా అమ్యాయ్యాలు ఇస్తున్నట్లు సమాచారం. ఈ లాలుచీలో సచివాలయం నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి అధికారుల వరకు తలాపాపం తిలా పిడికెడు అన్న చందంగా భాగస్వామ్యం ఉన్నట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే వాస్తవ అర్హుల దరఖాస్తులు కనీస పరిగణనలోకి తీసుకోకుండా రాజకీయ పలుకుబడి.. సిఫార్సులు ఉన్న వారందరి దరఖాస్తులు అన్‌లైన్ చేయడం పట్ల అర్హత కల్గిన నేతన్నలు మండిపడుతున్నారు.
గతంలో ఒక్కటి లేని చోట
నేడు పదుల సంఖ్యలో..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సారిగా చేనేత కార్మికులకు రుణాల మంజూరు ‘నేతన్న సేవలో’ స్కీంకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. అయితే కొన్ని చోట్ల రెండ్రోజుల్లో మాత్రమే దరఖాస్తులు స్వీకరణ పూర్తి చేశారు. నియోజకవర్గంలో సగం మందికి పైగా వాస్తవ అర్హుత కల్గిన నేతన్నల దరఖాస్తుల అన్‌లైన్ కాలేదు. అందిన సమాచారం ప్రకారం కనిగిరి మండలంలోని 25 పంచాయతీలు, 20 సచివాలయ వార్డుల్లో 11 సచివాలయాల్లో మాత్రమే చేనేత కార్మికుల రుణాలకు దరఖాస్తుల స్వీకరణ జరిగినట్లు తెలిసింది. కనిగిరి మండలంలో బడుగులేరులో 4, చల్లగిరిగిల్లలో 33, చిన ఇర్లపాడులో 45, చిన అలవలపాడులో 5, యడవల్లిలో 205, గోసులవీడులో 64, గుడిపాడులో 36, ఏరువారిపల్లిలో 29, వంగపాడులో 8, పునుగోడులో 3, తాళ్లూరులో 81 దరఖాస్తులు అన్‌లైన్‌లో నమోదు చేసినట్లు తెలిసింది. గతంలో కనీసం ఒక్కరికి కూడా అర్హత లేని చోట ఇప్పుడు అధికార పార్టీ నేతలు నేతన్న ఐడీ కార్డులు ఇప్పించి అప్లికేషన్ పెట్టించినట్లు ప్రచారం సాగుతోంది.
అర్జీలు కూడా స్వీకరించని అధికారులు
మరీ దుర్మార్గం ఏమిటంటే కనీసం ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరుల అర్జీలు స్వీకరించడానికి కూడా సచివాలయ వెల్ఫేర్ అధికారులు ఇష్టపడలేదు. రెండ్రోజులు గడిచిన తర్వాత, చివరి సమయంలో అన్‌లైన్ గడువు ముగిసిన తర్వాత సచివాలయ అధికారి వెబ్‌సైట్‌లో దరఖాస్తులు నమోదు చేసినట్లు గుడిపాడుకు చెందిన చేనేత కార్మికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎంపీడీఓ ఖాదర్‌బాషాను చేనేతలు అడగ్గా..5వ తేది 1.45 నిమిషాలకే తాము లిస్ట్ ఫైనల్ చేసి పంపామని.. తాను ఏమీ చేయలేనని, గడువు ముగిసిందని.. అవకాశం ఉంటే రెండో విడతలో చూద్దాం అంటూ దాటవేస్తున్నారు. కనీసం బాధితులతో మాట్లాడేందుకు కూడా ఎంపీడీఓ ఇష్ట పడడం లేదు. దీని బట్టిచూస్తే.. అధికారులు ఎంత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
అధికారపార్టీ నేతల సిఫార్సు ఉంటేనే నేతన్న దరఖాస్తులు అన్‌లైన్..
గుడిపాడులో మగ్గం నేతల దరఖాస్తులు తీసుకొని వైనం
కనీసం అర్జీ తీసుకోవడానికి
ఇష్టపడని ఎంపీడీఓ
గడువు ముగిసిన తర్వాత ఆన్‌లైన్
చేసిన వెల్ఫేర్ అధికారి
కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్న బాధితులు


